Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గర్భిణుల ఆనందమే పిల్లల ఆరోగ్యం

గర్భంతో ఉన్న సమయంలో తల్లులు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటే దాని ప్రభావం వల్ల వారికి పుట్టే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారని తాజా అధ్యయనంలో తేలింది. నిజానికి గర్భంతో ఉన్న సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ఉండాలని, ఎప్పుడూ సంతోషంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవన విధానంలో గర్భంతో ఉండే తల్లులు తీవ్ర ఒత్తిడిని, ఆదుర్దాను ఎదుర్కొనాల్సి వస్తోంది. దీని ఫలితంగా పిల్లలకు పలు ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. గర్భిణులు ఆదుర్దా, ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలతో సతమతమవుతుంటే అలాంటి వారికి పుట్టే పిల్లల్లో ప్రవర్తనా సంబంధమైన సమస్యలు వచ్చే ప్రమాదముందని పరిశోధకులు చెబుతున్నారు.

ఇలాంటి తల్లులకు పుట్టే పిల్లలు సుమారు పద్దెనిమిది నెలల వయసులో ఉన్నప్పటినుండే వారికి సమస్యలు మొదలవుతాయని, పిల్లలతోబాటు ఈ సమస్యలు కూడా పెరుగుతుంటాయని అధ్యయనవేత్తలు చెబుతున్నారు. కౌమార దశకు వచ్చేసరికి వారిలో కూడా కుంగుబాటు ధోరణులు స్పష్టంగా కనిపిస్తాయని, కాబట్టి గర్భంతో ఉన్న తల్లులు మానసిక సమస్యలను వెంటనే గుర్తించి వాటికి తగు చికిత్సను చేయాల్సిన అవసరం ఉందని, లేని పరిస్థితుల్లో వారికి పుట్టే పిల్లల్లో కనిపించే తేడాను తొలిదశలోనే గుర్తించి దానికి అనుగుణంగా చికిత్సను అందించడం ద్వారా నివారణ చర్యలను చేపట్టాలని పరిశోధకులు సూచిస్తున్నారు.

More Telugu News