మోడీని పొగడ్తలతో ముంచేసిన చంద్రబాబు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మోడీని పొగడ్తలతో ముంచేసిన చంద్రబాబు

భారతదేశం సూపర్ పవర్ గా అవతరించే రోజు దగ్గర్లోనే ఉందని చంద్రబాబు అన్నారు. ఢిల్లీలోని త్యాగరాజు ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన 'సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్' సదస్సులో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయులు పుట్టిన రోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ సదస్సులో చంద్రబాబు.. బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీతో వేదిక పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మోడీని ఆకాశానికెత్తేశారు. గాంధీ, మోడీ ఇద్దరూ గుజరాత్ కు చెందినవారు కావడం కాకతాళీయం అన్నారు. మోడీ విజన్ ఉన్న నాయకుడని ప్రశంసించారు. ఎన్డీఏ హయాంలోనే సంస్కరణలు ఊపందుకున్నాయని... దేశం అభివృద్ధి దిశగా పయనించిందని గుర్తు చేశారు. పీవీ నరసింహారావు సంస్కరణలను యూపీఏ పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.

దేశంలోనే అగ్రశ్రేణి విమానాశ్రయం, కన్వెన్షన్ సెంటర్ ను తాము నిర్మించామని చంద్రబాబు తెలిపారు. దీంతో పాటు... ఇంజినీరింగ్, వైద్య కళాశాలలు, న్యాయ విశ్వవిద్యాలయం, బిజినెస్ స్కూలు ఏర్పాటుచేశామని అన్నారు. తెలుగుదేశం హయాంలో విద్యుత్ ఉత్పాదనలో రాష్ట్రం అగ్రశ్రేణిలో నిలిచేందుకు ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టామని వెల్లడించారు. ఎన్డీఏతో కలసి సెల్ ఫోన్ సేవలను తీసుకొచ్చామని చెప్పారు. గతంలో అందరూ హైదరాబాద్ గురించి మాట్లాడేవారన్న చంద్రబాబు... ఇప్పుడు అందరూ గుజరాత్ గురించి మాట్లాడుతున్నారని.. మోడీకి కితాబిచ్చారు.

నేడు రాజకీయాల పట్ల 71 శాతం యువత ఆకర్షితులవుతున్నారని... ఇది నూరు శాతానికి పెరగాలని అభిప్రాయపడ్డారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటే మనం అద్భుతాలు సృష్టించగలమని తెలిపారు.

More Telugu News