నేను క్రికెటర్ని.. టెర్రరిస్టును కాను: చండీలా
దేశాన్ని కుదిపేసిన ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఆరోపణలెదుర్కొంటున్న రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు అజిత్ చండీలా విచారణ తీరు పట్ల ఆక్రోశం వెళ్ళగక్కాడు. తనపై ఢిల్లీ పోలీసులు మోకా చట్టం కింద అభియోగాలు నమోదు చేయడం పట్ల చండీలా స్పందించాడు. తాను క్రికెటర్ నే గానీ, టెర్రరిస్టును కానన్నాడు. తాజా అభియోగాల నమోదుతో తన కుటుంబం కూడా దిగ్భ్రాంతికి గురైందని ఈ హర్యానా క్రికెటర్ చెప్పుకొచ్చాడు. మూడు రోజుల తాత్కాలిక బెయిల్ పై చండీలా బయటికొచ్చాడు. సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కోర్టు చండీలాకు అనుమతిచ్చింది. తనపై ఆరోపణలు వచ్చినప్పటి నుంచి సోదరుడు మనస్తాపంతో మంచం పట్టాడని చండీలా వివరించాడు. చివరికి కన్నుమూశాడని, ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదని ఫరీదాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ అన్నాడు.