Biswabhusan Harichandan: రాష్ట్రంలోని చిన్నారులందరికీ సురక్షిత నీరు: ఏపీ గవర్నర్..
Add ap7am to your home Screen

రాష్ట్రంలోని చిన్నారులందరికీ సురక్షిత నీరు: ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్

రాష్ట్రంలోని చిన్నారులందరికీ సురక్షిత నీరు: ఏపీ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్
  • జలజీవన్ మిషన్ వంద రోజుల కార్యక్రమంపై గవర్నర్ సమావేశం
  • నీలం సహానీతో సహా హజరైన వివిధ శాఖల ముఖ్య కార్యదర్సులు
జల్ జీవన్ మిషన్ ను సద్వినియోగం చేసుకోవటం ద్వారా ప్రతి చిన్నారి సురక్షితమైన నీటిని పొందేలా చూడాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల పిల్లలకు రక్షిత నీటిని సరఫరా చేయడానికి ఉద్దేశించిన ఈ వినూత్న కార్యక్రమం ప్రాధాన్యతను గుర్తెరగాలన్నారు. జలజీవన్ మిషన్ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ సోమవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని, సంబంధింత విభాగాల కార్యదర్సులతో సమావేశం అయ్యారు. కరోనా నేపధ్యంలో  రాజ్ భవన్ నుండి ఆన్ లైన్ విధానంలో కార్యక్రమం నిర్వహించగా అధికారులు సచివాలయంలోని  వారి కార్యాలయాల నుండి సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ అసురక్షిత నీటి వినియోగం వల్ల పిల్లలు టైఫాయిడ్, విరేచనాలు,కలరా వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రయోజనం కోసం జల్ జీవన్ మిషన్ ను భారత ప్రధాని ప్రారంభించగా, ఈ పధకం  చిన్నారుల ఆరోగ్యాన్ని మెరుగు పరచటమే కాక,  వారి సంపూర్ణ వృద్ధికి సహాయ పడుతుందన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసే క్రమంలో కాలపరిమితితో కూడిన ప్రచారాన్ని రూపొందించాలని, గ్రామ పంచాయతీలు,జల, పారిశుద్ధ్య కమిటీలు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాల సహకారంతో అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీలలో ‘100 రోజుల కార్యక్రమం’ అమలు చేయాలని గవర్నర్ అధికారులను అదేశించారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ పధకం అమలు కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరిస్తూ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పంచాయతీ భవనాలకు పైపుల ద్వారా రక్షిత నీటిని అందించడానికి స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నామన్నారు.  పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి  శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, విద్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్,మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ  తదితరులు ఆయా శాఖల పరిధిలోని సంస్థలలో ‘100 రోజుల కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేసే కార్యాచరణ ప్రణాళికల గురించి వివరించారు. తొలుత గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా జల్ జీవన్ మిషన్ ద్వారా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు పైపు నీటిని అందించడానికి  నిర్ధేశించిన 100 రోజుల కార్యక్రమం యొక్క లక్ష్యాలను సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు.
Biswabhusan Harichandan

Watch Today's Deals on Amazon

More Press News