‘జీరో’ ఎఫ్ఐఆర్ తో రైలు దొంగతనాలకు చెక్..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘జీరో’ ఎఫ్ఐఆర్ తో రైలు దొంగతనాలకు చెక్..!

రైల్లో దొంగతనం జరిగితే ఏ పీఎస్ లో ఫిర్యాదు చేయాలి? అన్ని రైల్వే స్టేషన్లలో రైల్వే పోలీస్ స్టేషన్లుండవు. అలాంటప్పుడు ఏం చేయాలి? మౌలాలీలో నగదు మిస్సయితే కాజీపేట వరకు ఆగాల్సిందేనా? అన్నవరంలో బంగారు నగలు పోతే సామర్లకోట స్టేషన్ వచ్చే వరకు పోలీసుల కోసం ఎదురు చూడాల్సిందేనా? ఇకపై ప్రయాణికులు అలా బాధపడుతూ కూర్చోనక్కర్లేదంటున్నారు రైల్వే పోలీసులు.

‘జీరో’ ఎఫ్.ఐ.ఆర్ అనే కొత్త పద్ధతిని అమలు చేయబోతున్నారు. ప్రయాణం చేస్తూనే ఏదో ఒక రైల్వే స్టేషన్ లో ఫిర్యాదు దాఖలు చేయవచ్చు. దీన్ని ఆ స్టేషన్ సిబ్బంది సమీప పోలీస్ స్టేషనుకు ఫ్యాక్స్ చేస్తారు. దాంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై దొంగల్ని పట్టుకోవడానికి వీలుంటుంది.

ఢిల్లీలో ఈరోజు (శుక్రవారం) జరిగిన రైల్వే ఐజీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటిదాకా ఏ పోలీస్ స్టేషన్ పరిధి ఎక్కడి దాకా అన్నది పెద్ద సమస్యగా ఉంది. వేరే చోట దొంగతనం అయితే తమ స్టేషనులో కేసు నమోదు చేసేది లేదని పోలీసులు వాదిస్తున్నారు. దాంతో, పోలీసులు రంగంలోకి దిగడం ఆలస్యమవుతుండటంతో దొంగలు సొమ్ముతో జారుకుంటున్నారు. దీంతో పాటు గవర్నమెంట్ రైల్వే పోలీసు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు, రాష్ట్రాల పోలీసుల మధ్య కూడా సరిహద్దుల విషయంలో బోల్డన్ని పట్టింపులున్నాయి. ఇవన్నీ కేసులను నీరు కార్చే విధంగా ఉన్నాయి.

కొత్త విధానం అమల్లోకి వస్తే ఆ సమస్యలన్నీ పరిష్కారమౌతాయని, వీలైనంత త్వరగా సొమ్ము రికవరీ చేయవచ్చునని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. ప్రయాణికులు కూడా జీరో ఎఫ్.ఐ.ఆర్ వల్ల ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

More Telugu News