సైనా ఓటమికి కారణం చెప్పిన గోపి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సైనా ఓటమికి కారణం చెప్పిన గోపి

సైనా నెహ్వాల్.. భారతదేశం గర్వించదగ్గ రీతిలో ప్రపంచవేదికలపై అనేక అపురూప విజయాలు అందించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి. ఇటీవల కాలంలో ఈమె ప్రాభవం క్రమేపీ మసకబారుతోంది. ఏ టోర్నీకి వెళ్ళినా.. రెండు మూడు మ్యాచ్ లు గెలిచేసరికి, ఆమెలో ఉదాసీనత చోటు చేసుకుంటోంది. దీంతో, షరామామూలుగానే టైటిల్ కు ఆమడదూరంలోనే పోరాటాన్ని ముగించక తప్పడంలేదు. తాజాగా, చైనాలో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ లోనూ అదే ఫలితం పునరావృతం అయింది. క్వార్టర్ మెట్టుపై చతికిలబడి అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. అయితే, ఆమె ఓటమికి కారణం ఉందంటున్నాడు జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్. తీవ్రమైన కడుపునొప్పితో సైనా బరిలో దిగిందని, బాధను పంటిబిగువున భరిస్తూ తుదకంటా పోరాడిందని వెల్లడించాడు.

సైనా కెరీర్ ముగియనుందా అన్న ప్రశ్నకు బదులిస్తూ, ఆమె వయసు ఇంకా 23 ఏళ్ళే అంటూ, తప్పకుండా పుంజుకుంటుందన్నాడు. ఇక, మహిళల సింగిల్స్ విభాగంలో సెమీస్ చేరడం ద్వారా పతకం ఖాయం చేసుకుని చరిత్ర సృష్టించిన సింధుపై గోపి ప్రశంసల వర్షం కురిపించాడు. త్వరగా నేర్చుకునే లక్షణం సింధు సొంతమన్నాడు. సెమీస్ లో విజయం సాధిస్తుందన్న నమ్మకం తనకుందన్నాడు.

More Telugu News