పోలీస్ వ్యవస్థ చట్టాన్ని అందరికీ సమంగా వర్తింపచేయాలి: పవన్ కల్యాణ్

•నేను గొడవలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయను

•చిన్నపాటి గొడవను పెద్దది చేశారు

•నా వారికి ఇబ్బంది వస్తే చూస్తూ ఊరుకోను

•ధర్మవరం కేసులు కొట్టేసే వరకు అండగా నిలుస్తాం

*ధర్మవరం గ్రామస్తులతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 

పోలీస్ వ్యవస్థ చట్టాన్ని అందరికీ సమంగా వర్తింప చేయాలని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టంచేశారు. తాను గొడవలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయనని, సంయమనంతో ముందుకు వెళ్తానని తెలిపారు. వైసీపీ నేతలు అలా బాధ్యతగా ఉంటారో లేదో తెలియదుగానీ, ఓ పార్టీ అధినేతగా తనకు బాధ్యత ఉందన్నారు. శుక్రవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామస్తులతో సమావేశం అయ్యారు. జాతర సందర్భంగా జరిగిన గొడవ, తదనంతరం కేసులతో తాము పడిన ఇబ్బందులను ఆ గ్రామానికి చెందిన మహిళలు పవన్ కల్యాణ్ కి వివరించారు.

అనంతరం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. "చిన్నపాటి గొడవకు గ్రామంలో మగవాళ్లు చెట్లు, పుట్టలు పట్టుకుని తిరగాల్సి రావడం ఆవేదన కలిగించింది. వెంటనే మా లీగల్ విభాగానికి మీకు అండగా నిలవాలని చెప్పాను. మీకు భరోసా ఇచ్చేందుకు నేనే వచ్చి కూర్చుందాం అనుకున్నా. ఇంకా కేసులు పూర్తిగా పరిష్కారం కాలేదు. సమస్య పూర్తిగా పరిష్కారం అయ్యే వరకు మీకు అండగా ఉంటాను.

ఒక రోజు ధర్మవరం ఆతిధ్యం స్వీకరిస్తా:

ఇలా ఇబ్బందులు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని వదిలేస్తానని మాత్రం అనుకోవద్దు. మీ పోరాటం గురించి తెలుసుకున్నప్పుడు పల్నాటి ఆడపడుచుల పౌరుషం చూపారనిపించింది. పల్నాడు అన్యాయాన్ని భరించదు, అధర్మానికి తలవంచదు. మీరు పడిన కష్టానికి గుర్తుగా నేను వచ్చి ఒక రోజు మొత్తం గ్రామంలో ఉంటాను. ధర్మవరం ఆతిధ్యం స్వీకరిస్తాను. 

గొడవలు పెద్దవి చేయకండి:

స్థానికంగా ఉండే వైసీపీ నాయకులకు నా విన్నపం ఒకటే.. గొడవలు పెద్దవి చేయకండి. కోపతాపాలు వస్తే సరిదిద్దుకుందాం. రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే మా వారికి మేం అండగా ఉంటాం. మీరు చేస్తే తప్పు, మేం చేస్తే ఒప్పన్నట్టు వ్యవహరించవద్దు. 151 సీట్లు ఉన్నాయన్న అధికార మదం చూపితే రోడ్డు మీదకి వచ్చి గొడవ పెట్టుకోగల సత్తా నాకుంది. మా వాళ్లను ఇబ్బంది పెట్టే ముందు పర్యవసానాలు కూడా ఆలోచించుకోండి. సమాజం మంచి కోరుకునే మేం సాధ్యమైనంత వరకు సామరస్యంగానే వెళ్తాం. జాతరలో జరిగిన చిన్నపాటి సంఘటనను పెద్దది చేసి యువతను ఇబ్బందిపెట్టవద్దు" అన్నారు. సమావేశంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.


More Press News