ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.19 కోట్ల విరాళం
ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.19 కోట్లు విరాళంగా వచ్చాయి. పలువురి నుంచి ఈ విరాళాలు తమకు వచ్చినట్లు పార్టీ జాతీయ కార్యదర్శి పంకజ్ గుప్తా తెలిపారు. వివిధ వర్గాలకు చెందిన 63వేల మంది నుంచి ఈ విరాళాలను స్వీకరించినట్లు పేర్కొన్నారు. ఓ రాజకీయ పార్టీకి విరాళాలు ఇవ్వడం వారికిదే తొలిసారన్నారు. అయితే, విరాళంగా తాము రూపాయి నుంచి లక్ష రూపాయల వరకు తీసుకుంటున్నామన్నారు. రిక్షా పుల్లర్ నుంచి వ్యాపారుల దాకా విరాళాలు స్వీకరిస్తున్నట్లు వివరించారు. అయితే, ఢిల్లీ ఎన్నికల కోసం రూ.20 కోట్లు విరాళంగా వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. వచ్చిన విరాళాల్లో రూ.13.18 కోట్లు భారత్ లోని వారు ఇస్తే, ఆరు కోట్లను అమెరికా, యూకె, ఇతర దేశాలలోని ఎన్ఆర్ఐల నుంచి విరాళంగా వచ్చాయన్నారు.