పోలీసు భవనాల నిర్మాణాలపై తెలంగాణ హోంమంత్రి సమీక్ష

హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం నిర్మాణంలో ఉన్న పోలీస్ శాఖకు చెందిన భవనాలపై రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మంగళవారం నాడు తన కార్యాలయంలో సమీక్షించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్త, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఇంచార్జి ఎండీ సంజయ్ కుమార్ జైన్, కార్పొరేషన్ చీఫ్ ఇంజనీర్ విజయ్ కుమార్, ఎస్ఈ తులసీధర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భవనాల నిర్మాణాలపై అధికారులు హోం మంత్రికి వివరించారు. కొన్ని జిల్లా పోలీస్ కార్యాలయాలు, కమిషనరేట్ కార్యాలయాలు పూర్తికాగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయని తెలియజేశారు. సిద్దిపేట కమిషనర్ కార్యాలయం, కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయం భవనాలు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. సిరిసిల్ల, సూర్యాపేట, ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్ భూపాలపల్లి, వనపర్తి మహబూబాబాద్, కొత్తగూడెం, జగిత్యాల జిల్లాల పోలీసు కార్యాలయాలతో పాటు రామగుండం కమిషనర్ కార్యాలయం నిర్మాణదశలో ఉన్నాయని తెలిపారు.

కాగా, హైదరాబాదులోని కాచిగూడ, మహంకాళి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల భవనాలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఎస్.ఆర్.నగర్, ఆసిఫ్ నగర్, చాంద్రాయణగుట్ట, కాచిగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ లో భవనాలు త్వరలో పూర్తి కానున్నాయని తెలియజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ.. గడువులోగా పోలీసు కార్యాలయ భవనాలను పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీసు కార్యాలయ భవనాలు, పోలీస్ స్టేషన్లో భవనాలు త్వరితగతిన పూర్తి చేసినట్లయితే అవి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. తద్వారా వారికి సమీపలోనే పోలీస్ స్టేషన్ భవనాలు ఉండడంవల్ల ఆయా ప్రాంతాల ప్రజల శాంతి భద్రతలను కాపాడేందుకు ఆస్కారం ఉంటుందని, మరింత మెరుగ్గా ప్రజలకు భద్రత కల్పించడంతో పాటు నేరాలను అరికట్టేందుకు పోలీసు సిబ్బంది కృషి చేస్తారని అన్నారు.

More Press News