Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫిబ్రవరి 18 తర్వాతే తెలంగాణ బిల్లు: న్యాయశాఖ

15వ లోక్ సభ ముగియడానికి మూడు రోజుల ముందు.. అంటే ఫిబ్రవరి 18వ తేదీన తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టేందుకు న్యాయశాఖ ఏర్పాట్లు చేస్తోందని పీటీఐ కథనంలో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాజ్యాంగ సవరణ అక్కర్లేదని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

పార్లమెంటులో సాధారణ మెజార్టీ ద్వారా కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చని లోక్ సభ సచివాలయానికి న్యాయశాఖ ఈరోజు ఉదయం వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, 4(2) ప్రాతిపదికగా తీసుకోవాలని న్యాయశాఖ సూచించింది. ఆంధ్రప్రదేశ్ విభజనకు సాధారణ తీర్మానం మాత్రమే అవసరమని కేంద్ర మంత్రివర్గానికి ఇదే వరకే మంత్రుల బృందం తెలిపిందని లోక్ సభ సచివాలయం దృష్టికి తీసుకువచ్చారు. అయితే తెలంగాణలో శాసనమండలికి మాత్రం మూడింట రెండొంతుల మెజార్టీ అవసరమని న్యాయశాఖ తెలిపింది.

ప్రస్తుత రాష్ట్ర విభజనకు.. అలాగే దేశంలోని 29వ రాష్ట్ర ఏర్పాటుకు ఎలాంటి రాజ్యాంగ సవరణలు అక్కర్లేదని న్యాయశాఖ అధికారులు చెప్పారు. ఈ నేపథ్యంలో ఓటు ఆన్ అకౌంట్ బడ్జెట్ 2013-14ను ఆమోదించిన తర్వాతనే.. ఫిబ్రవరి 18న తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని పీటీఐ కథనంలో పేర్కొంది.

More Telugu News