Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

షేక్‌స్పియర్‌ శైలిలో ధిక్కారం ఆనవాళ్లు

వెతుకులాట అనవసరం. ప్రపంచం ఎప్పటికీ మననం చేసుకుంటూ ఉండే అద్భుతమైన నాటకాలను ఆంగ్లసాహిత్యం ద్వారా కానుకగా అందించిన మహా రచయిత షేక్‌స్పియర్‌... గురించి తెలియని చదువరులు ఉండరు. ఆయన శైలిలో ధిక్కారం ఆనవాళ్లు ఉన్నాయని అనగానే.. తమకు తెలిసిన షేక్‌స్పియర్‌ రచనలను గుర్తు చేసుకుని.. అందులో ధిక్కారం ఎక్కడ ఉందా? అని ఆలోచించడం అనవసరం. ఎందుకంటే.. శైలి అంటే రచనా శైలి కాదు.. జీవనశైలి. 

షేక్‌స్పియర్‌ గొప్ప రచయితే గానీ.. ఆయన చాలా తరచుగా, అలవాటుగా ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు ఎగ్గొడుతుండే వాడుట. ఆ ధిక్కారం వల్ల అనేకమార్లు ఆయనపై కేసులు నమోదు కావడమూ, కోర్టుల చుట్టూ తిరిగి అక్షింతలు వేయించుకోవడమూ, జరిమానాలు కట్టడమూ, జైలు శిక్ష బెదిరింపులను కూడా స్వీకరించడమూ ఆయన జీవితంలో నిత్యకృత్యం అట. 

షేక్‌స్పియర్‌ మరో జీవితం అనే పుస్తకం కోసం పరిశోధకులు జయ్నే ఆర్చర్‌, రిచర్డ్‌ మార్గార్ఫ్‌ చేసిన పరిశోధనలు ఈ వాస్తవాల్ని వెల్లడించాయి. యూరోప్‌ దుర్భిక్షం సమయంలో తన వద్ద ఉన్న ధాన్యపు గింజల్ని స్థానికులకు బ్లాక్‌ లో విక్రయించే అలవాటు కూడా షేక్‌స్పియర్‌కు ఉండేదని వాళ్లు తేల్చారు. 
హవ్వా! అనుకుంటున్నారా? పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచి అంటే ఇదే. మనిషికో ధిక్కారం, వెర్రి ఉంటాయి. అందుకు ఎవ్వరూ అతీతులు కాదు మరి!!

More Telugu News