రాబర్ట్ వాద్రాపై దాఖలైన వ్యాజ్యాన్ని కొట్టేసిన సుప్రీంకోర్టు
సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా కంపెనీకి సంబంధించిన భూముల లావాదేవీలపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. వాద్రా కంపెనీలకు సంబంధించిన భూముల లావాదేవీలపై సీబీఐ విచారణ జరిపించాలని ఎం.ఎల్.శర్మ అనే న్యాయవాది సుప్రీంకోర్టులో పిల్ వేసిన సంగతి తెలిసిందే. దీన్ని విచారణకు తీసుకున్న ఉన్నత న్యాయస్థానం వ్యాజ్యాన్ని కొట్టివేస్తూ, వ్యక్తుల పరువు ప్రతిష్ఠలను బజారు కీడ్చడాన్ని సమర్థించమని కోర్టు స్పష్టం చేసింది. ఏ వ్యక్తి అయినా రాజకీయ నాయకులకు సంబంధించిన వారైనంత మాత్రాన... వారిని అపరాధులుగా చూడలేమని కోర్టు వ్యాఖ్యానించింది. పిటిషన్ లో, హర్యానా ప్రభుత్వం 21 వేల ఎకరాలకు లైసెన్స్ ఇచ్చిందని పేర్కొన్నారని... అయితే, అందర్నీ వదిలేసి కేవలం ఒక వ్యక్తి గురించే పిల్ వేయడంలో అర్థమేంటని కోర్టు ప్రశ్నించింది.