మహిళలపై దాడిచేసిన నలుగురు పోలీసుల సస్పెన్షన్
ఇద్దరు మహిళలను తీవ్రంగా కొట్టి, జుట్టు పట్టుకుని లాగిన ఘటనలో నలుగురు కానిస్టేబుళ్లు సస్పెన్షన్ కు గురయ్యారు. నేరాలు, ఘోరాలకు ప్రసిద్ధిగాంచిన ఉత్తరప్రదేశ్ లో ఈ ఘటన జరిగింది. ఒక స్థల వివాదానికి సంబంధించి కొంతమంది మగవారిని, ఆడవారిని కుషినగర్ లోని ఓ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. అనంతరం ఒక వ్యక్తిని పోలీసులు చితకబాదుతుంటే... అక్కడే ఉన్న అతని ఇద్దరు తోబుట్టువులు (మహిళలు) పోలీసులకు అడ్డుపడ్డారు. దీంతో, విచక్షణ కోల్పోయిన నలుగురు పోలీసులు వారిద్దరినీ తీవ్రంగా కొట్టారు. ఒక మహిళను జుట్టు పట్టుకుని రోడ్డువరకు లాక్కొచ్చారు. ఈ ఘటన మొత్తం కెమెరాలో రికార్డయింది. దీంతో, దాడిచేసిన నలుగురు పోలీసులను సస్పెండ్ చేస్తున్నట్టు కుషినగర్ ఎస్పీ తెలిపారు. దీనిపై స్పందించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఆర్.పి.ఎన్.సింగ్... వీరికి ఈ శిక్ష సరిపోదని, ఇంతకన్నా కఠిన శిక్ష విధించాలని అన్నారు.