Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారత్ రెండో ర్యాంకుకు ఇంగ్లండ్ అడ్డు

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో రెండో ర్యాంకుకు ఎగబాకాలన్న భారత్ ఆశలపై ఇంగ్లండ్ నీళ్ళు చల్లింది. ఎలాగంటారా, రెండ్రోజుల క్రితం ఢిల్లీ టెస్టులో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్ ఆ సిరీస్ ను 4-0తో క్లీన్ స్వీప్ చేసింది. తద్వారా రెండో ర్యాంకు అవకాశాలను మెరుగుపరుచుకుంది. అయితే, టీమిండియా చాన్సులు.. ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య ఆక్లాండ్ లో జరిగిన టెస్టు ఫలితంపై ఆధారపడాల్సి వచ్చింది.

ఈ మ్యాచ్ డ్రాగా ముగియడంతో రెండో ర్యాంకులో ఉన్న ఇంగ్లండ్ తన స్థానాన్ని పదిలపరుచుకుంది. అయితే, ఈ టెస్టులో గనుక ఇంగ్లీష్ జట్టు ఓటమిపాలై ఉంటే భారత్ రెండో ర్యాంకుకు చేరుకునేది. కానీ, ఇంగ్లండ్ వికెట్ కీపర్ మాట్ ప్రయర్ (110) వీరోచిత పోరాటంతో ఇంగ్లండ్ ఓటమి నుంచి గట్టెక్కింది.

దీంతో, భారత్ మూడో ర్యాంకుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సీజన్ ఏప్రిల్ 1తో ముగియనుండగా, మూడో స్థానంలో నిలిచిన భారత్ కు రూ. 13.5 కోట్లు దక్కనున్నాయి. ఇక  టెస్టు ర్యాంకింగ్స్ లో అగ్రస్థానంలో కొనసాగుతున్న దక్షిణాఫ్రికా రూ. 24 కోట్లు కొల్లగొట్టనుంది. 

More Telugu News