Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శివుడి ఆలయంలో ఇస్లాం సాంప్రదాయ రీతిలో నిఖా!

శివుడి ఆలయంలో జరిగిన నిఖా... హిందూ-ముస్లిముల ఐక్యతను మరోసారి చాటిచెప్పింది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ వివాహంతో అక్కడ మతసామరస్యం వెల్లివిరిసింది. యూపీలోని బులంద్ షహర్ జిల్లా పరిధిలోని రాంనగర్ గ్రామ వాసి అయిన ఇక్బాల్ ఖాన్ కు ఇద్దరు కూతుళ్లు నజ్మా, ముజ్మా. వారికి అదే జిల్లాకు చెందిన ఇద్దరు యువకులతో వివాహం నిశ్చయమైంది. ఇక్బాల్ తన కూతుళ్ల వివాహం (నిఖా) మతసామరస్యానికి చిహ్నంగా ఉండాలని భావించాడు. వెంటనే ఊళ్లోని శివాలయంలో నిఖా నిర్వహించాలని నిర్ణయించుకున్నాడు.

రాంనగర్ గ్రామంలోని ఇరు మతాలకు చెందిన పెద్దలతో ఇక్బాల్ మాట్లాడి వారి ఆమోదం తీసుకున్నారు. కాబోయే వరులు కూడా శివాలయంలో నిఖా చేసుకోవడానికి ఆనందంతో అంగీకరించారు. ఇక ఆలయ పూజారులయితే వారిని సాదరంగా ఆహ్వానించారు. దాంతో, ఊరి జనమంతా శివాలయంలో జరిగే నిఖాకు భారీగా తరలివచ్చారు. ఇరు మతాలకు చెందిన వందలాది మంది సాక్షిగా, శివుని సన్నిధిలో... ఇస్లాం సంప్రదాయాలకు అనుగుణంగా, ఖాజీల మంత్రోచ్చారణల మధ్య ఇక్భాల్ ఇద్దరు కూతుళ్ల నిఖా ఘనంగా జరిగింది.

More Telugu News