స్కాట్లాండ్ ను బెదిరిస్తున్న బ్రిటన్
స్వతంత్ర దేశంగా అవతరించాలని ఆశిస్తున్న స్కాట్లాండ్ పై బ్రిటన్ బెదిరింపులకు తెరదీసింది. బ్రిటన్ నుంచి విడిపోవాలనుకుంటే పౌండ్ ను కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఓ స్వతంత్ర దేశంతో పౌండ్ ను పంచుకునేందుకు బ్రిటన్ అంగీకరించబోదని బ్రిటిష్ ఆర్ధిక మంత్రి జార్జ్ ఆస్బోర్న్ తేల్చి చెప్పారు. విడిపోవడంపై ఈ ఏడాది నిర్వహించనున్న రిఫరెండంలో స్కాట్లాండ్ ఓటేస్తే పౌండ్ పై ఆశలు వదులుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. బ్రిటన్ ను వదిలి వారు వెళ్ళాలనుకుంటే పౌండ్ కూడా వారిని వదిలి వచ్చేస్తుందని చెప్పారు. కాగా, స్కాట్లాండ్ కు చెందిన స్కాటిష్ నేషనల్ పార్టీ దీనిపై స్పందిస్తూ, పౌండ్ పై అధికారం పొందే హక్కు తమకుందని ధీమా వ్యక్తం చేసింది.