Talasani: ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో మల్టీ సూపర్..
Add ap7am to your home Screen

ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం: మంత్రి తలసాని

ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం: మంత్రి తలసాని
హైదరాబాద్: ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. త్వరలోనే హెల్త్ సెక్రెటరీ రిజ్వీ, DME, సంబంధిత అధికారులతో కలిసి చెస్ట్ హాస్పిటల్ ను సందర్శించి అనంతరం ముఖ్యమంత్రి కి సమగ్ర నివేదికను అందజేయనున్నట్లు మంత్రి చెప్పారు.

ఇటీవల చెస్ట్ హాస్పిటల్ లోని కోవిడ్ చికిత్స పొందుతున్న వారికి అందుతున్న వైద్య సేవలను తెలుసుకునేందుకు హోం మంత్రి మహమూద్ అలీ తో కలిసి సందర్శించారు. అక్కడి పరిసరాలను పరిశీలించిన తానూ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం ప్రాధాన్యతను ముఖ్యమంత్రికి వివరించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు చెస్ట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ మహబూబ్ ఖాన్ తో మంగళవారం తన కార్యాలయంలో చెస్ట్ హాస్పిటల్ విస్తీర్ణం, నిర్మాణాలు తదితర అంశాలను చర్చించినట్లు మంత్రి శ్రీనివాస్ యాదవ్ చెప్పారు.

ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, పటాన్ చెరు, జూబ్లీహిల్స్, సనత్ నగర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల ప్రజలకు అతి చేరువలో మెరుగైన వైద్యసేవలు అందించవచ్చని అన్నారు. పేదప్రజలకు సైతం కార్పోరేట్ స్థాయిలో ప్రభుత్వ వైద్య సేవలు అందించాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యమని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, అత్యాధునిక వైద్య పరికరాల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రత్యేక చర్యలను తీసుకుందని ఆయన తెలిపారు.

ప్రభుత్వ వైద్య సేవలను విస్తరించే కార్యక్రమంలో భాగంగా ఇటీవల ముఖ్యమంత్రి నూతనంగా ప్రభుత్వం  సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ల ఏర్పాటుకు తీసుకుంటున్న చర్యలను గుర్తు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా అనేక మందికి వైద్య సేవలు అందిస్తున్న ఎర్రగడ్డలోని చెస్ట్ హాస్పిటల్ ఆవరణలో కూడా గాంధీ తరహాలో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని చెప్పారు. సుమారు 62 ఎకరాల విస్తీర్ణంలో కేవలం 18 ఎకరాల విస్తీర్ణంలో చెస్ట్ హాస్పిటల్ నిర్మాణాలు ఉన్నాయి.

ఇంకా సుమారు 44 ఎకరాల భూమి అందుబాటులో ఉంటుందని, ఇందులో అత్యాధునిక వసతులు, సౌకర్యాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తే పేద ప్రజలకు అనేక రకాల వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నగరంలో ఎప్పుడు రోగులతో రద్దీగా ఉండే గాంధీ, నిమ్స్, ఉస్మానియా వంటి ప్రధాన హాస్పిటల్స్ పై వత్తిడి ని తగ్గించవచ్చని వివరించారు.

ఇదే కాకుండా నూతనంగా ప్రభలే పలు రకాల వ్యాధులను గుర్తించేందుకు అత్యాధునిక మెడికల్ రీసర్చ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉంటుందని తెలిపారు. మెడికల్ రీసర్చ్ సెంటర్ ఏర్పాటు చేయడం వలన కరోనా వంటి నూతన వైరస్ లు ప్రభలితే వ్యాధుల నిర్ధారణ పరీక్షల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.
Talasani
Telangana

Watch Today's Deals on Amazon

More Press News