Pawan Kalyan: ఆపత్కాలంలో పెద్ద మనసు చాటుకొంటున్న సినిమా కుటుంబానికి..
Add ap7am to your home Screen

ఆపత్కాలంలో పెద్ద మనసు చాటుకొంటున్న సినిమా కుటుంబానికి ధన్యవాదాలు: పవన్ కల్యాణ్

ఆపత్కాలంలో పెద్ద మనసు చాటుకొంటున్న సినిమా కుటుంబానికి ధన్యవాదాలు:  పవన్ కల్యాణ్

'కరోనా మహమ్మారి విజృంభించిన ఆపత్కాలమిది. ఈ సమయంలో ప్రభుత్వానికి... ప్రజలకు... సినీ కార్మిక లోకానికి అండగా నిలిచి పెద్ద మనసు చాటుకొంటున్న సినిమా కుటుంబానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు.... లాక్ డౌన్ తరుణంలో ఇక్కట్లలో ఉన్నవారికి బాసటగా నిలిచేందుకు నిధులు చాలా అవసరం. అగ్రశ్రేణి హిందీ కథానాయకుడు శ్రీ అక్షయ్ కుమార్ రూ.25 కోట్లు ప్రధాన మంత్రికి సహాయ నిధికి భూరి విరాళం ప్రకటించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ (సి.సి.సి.) పేరుతో సంస్థను ఏర్పాటు చేసి కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకొనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం. కమిటీకి ఛైర్మన్ గా ఉన్న పెద్దన్నయ్య శ్రీ చిరంజీవి గారికి, కమిటీ సభ్యులు శ్రీయుతులు డి.సురేశ్ బాబు, ఎన్.శంకర్, సి.కల్యాణ్, దామోదర ప్రసాద్, బెనర్జీ, తమ్మారెడ్డి భరద్వాజ గార్లకు అభినందనలు.

సి.సి.సి. కోసం ఇప్పటికే పెద్దన్నయ్య శ్రీ చిరంజీవి గారు రూ.కోటి ప్రకటించారు. శ్రీ నాగార్జున రూ.కోటి, శ్రీ సురేశ్ బాబు, శ్రీ వెంకటేష్, శ్రీ రానా కుటుంబం రూ.కోటి, శ్రీ ఎన్టీఆర్, శ్రీ మహేశ్ బాబు, శ్రీ నాగచైతన్యలు రూ.25 లక్షల చొప్పున, శ్రీ రామ్ చరణ్ రూ.30 లక్షలు, శ్రీ వరుణ్ తేజ్ రూ.20 లక్షలు, శ్రీ సాయి ధర్మతేజ్ రూ.10 లక్షలు, శ్రీ రవితేజ రూ.20 లక్షలు, శ్రీ శర్వానంద్ రూ.15 లక్షలు, శ్రీ విశ్వక్సేన్ రూ.5 లక్షలు, శ్రీ కార్తికేయ రూ.2 లక్షలు, కథానాయిక లావణ్య త్రిపాఠి రూ.లక్ష, నిర్మాతలు శ్రీ దిల్ రాజు, శ్రీ శిరీష్ రూ.10 లక్షలు సి.సి.సి.కి ఇవ్వడం ద్వారా కరోనా విపత్తు వేళ సినీ కార్మికులకు బాసటగా నిలిచారు. సామాజిక బాధ్యతతో నిలిచిన వారందరికీ నా అభినందనలు తెలుపుతున్నాను. యువ కథానాయకుడు శ్రీ నిఖిల్ తెలంగాణ, ఏపీల్లో ఆసుపతుల్లోని వైద్యులు, ఇతర సిబ్బందికి అవసరమైన మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు, ప్రొటెక్ట్ గ్లాసెస్ లాంటివి ఇవ్వడం, కథానాయకుడు శ్రీ సుధీర్ బాబు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధులకు రూ.2 లక్షలు ప్రకటించడం, యాంకర్, నటుడు శ్రీ ప్రదీప్ మాచిరాజు టీవీ రంగ కార్మికులకు నెల రోజులపాటు ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించుకోవడం అభినందనీయం.' అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటన  చేశారు.

Pawan Kalyan
Janasena
Corona Virus
Tollywood

Watch Today's Deals on Amazon

More Press News