యాషెస్... ఇంగ్లండ్ విజయలక్ష్యం 561 పరుగులు
ఆస్ట్రేలియాలో జరుగుతున్న యాషెస్ మొదటి టెస్టులో ఆసీస్ పట్టు బిగించింది. బ్రిస్బేన్ లో జరుగుతున్న ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో కీలకమైన 159 పరుగుల లీడ్ సాధించిన ఆస్ట్రేలియా, రెండో ఇన్నింగ్స్ లో చెలరేగిపోయింది. ఓపెనర్ వార్నర్, కెప్టెన్ క్లార్క్ లు సెంచరీలు చేయడంతో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా దూసుకుపోయింది. అనంతరం, 7 వికెట్ల నష్టానికి 401 పరుగుల వద్ద ఆసీస్ తన రెండో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసి, కష్టసాధ్యమైన 560 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ ముందుంచింది. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ మరోసారి ఒత్తిడికి లోనై 24 పరుగులకే 2 వికెట్లు చేజార్చుకుంది. ప్రస్తుతం కెప్టెన్ కుక్, పీటర్సన్ క్రీజులో ఉన్నారు. మరో రెండు రోజుల ఆట మిగిలి ఉంది. ఇంగ్లండ్ ముందు మరో 537 పరుగుల భారీ లక్ష్యం ఉంది.