ఆంధ్రప్రదేశ్ లో సంతాన రేటు తక్కువే
పెళ్లయిన దంపతులకు పండంటి బిడ్డ పుట్టినప్పుడే అసలైన సంతోషం. లేకుంటే పెళ్లి చేసుకున్నామన్న ఆనందం కూడా వారిలో ఆవిరైపోతుంది. మారుతున్న రోజులు, తీసుకుంటున్న ఆహారంలో మార్పులు, ఒత్తిడి ఇలా ఎన్నో రకాల కారణాల వల్ల నేటి తరాలలో సంతాన సాఫల్యత తగ్గిపోతోంది. వీటికి తోడు ఒక్కరు, ఇద్దరితోనే చాలా మంది నియంత్రణ పాటిస్తున్నారు. సంతాన సాఫల్యత దేశంలో ఏ రాష్ర్టంలో ఎలా ఉందో ఇటీవలే ఒక సర్వే జరిగింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం సంతాన సాఫల్యత వివిధ రాష్ర్టాలలో ఇలా ఉంది. సగటున ఒక్కో మహిళకు ఎంత మంది శిశువులు జన్మిస్తున్నారనే విషయాన్ని పాయింట్ల ప్రకారం తెలుసుకోవచ్చు.
అత్యంత కనిష్టంగా తమిళనాడులో సంతాన సాఫల్యత రేటు 1.7గా ఉంది. ఈశాన్య రాష్ర్టం మేఘాలయ 3.8 సంతాన సాఫల్య రేటుతో అగ్ర స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ కూడా 1.8 కనిష్ట రేటును కలిగి ఉంది. 2.1 రేటును కనీస రేటుగా పరిగణించవచ్చు. అంతకంటే దిగువన ఉంటే చాలా తక్కువగా ఉన్నట్లు లెక్క.
తమిళనాడులో సంతాన సాఫల్యత 1.7 ఉండగా, గోవా, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, కేరళ, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్ రాష్ర్టాలలో 1.8 రేటు నమోదైంది. మహారాష్ర్ట, ఢిల్లీలో 1.9, సిక్కిం, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్ లో 2.0, త్రిపురలో 2.2, ఒడిసా, హర్యానా, ఉత్తరాఖండ్ లో 2.3 సంతాన సాఫల్యత ఉంది. అసోం, గుజరాత్ లో 2.4, మణిపూర్, ఛత్తీస్ గఢ్ లో 2.8, మిజోరాంలో 2.9, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్ లో 3.0, రాజస్థాన్ లో 3.1, మధ్యప్రదేశ్ 3.2, ఉత్తరప్రదేశ్ 3.5, నాగాలాండ్, బీహార్ లో 3.7, మేఘాలయలో 3.8 ఉంది.