పందెం వేసి అమ్మాయిని వేధించాడు!
స్త్రీని ఆదిపరాశక్తిలా పూజించాలని చెప్పే భారతదేశంలో మహిళల పరిస్థితి ఎంత దారుణంగా దిగజారిందో తాజా సంఘటన కళ్ళకు కడుతుంది. పందెం వేసుకుని మరీ ఓ అమ్మాయిపై వేధింపులకు పాల్పడిన ఘటన పశ్చిమబెంగాల్లో చోటు చేసుకుంది. హౌరా శివారు ప్రాంతమైన బల్లీలో ఓ మహిళా స్విమ్మర్ ను తాను వేధిస్తానంటూ ఓ జూట్ మిల్ ఉద్యోగి స్నేహితుడితో 1000 రూపాయలు పందెం కాశాడు. ఆ సొమ్ము గెలుచుకునేందుకు, ఆ స్విమ్మర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించసాగాడు. అయితే, అందరు మహిళల్లా ఆ అమ్మాయి భయపడలేదు. తిరగబడి, అతగాడి వెంటాడి దొరకబుచ్చుకుని పోలీసులకు అప్పగించింది. కాగా, హౌరా రైల్వే స్టేషన్ ప్రాంతంలో వారం క్రితం ఓ టీవీ యాంకర్ ను కూడా ఈవ్ టీజర్లు ఇలాగే వేధించిన సంగతి తెలిసిందే.