స్నేహం మనుషులకే పరిమితం కాదు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్నేహం మనుషులకే పరిమితం కాదు!

సృష్టిలో అత్యంత మధురమైన భావన ప్రేమ అనుకుంటే, అలాంటి దివ్యమైన అనుభూతికి పునాది స్నేహం. ప్రేమకు ఆకర్షణే తొలి మెట్టు అని కొందరు భావించవచ్చేమో, కానీ, అలాంటి ప్రేమలు స్వల్ప వ్యవధిలోనే సమసిపోతాయి. అపరిపక్వత ఉన్న వ్యక్తుల నడుమ ఇలాంటి తాత్కాలిక బంధాలే ఏర్పడతాయి. అయితే, నిజమైన స్నేహం అలా కాదు. అది భావ సారూప్యత ఉన్న వ్యక్తుల మధ్య చిగురించే అగోచర బంధం. సర్వకాల సర్వావస్థల్లో నీకు నేనున్నానంటూ ఇవ్వగలిగిన భరోసాకు మరోపేరే స్నేహం.

దాన్ని మైత్రి, చెలిమి, మిత్రత్వం ఎలా అయినా పిలుచుకుందాం. స్వభావం ఒక్కటే. అందుకే, నిజమైన స్నేహమనే పునాదిపై వెలిసిన ప్రేమ సౌధం చిరకాలం మన్నుతుంది, చరిత్రలో చెరగని సంతకంలా మిగులుతుంది. అయితే, ఈ చెలిమి పోకడల్లోనూ వైరుధ్యాలు లేకపోలేదు. అపనమ్మకం, అపోహలు, అపార్థాలు.. ఇద్దరు వ్యక్తుల మధ్య అంతులేని అగాధాల్ని సృష్టించగలవు. ఆశ్చర్యకరంగా ఇవన్నీ మనుషుల్లోనే కనిపిస్తాయి.

పశుపక్ష్యాదుల మధ్య కూడా మైత్రి ఉంటుంది. అవి ఒక్కసారి జతకూడాయంటే, తుదిశ్వాస విడిచేవరకు ఒకదాన్నొకటి వీడవు. రాగద్వేషాల గురించి యోచించే ఆలోచనా శక్తి లేకపోవడం వాటి అదృష్టం. ఇక సర్వశక్తి సమన్వితులు, అపార జ్ఞాన సంపన్నులు అయిన మనుషుల మధ్యనే అభిజాత్యాలు, భేషజాలు కనిపిస్తాయి, వినిపిస్తాయి. ఏ కొందరో నిస్వార్థంగా మసులుకుంటూ, నిజమైన స్నేహానికి నిలువెత్తు నిర్వచనంలా గోచరిస్తారు.

కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేషం.. ఇలాంటి వాటికి వీరి హృదయాల్లో చోటు ఉండదు. కొందరైతే వాటినే శ్వాసిస్తారు. వీటితోనే చెలిమిని తూకం వేస్తారు. నువ్వెంత స్నేహిస్తే.. నేనంతే స్నేహిస్తా అంటూ దోస్తానాకి సరికొత్త భాష్యం చెబుతారు. ఇలాగే కొందరు అనుమానాలతో మిత్రులను దూరం చేసుకోవడం తెలిసిందే. ఎంతగా అంటే, ఎదురుగా మిత్రుడు వస్తున్నా, ఎవరో పరిచయంలేని వ్యక్తి మల్లే తప్పుకుని నిర్దయగా వెళ్ళిపోతారు.

ఇది ఎంతవరకు సబబు. వారిది అమాయకత్వం అనుకోవాలేమో. ఇలాంటి ప్రతిఘాతాలు తాకినపుడు సున్నిత సుమనస్కులైతే రెండు కన్నీటి చుక్కలు రాల్చుతారు. మనసంటూ లేనివాళ్ళకు ఏ బాధా లేదు. ప్రేమలో విపరీత ఘటనలు చోటు చేసుకోవడం ఇలాంటి ధోరణుల వల్లే. ఏదేమైనా, స్నేహానికి నమ్మకమే ప్రధాన వనరు అన్నది సుస్పష్టం. అది లోపించిన నాడు వేర్లు తెగిన వృక్షమల్లే చెలిమి కూడా మోడువారుతుంది, స్నేహ సుమాలూ నేలరాలుతాయి. సో.. మనం కూడా నిజాయతీ ఉన్న మిత్రత్వానికే ఓటేద్దేమా?

More Telugu News