నెల తగ్గితే కష్టమే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నెల తగ్గితే కష్టమే

మనకు కోపం వచ్చినపుడు ఎవరినైనా నెల తక్కువ వెధవా... అంటూ తిడుతుంటాం... అయితే ఇలా నెలలు నిండకుండా పుట్టే బిడ్డలకు పలు రకాలైన అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. తాజాగా నెలలు నిండకుండా పుట్టే బిడ్డలకు గుండెకు సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే ప్రమాదముందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు భవిష్యత్తులో పలు రకాలైన గుండెకు సంబంధించిన వ్యాధులకు దారితీయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన కార్డియో వాస్క్యులర్‌ క్లినికల్‌ రీసెర్చ్‌ ఫెసిలిటీకి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో నెలలు నిండకుండానే పుట్టిన శిశువుల్లో గుండె నిర్మాణ సంబంధం లోపాలు తలెత్తే ప్రమాదం ఉందని తేలింది. ఫలితంగా భవిష్యత్తులో ఈ లోపం హృద్రోగాలకు దారితీయవచ్చని వీరి పరిశోధనలో తేలింది. శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో భాగంగా నెలలు నిండని 102 మంది శిశువులను వారు జన్మించినప్పటినుండి వారు 20వ సంవత్సరంలోకి అడుగుపెట్టే వరకూ పరిశీలించారు. గర్భం ధరించిన తర్వాత 37వ వారంలోగా పుట్టినవారిని ఈ తరగతి కిందకి వర్గీకరించారు. వీరిని నెలలు నిండాక పుట్టిన 132 మందితో పోల్చారు. నెలలు నిండకుండా పుట్టినవారి గుండెలోని కుడివైపు దిగువ విభాగం చాలా చిన్నదిగా, బరువుగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. వీటి గోడలు మందంగా ఉండి, తక్కువ పంపింగ్‌ సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయని, శిశువు ఎంత ముందుగా పుడితే అంత ఎక్కువగా గుండెలోని ఈ భాగంపై ప్రభావం పడుతున్నట్టు ఈ పరిశోధనలో తేలింది. నేటి యువతలో దాదాపు 10 శాతం మంది నెలలు నిండకుండానే జన్మించారని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్‌ పాల్‌ లీసన్‌ చెబుతున్నారు.

More Telugu News