నా దేహంలో క్యాన్సర్ కణాలు ప్రవేశించాయని వైద్యులు చెప్పారు: అక్కినేని
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా దేహంలో క్యాన్సర్ కణాలు ప్రవేశించాయని వైద్యులు చెప్పారు: అక్కినేని

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు తన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలను హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశం ద్వారా అభిమానులకు తెలిపారు. తన దేహంలో క్యాన్సర్ కణాలు ప్రవేశించాయని ఇటీవలే వైద్యులు తెలిపారని వెల్లడించారు. వృద్దాప్యంలో ఈ క్యాన్సర్ కణాలు నెమ్మదిగా పని చేస్తాయని వైద్యులు తెలిపారన్నారు. అక్టోబర్ 8న తనకు కడుపునొప్పి వచ్చిందని దాంతో, కొన్ని రోజులు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నానని పేర్కొన్నారు. ఈ విషయం అందరికీ తెలియాలనే చెబుతున్నానన్నారు. మనోబలం, అభిమానుల ఆశీర్వచనాల వల్లే ఆరోగ్యాన్ని అధిగమించానని.. మనోబలానికి మించి ఇన్నాళ్లు అభిమానుల ప్రోత్సాహం వల్లే సినిమాల్లో పనిచేస్తున్నానన్నారు.

74 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో పురస్కారాలు అందుకున్నానన్న అక్కినేని, సినిమా రంగంలో ఇన్నేళ్లు పనిచేయడమే ఓ రికార్డుగా భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. ప్రజల అభిమానం, ఆశీర్వచనాలు ఉంటే సెంచరీ కొడతానన్నారు. తన కుటుంబమంతా సీని రంగంలోనే సేవ చేస్తోందన్నారు. నిజం మాట్లాడటానికి ధైర్యం కావాలని, క్యాన్సర్ ను జయించి.. తన ఊపిరి ఉన్నంతవరకు సినిమాల్లో నటిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఇందుకు తనకు అందరి సహకారం కావలని కోరారు.

More Telugu News