Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు సిగ్గులేనితనం బట్టబయలైంది: హరీశ్ రావు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై టీఆర్ఎస్ ముఖ్యనేత హరీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణపై అనాలోచిత నిర్ణయం తీసుకున్నారని బాబు ఈ ఉదయం వ్యాఖ్యానించడాన్ని హరీశ్ తప్పుబట్టారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ.. బాబు మాటలతో ఆయన సిగ్గులేని తనం బట్టబయలైందన్నారు. బాబు వ్యాఖ్యల్లో తెలంగాణ వ్యతిరేక వైఖరి స్పష్టమయిందని, అదే సమయంలో సీమాంధ్ర పక్షపాత ధోరణి ప్రస్ఫుటమైందని అన్నారు.

బాబు, సీఎం కిరణ్ కుమ్మక్కై ఒకటే బాణీ వినిపిస్తున్నారని, తెలంగాణపై నిర్ణయం తీసుకోమని చెప్పిందీ వీరేనని హరీశ్ పేర్కొన్నారు. ఇప్పుడు ఆగమేఘాలపై నిర్ణయాలు తీసుకున్నారని, ఎవరినడిగి విభజించారని ప్రశ్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. బాబు, కిరణ్ ల వైఖరి చూస్తుంటే డిసెంబర్ 9 నాటి పరిస్థితులను పునరావృతం చేసేందుకు కంకణం కట్టుకున్నట్టుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంత చర్చ జరిగిందో, ఎన్ని అఖిల పక్షాలు జరిగాయో తెలీదా? అని బాబుకు సూటి ప్రశ్న సంధించారు. తెలంగాణ విషయంలో ఐదేళ్ళ క్రితమే టీడీపీ అంతర్గత కమిటీ వేసిందని, 2009 ఎన్నికల మేనిఫెస్టోలోనూ తెలంగాణను చేర్చిందని, టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుందని హరీశ్ రావు ఎత్తి చూపారు. ఇక అన్నింటి కంటే ముఖ్యంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు 'అసెంబ్లీలో బిల్లు మీరు పెడతారా, మమ్మల్ని పెట్టమంటారా?' అని బాబే ముందుకొచ్చాడని గుర్తు చేశారు.

బాబు ఆగస్టు నెలలో ఒక్క మంచి పనీ చేయరని చెప్పారు. అప్పట్లో ఆగస్టులోనే మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడూ ఆగస్టులోనే తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారని ఆరోపించారు. టీడీపీ తెలంగాణ ప్రాంత నేతలు ఇకనైనా సరైన నిర్ణయం తీసుకుని, ఎవరి పక్షాన ఉండాలో తేల్చుకోవాలని సూచించారు.

More Telugu News