సహాయక చర్యలను వేగవంతం చేయండి : అధికారులకు సీఎం ఆదేశం
కష్టాలను పూర్తిగా తీర్చలేకపోయినా... బాధితులను అన్ని విధాలుగా ఆదుకుంటామని సీఎం కిరణ్ చెప్పారు. గుంటూరు జిల్లా బాపట్ల మండలం జిల్లెళ్లమూడి గ్రామంలో ఆయన వరద బాధితులను పరామర్శించారు. వరదల కారణంగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాల వల్ల నష్టపోయిన ప్రతి ఒక్కరికీ ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తామని తెలిపారు. ఐదు రోజుల పని కోల్పోయిన వారికి 10 కిలోలు, అంత కన్నా ఎక్కువ పనిదినాలు కోల్పోయిన వారికి 20 కిలోల చొప్పున బియ్యం ఇస్తామని చెప్పారు. దీంతోపాటు వస్త్రాలు, వంట సామాగ్రి కొనుక్కోవడానికి తక్షణ సాయంగా ఒక్కో ఇంటికి రూ. 2500 అందజేస్తామని హామీ ఇచ్చారు. వరద చుట్టుముట్టినా ధైర్యంగా ఉన్న జిల్లెళ్లమూడి ప్రజలకు కిరణ్ అభినందనలు తెలిపారు.