దాడికి గురైన బాలిక మృతి... పెల్లుబికిన జనాగ్రహం
తాము వెంటపడి వేధిస్తుండడంతో భయపడి పారిపోతున్న పద్నాలుగేళ్ల బాలికను పట్టుకుని నిప్పుపెట్టారు ఇద్దరు దుండగులు. ఒడిశాలో కటక్ వద్ద జరిగిన ఈ ఘటనలో ఆ బాలిక 70 శాతం కాలిన గాయాలతో రెండు వారాలుగా మృత్యువుతో పోరాడుతూ తుదిశ్వాస విడిచింది. దీంతో జనాగ్రహం పెల్లుబికింది. నిన్న ఆమె పరిస్థితి విషమించడంతో కటక్ ఆసుపత్రి నుంచి ఢిల్లీ తరలించే ప్రయత్నం చేశారు. అంబులెన్స్ లోనే ప్రాణంపోగా ఆ విషయాన్ని వైద్యులు భువనేశ్వర్ చేరుకున్న తర్వాత అర్థరాత్రి ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. దీంతో శుక్రవారం తెల్లవారుజామునుంచే భువనేశ్వర్ లో నిరసన ప్రదర్శనలు మొదలయ్యాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బాలిక మరణించిందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని ఆందోళనకారులు నినాదాలు చేశారు.