జలదిగ్బంధంలో పలు గ్రామాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జలదిగ్బంధంలో పలు గ్రామాలు

గోదావరి భీకరరూపు దాల్చడంతో పరీవాహక ప్రాంతంలో పలుగ్రామాలకు వరద ముప్పు తప్పలేదు. పశ్చిమగోదావరి జిల్లాలోని పలు లంక గ్రామాలు గోదావరి వరదతో ముంపుకు గురయ్యాయి. ఆచంట, యలమంచిలి మండలాల్లోని చాలా గ్రామాల్లో పది అడుగుల మేర నీరు ప్రవహిస్తోంది. నివాసాలు, విద్యుత్ స్థంభాలు, మంచినీటి బోర్లు నీట మునిగాయి. దీంతో, అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ప్రజలను బోట్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద పరిస్థితిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ ప్రతి మండలానికి ఓ ప్రత్యేక అధికారిని నియమించారు. సహాయ కార్యక్రమాల పర్యవేక్షణకు కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు.

కాగా, కనకాయలంక కాజ్ వే మునిగిపోవడంతో ఉభయగోదావరి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొవ్వూరు గోపాదక్షేత్రం ముంపుకు గురవడమే కాకుండా, అక్కడి గిరిజన గ్రామాలూ జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో, ఆ గ్రామాలకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి.

More Telugu News