పార్క్ ల నిర్వహణ బాధ్యతలను స్థానిక కాలనీ వాసులు చేపట్టాలి: విజ‌య‌వాడ‌ మేయర్

విజ‌య‌వాడ‌: తూర్పు నియోజకవర్గం పరిధిలోని 4వ డివిజన్ వెటర్నరీ కాలనీ నందు 60 లక్షల రూపాయల అంచనాలతో నూతనంగా ఆధునికీకరించిన పార్క్, ఓపెన్ జిమ్ మరియు వాకర్స్ అసోసియేషన్ జిమ్ బిల్డింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పార్క్ ను మరియు జిమ్ భవనమును కమిషనర్ ప్రసన్న వెంకటేష్, ప్రారంభించగా కార్యక్రమములో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక లక్షల వ్యయంతో వివిధ కాలనీలలో మరియు డివిజన్ లలో పార్క్ లను ఆధునీకరించి అందుబాటులోనికి తీసుకురావటం జరుగుతుందని, స్థానికంగా ఉన్న ప్రజలు లేదా కాలనీ వాసులు వాటిని పరిరక్షించుకొనే విధంగా ముందుకు రావాలని అన్నారు. గత 5 ఏళ్లుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలను సైతం మా ప్రభుత్వం అభివృద్ధి పరస్తున్నదని, తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ క్షేత్ర స్థాయిలో డివిజన్ లలో పర్యటిస్తూ, ప్రజల ఇబ్బందులను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవటం జరుగుతుందని వివరించారు.

కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా నగరంలో అనేక పార్క్ లను అభివృద్ధి పరచుట జరిగిందని, పార్క్ పరిసరాలలో ఉన్న ప్రజలు లేదా కాలనీ వాసులు పార్క్ ల నిర్వహణ నిమిత్తం నియమించుకొను సిబ్బందికి అగు వేతనములో 60 శాతం నగరపాలక సంస్థ, కాలనీ వాసులు 40 శాతం చెల్లింపు చేయు విధానముతో అనేక చోట్ల పార్క్ ల యొక్క నిర్వహణ బాధ్యతను స్థానిక కాలనీ వాసులకు అప్పగించుట జరిగిందని, ఈ విధానం ద్వారా సదరు పార్క్ మనది అనే భావనతో పార్క్ యొక్క నిర్వహణ చక్కగా నిర్వహించుటకు అవకాశం ఉంటుందని అన్నారు. కాలనీ వాసులు ఈ దిశగా ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఈ పార్క్ నందు రూ.60 లక్షలతో ఓపెన్ జిమ్, పిల్లల ఆట పరికరాల ఏర్పాటు మరియు జిమ్ భవన నిర్మాణం చేపట్టి పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచుట జరిగిందని వివరించారు.

అదే విధంగా తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి అందరి సహకారంతో ముందుకు వెళ్తున్నామని, ప్రజల అవసరాల తీర్చుటకు ముందుంటామని, పలు అభివృద్ధి పథకముల ప్రారంభించుట సంతోషకరమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమములో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ.ఎస్.ఎన్ ప్రసాద్, ఇతర అధికారులు సిబ్బంది మరియు స్థానిక కాలనీ వాసులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

More Press News