అవినీతి ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బహిరంగంగా కాల్చి చంపాలి: కర్ణాటక మాజీ డీజీపీ
కర్ణాటక మాజీ డీజీపీ శంకర్ బిదరి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. అవినీతిపరులైన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బహిరంగంగా కాల్చి చంపాలని అన్నారు. కోట్లాది రూపాయలను వెనకేసుకుంటున్న రాజకీయ నాయకులను కూడా కాల్చి చంపాలని వ్యాఖ్యానించారు. లేకపోతే ఈ వ్యవస్థలో నెలకొన్న అవినీతిని అంతం చేయలేమని అన్నారు. ఈ రోజు బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, ఆయనీ వ్యాఖ్యలు చేశారు. అవినీతిని రూపుమాపడానికి చట్టాలను మరింత కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని శంకర్ బిదరి అభిప్రాయపడ్డారు. అవినీతి కేసులలో ఇరుక్కున్న వారిపై రెండేళ్లలో శిక్షలను ఖరారు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి.