తెలంగాణ ప్రజల ముఖాల్లో సంతోషం కోసమే.. : కేసీఆర్
తెలంగాణ ప్రజల ముఖాల్లో సంతోషం చూడడానికే రాష్ట్ర ఏర్పాటు జరిగిందని కేసీఆర్ అన్నారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం (టీజేఎఫ్) ఆధ్వర్యంలో తాజ్ డెక్కన్ హోటల్లో మీట్ ద ప్రెస్ కార్యక్రమం జరిగింది. ఈ మీడియా కార్యాక్రమంలో పాల్గొన్న కేసీఆర్, తెలంగాణ ఉద్యమంలో టీ జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని కీర్తించారు. ఉద్యమ ఆసాంతం జర్నలిస్టులు కనబరిచిన స్ఫూర్తికి ధన్యవాదాలు తెలిపారు. దిగ్విజయ్ చెప్పినట్టే తెలంగాణ ఏర్పాటు జరిగిందన్నారు. ఆ విషయంలో ఇక ఎలాంటి సందేహాలు అవసరంలేదన్నారు. తెలంగాణ ప్రకటనతోపాటు కేసీఆర్ కూడా నచ్చక కొందరు ఎగతాళి చేస్తున్నారని, వారి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రదర్శించిన స్ఫూర్తిని రాష్ట్ర పునర్నిర్మాణంలో కూడా చూపాలని పిలుపునిచ్చారు. ఉద్యమం రాష్ట్ర సాధనతో ఆగిపోలేదన్నారు. అన్ని వర్గాలు చిరునవ్వులు చిందేలా రాష్ట్రాన్ని నిర్మిస్తామని చెప్పారు.