మత్స్యకారులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: మత్స్యకారులపై దాడులకు పాల్పడినా, మత్స్య సంపదకు నష్టం కలిగించిన అలాంటి వారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. ఎన్నో సంవత్సరాలుగా మత్స్యకారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా శనివారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మత్స్యకార సంఘాలకు చెందిన ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాష్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా ఇతర మత్స్య శాఖ అధికారులు, పలువురు మత్స్యకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకార సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో మత్స్యకారులపై దాడులు జరుగుతున్నాయని, మత్స్య సంపదకు నష్టం కలిగిస్తూ తీరని అన్యాయం చేస్తున్నారని మంత్రికి ఫిర్యాదు చేశారు. స్పందించిన మంత్రి మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలకు పాల్పడే వారిని ప్రభుత్వం ఉపేక్షించబోదని, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి కఠిన చట్టాల అమలుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మత్స్యరంగ పరిరక్షణ కోసం సమగ్ర పాలసీ/చట్టానికి రూపకల్పన చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మత్స్యకార వృత్తిపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్సకారులు సంతోషంగా ఉండాలనేది ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యం అని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు గంగపుత్రుల నుండి 5 గురు, ముదిరాజ్ సంఘం నుండి 5 గురు చొప్పున  మొత్తం 10 మందితో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

ఈ కమిటీ ముందుగా కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలలో పర్యటించి అక్కడి మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, సొసైటీలలో ఉన్న సమస్యలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి మత్స్య శాఖ అధికారులకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ప్రతి మత్స్యకారుడు సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి సాధించే అంశాలను గుర్తించి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్న క్రమంలో సమస్యలు ఉంటే వాటి శాశ్వత పరిష్కారానికి చొరవ చూపాలనే ముఖ్యమంత్రి ఆదేశాలతో మత్స్యకార సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు.

ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్దికి ఏ విధమైన ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టకపోగా వారి మద్య ఉన్న చిన్న చిన్న విబేధాలను అవకాశాలుగా తీసుకున్నాయి తప్ప.. వాటి పరిష్కారానికి ఎలాంటి చొరవ చూపలేదన్నారు. భవిష్యత్తులో ఎలాంటి విబేదాలు, వివాదాలకు అవకాశం లేకుండా శాశ్వత పరిష్కారం కనుగొనే వరకు ఎన్ని సమావేశాలైనా నిర్వహిస్తామని, ఎంత సమయమైనా కేటాయిస్తామని మంత్రి ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో నీటివనరులు గణనీయంగా పెరిగాయని, మత్స్య సంపద కూడా పెద్ద ఎత్తున వస్తుందని వివరించారు.

మత్స్యకారులు ఐక్యంగా ఉండి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలని మంత్రి పిలుపునిచ్చారు. జలవనరులపై మత్స్యకార వృత్తిలో ఉన్న వారికి మాత్రమే చేపల పెంపకంపై హక్కులు ఉంటాయని, ఇతరులు అజమాయిషీ, హక్కుల కోసం ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎలాంటి వివాదాలు లేని సొసైటీలలో సభ్యత్వ నమోదు నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా మత్స్యకారులకు మేలు చేసే లక్ష్యంతోనే అని చెప్పారు.

దేశంలో ఎక్కడా లేని మత్స్య సంపద మన రాష్ట్రంలో సృష్టించబడుతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మత్స్యకారుల ఉపాధి అవకాశాలు ఎంతో మెరుగుపడ్డాయని మంత్రి వివరించారు. మత్స్యకారులు మద్య విబేధాలు సృష్టించి కొందరు లబ్దిపొందాలని చూస్తున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. మత్స్యకారుల సంక్షేమ కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. తక్కువ ధరకు చేపలను విక్రయించుకొని నష్టపోతున్న మత్స్యకారులను ఆదుకునేందుకు మత్స్యకార సొసైటీల నుండి నేరుగా మత్స్య ఫెడరేషన్ ద్వారా చేపలను మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్రంలోని మత్స్య సంపదను ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని తెలిపారు. అన్ని జిల్లాలలో నాన్ వెజ్ మార్కెట్ ల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. అనేక సంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేసిన, కృషి చేస్తున్న మంత్రికి మత్సకార సంఘాల ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో ఉన్న గంగపుత్ర, ముదిరాజ్ సొసైటీలు ఎన్ని, నూతనంగా ఏర్పాటు చేయాల్సిన సొసైటీలు ఎన్ని వంటి సమగ్ర సమాచారం సేకరించి నివేదిక సమర్పించాలని మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యాను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో గంగపుత్ర, ముదిరాజ్ సొసైటీలకు ప్రతినిధులు దీటి మల్లయ్య గంగపుత్ర, చొప్పరి శంకర్ ముదిరాజ్, ధన్ రాజ్, మోహనకృష్ణ, మల్లేశం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

More Press Releases