ఆచూకీ తెలిపితే లక్ష రూపాయలు
బెంగళూరులోని ఏటీఎంలో ఓ మహిళను కత్తితో తీవ్రంగా గాయపరచిన ఆగంతుకుడి ఆచూకీ తెలిపినవారికి లక్ష రూపాయల బహుమతి ఇవ్వనున్నట్టు బెంగళూరు పోలీసులు తెలిపారు. ఈ మేరకు బెంగళూరు పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ ఈ రివార్డును ప్రకటించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో బాధితురాలి సెల్ ఫోన్ ను ఆగంతుకుడు ఓ సెల్ ఫోన్ దుకాణంలో అమ్మేశాడు. దీంతో, ఫోన్ కొన్న దుకాణదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే, తాను ఫోన్ మాత్రమే కొన్నానని... అమ్మిన వ్యక్తి వివరాలు తనకు తెలియవని దుకాణదారు తెలిపాడు. దుకాణదారు నుంచి మరిన్ని వివరాలను రాబట్టేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారని బెంగళూరు కమిషనర్ తెలిపారు.