MaheshwarReddy: వారిని విమర్శించినంత మాత్రాన రేవంత్ రెడ్డి పెద్ద నాయకుడు కాలేడు: బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

BJPLP Maheswar Reddy fires at Revanth Reddy
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలన్న మహేశ్వర్ రెడ్డి
  • జనాలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఆరోపణ
  • ఓటుకు నోటు మచ్చను తుడుచుకునే ప్రయత్నం చేయాలని హితవు
పెద్ద నాయకులను విమర్శించినంత మాత్రాన రేవంత్ రెడ్డి పెద్ద నాయకుడు కాలేడని బీజేపీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి 14 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని పునరుద్ఘాటించారు.

మహేశ్వర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు హామీలు ఇచ్చిందని ఆరోపించారు. తొలుత వారు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేయాలన్నారు. రేవంత్ రెడ్డి మాయమాటలు చెప్పి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాడన్నారు. ఇప్పుడు జనాలను మభ్యపెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఇప్పుడు ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు వినే పరిస్థితుల్లో లేరన్నారు. తెలంగాణలో రేపు రామరాజ్యం రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నిత్యం తమ పార్టీ పెద్ద నాయకులను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తొలుత ఆయన తన మీద ఉన్న ఓటుకు నోటు మచ్చను తుడుచుకునే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. ఆయనపై వస్తున్న అవినీతి ఆరోపణలకు సమాధానం చెప్పాలన్నారు.
MaheshwarReddy
Revanth Reddy
BJP
Congress

More Telugu News