తెలంగాణ విషయంలో వెనకడుగు వేయలేం : జగన్ కు స్పష్టం చేసిన సురవరం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ విషయంలో వెనకడుగు వేయలేం : జగన్ కు స్పష్టం చేసిన సురవరం

తెలంగాణ ఏర్పాటు విషయంలో తాము వెనక్కి వెళ్లలేమని జగన్ కు చెప్పినట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తెలిపారు. కొద్దిసేపటి క్రితం సురవరంతో జగన్ భేటీ అయ్యారు. అనంతరం సురవరం మీడియాతో మాట్లాడారు. భేటీలో, రాష్ట్ర విభజన విషయంలో పునరాలోచించాలని జగన్ తమను కోరారని... దాన్ని తాము తిరస్కరించామని చెప్పారు. ఇదే సమయంలో సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం జరిగేలా కృషి చేస్తామని చెప్పినట్టు తెలిపారు. సీమాంధ్ర అభివృద్ధి, రాష్ట్ర విభజన రెండు అంశాలూ సమాంతరంగా జరగాలనేది తమ నిర్ణయమని సురవరం తెలిపారు.

విభజన విషయంలో ఆర్టికల్ 3డీని సరైన పద్ధతిలో ఉపయోగించుకోవాలని సురంవరం అన్నారు. అయితే వైసీపీ, సీపీఐల మధ్య పొత్తు గురించి తమ మధ్య సంభాషణ జరగలేదని చెప్పారు. తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన జరగకుండా చూడాలని జగన్ కోరారని తెలిపారు. ఇతర పార్టీలతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే కాంగ్రెస్ అధిష్ఠానం విభజన ప్రక్రియ చేపట్టిందని సురవరం విమర్శించారు. పార్లమెంటులో విభజనకు అనుకూలంగా ఓటు వేస్తామని తెలిపారు.

More Telugu News