'బిగ్ గర్ల్స్ డోంట్ క్రై' (అమెజాన్ ప్రైమ్) వెబ్ సిరీస్ రివ్యూ!

  • 7 ఎపిసోడ్స్ తో వచ్చిన 'బిగ్ గర్ల్స్ డోంట్ క్రై'
  • బోర్డింగ్ స్కూల్ స్టూడెంట్స్ చుట్టూ తిరిగే కథ 
  • స్క్రీన్ ప్లే - నేపథ్య సంగీతం హైలైట్
  • ప్రధానమైన పాత్రల్లో మెప్పించిన టీనేజర్స్  
  • ఎక్కువగా అనిపించే ఎపిసోడ్స్ నిడివి
  • స్థాయిని తగ్గించిన అభ్యంతరకర సన్నివేశాలు 

జీవితంలో గడచిన ప్రతిరోజు గతమైపోతుంది. కొన్ని సందర్భాల్లో గడచిన రోజులు తిరిగొస్తే ఎంత బాగుంటుందో కదా అనే చాలామంది అనుకుంటారు. ముఖ్యంగా తమ స్కూల్ డేస్ తిరిగొస్తే మరింత ఎంజాయ్ చేయవచ్చని అనుకోనివారుండరు. అలాంటి స్కూల్ డేస్ నేపథ్యంలో నడిచే వెబ్ సిరీస్ లు ఇంతకుముందు వచ్చాయి. అలాంటి ఒక కంటెంట్ తో వచ్చిన సిరీస్ 'బిగ్ గర్ల్స్ డోంట్ క్రై'. 7 ఎపిసోడ్స్ గా నిర్మితమైన సిరీస్, నిన్నటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం.

'వందన వ్యాలీ' బోర్డింగ్ స్కూల్లో 11th క్లాస్ చదవడానికి లూడో (అవంతిక) రూహి (అనీత్ పెద్ద) కావ్య (విదుషి) దియా (అక్షిత సూద్) జేసీ (లాఖ్యిల) ప్లగ్గీ (ఆనందిత) చేరతారు. వాళ్లకి సీనియర్ గా   నూర్ (అఫ్రా)  ఉంటుంది. ఒక్కొక్కరూ ఒక్కో కుటుంబ నేపథ్యం నుంచి .. ఒక్కో ప్రాంతం నుంచి అక్కడికి వస్తారు. ఇంటికి దూరంగా ఉండలేని వారు కొందరు .. దూరంగా రావడమే మంచిదైందని అనుకునేవారు కొందరు. అక్కడ ఒక వైపున చదువు .. మరో వైపున ఆటపాటలు ఉన్నప్పటికి, ఆ మధ్యలో ప్రిన్సిపాల్ అనిత వర్మ క్రమశిక్షణ అందరినీ భయపెడుతూ ఉంటుంది. 

అక్కడ అంతా కూడా డబ్బున్నవారి పిల్లలే ఉంటారు. అలాంటి ఆ స్కూల్లో స్కాలర్ షిప్ మీద కావ్య చేరుతుంది. తన ఆర్ధిక పరిస్థితి కారణంగా కావ్య ఎవరిలోనూ కలవలేకపోతుంటుంది. అయితే ఆ అమ్మాయి చాలా తెలివైనదనే విషయాన్ని రూహీ బ్యాచ్ గమనిస్తుంది. దాంతో కావ్యను తమ గ్రూప్ లో చేర్చుకుంటుంది. కావ్య మినహా మిగతా వారు అల్లరి పనులు .. ఆకతాయి పనులు ఎక్కువగా చేస్తుంటారు. ప్రిన్సిపాల్ తో చీవాట్లు తింటూ ఉంటారు. వాళ్ల మూలంగా కావ్య కూడా ఇబ్బందుల్లో పడుతూ ఉంటుంది. 

లూడో మంచి బాస్కెట్ బాల్ ప్లేయర్ .. రాష్ట్ర స్థాయి పోటీల్లో తాను పాల్గొనాలనే ఆలోచనలో ఆమె ఉంటుంది. ఇక రూహీ ఆకతాయి పనులతోనే రోజులు గడిపేస్తూ ఉంటుంది. కావ్య తాను కష్టపడి చదవాలని అనుకుంటూ ఉండగా, దియా మాత్రం తన పెద్దహతి వేరు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది. వీర్ ప్రేమలో జేసీ పడగా, సెక్స్ కి సంబంధించిన ఆలోచనలతో ప్లగ్గీ సతమతమైపోతుంటుంది. ఇక వీరికంటే కాస్త సీనియర్ అయిన 'నూర్' మాత్రం జీవితంలో ఎదగాలనే ఆలోచనలో ఉంటుంది.

జేసీకీ .. వీర్ కి మధ్య ప్రేమవ్యవహారం నడపబోయిన రూహీ, అతని ఆకర్షణకి తాను లోనవుతుంది. తన ఫ్రెండ్స్ దగ్గర తక్కువ కాకూడదనుకుని గొప్పలు చెప్పిన కావ్య, అబద్ధం విషయంలో ఫ్రెండ్స్ కి  దొరికిపోతుంది. సెక్స్ గురించే ఆలోచించే ప్లగ్గీ, ఒక అబ్బాయితో ఆన్ లైన్ లో పరిచయం పెంచుకుని ఇబ్బందుల్లో పడుతుంది. తాను ఎవరి మాట విననని చెప్పే దియా ధోరణి, అనిత వర్మను ఇబ్బందుల్లో పడేస్తుంది. లూడో చేసిన ఒక పని కారణంగా స్కూల్ లో స్పోర్ట్స్ కి సంబంధించిన  కెప్టెన్సీ ని కోల్పోతుంది. మరో స్నేహితురాలు సస్పెండ్ కావడానికి కారణమవుతుంది.  

ఇలా ఈ స్నేహితులందరూ ఒక్కో సమస్యలో చిక్కుకుంటారు. ఒక వైపున ఫ్యామిలీ వైపు నుంచి ఉన్న సమస్యలు . మరో వైపున తన ఆకతాయి తనం వలన తెచ్చుకున్న ఇబ్బందులు .. ఇంకోవైపున క్రమశిక్షణా చర్యలు. ఇలా అన్నివైపుల నుంచి వాళ్లను సమస్యలు అలముకుంటాయి.   ఆ సమస్యల నుంచి వాళ్లు ఎలా బయటపడతారు? అందుకోసం ఏం చేస్తారు? వాళ్లు తీసుకునే నిర్ణయాలు ఎలాంటివి? అవి వాళ్ల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తాయి? అనేది మిగతా కథ.

ఈ కథను రాధిక మల్హోత్రా అందించారు. 11th .. 12th క్లాస్ చదువుకునే టీనేజ్ పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందనే అంశంపై ఒక పరిశోధన చేసినట్టుగానే ఆమె ఈ కథను రాసుకున్నారు. ఈ కథలో స్కూల్ స్టూడెంట్స్ గా చాలామంది పిల్లలు కనిపిస్తారు. కానీ వాళ్లలో ఏడు ప్రధానమైన పాత్రలను ఎంచుకుని, ఆ పాత్రలను ఆవిష్కరించిన తీరు సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. ఆ పాత్రల స్వభావాలను ఆమె ఆవిష్కరించిన విధానం బాగుంది. 

ఈ సిరీస్ కి కరణ్ కపాడియా .. నిత్య మెహ్రా .. కోపాల్ నైతాని .. సుధాంశు సరియా దర్శకత్వం వహించారు. అయితే ఈ సిరీస్ మొత్తానికి ఒక్కరు దర్శకత్వం వహించినట్టుగానే అనిపించడం విశేషం. మొదటి నుంచి చివరి వరకూ అదే మార్క్ కనిపిస్తూ ఉంటుంది. బోర్డింగ్ స్కూల్లో ఉండే టీనేజ్ పిల్లల అల్లరి .. ఆకతాయి వేషాలు .. వ్యామోహాలు .. కోరికలు .. ప్రేమలు .. సందేహాలు .. స్నేహం కోసం చేసే త్యాగాలు .. ఇతరులతో పడే గొడవలు వీటన్నిటినీ కూడా దర్శకులు గొప్పగా కళ్లముందుంచారు.

ఈ కథలో ప్రధానమైన పాత్రలను పోషించిన ఏడుగురు పిల్లలు కూడా చాలా సహజంగా నటించారు. సహజత్వానికి దగ్గరగా తమ పాత్రను తీసుకుని వెళ్లడంలో పోటీపడ్డారు. తమ వయసుకి తగినట్టుగా అల్లరి చేస్తూ ఎంతగా ఆకట్టుకున్నారో, ఎమోషనల్ సీన్స్ లోను అంతే మెప్పించారు. ఎవరూ ఎవరిముందూ తేలిపోలేదు. తమ పాత్రలపై పూర్తి అవగాహనతో చేయడం చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం. కబీర్ తేజ్ పాల్ కెమెరాపనితనం .. రాహుల్ పైస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. దీపిక ఎడిటింగ్ బాగున్నాయి.  

తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల ఎలా ఉండాలి? వారి ప్రవర్తన పిల్లల భవిష్యత్తుపై ఎలా పడుతుంది? అనే విషయాలను కూడా చాలా సహజంగా చూపించారు. సరదా సరదాగా సాగిపోయే సన్నివేశాలతో పాటు, మనసును బరువెక్కించే సీన్స్ కూడా ఉన్నాయి. ఈ సిరీస్ ను ఈ తరం పిల్లల స్వభావానికి తగినట్టుగానే చూపించామని మేకర్స్ భావించవచ్చు. కానీ అక్కడక్కడా కొన్ని సీన్స్ అభ్యంతరకరంగానే అనిపిస్తాయి. మనం చూసేది స్కూల్ పిల్లల సిరీస్ కాదా? అనే  సందేహం కలుగుతుంది. ఇలాంటి ఒకటి రెండు సన్నివేశాల కారణంగా, ఒక మంచి ఆవిష్కరణకు దూరంగా జరిగారనిపిస్తుంది. 

Movie Details

Movie Name: Big Girls Dont Cry

Release Date:

Cast: Pooja Bhat, Raima Sen, Avanthika, Aneeth Pedda, Afrah, Dalai, Vidushi, Akshitha Sood, Anandini

Director: Karan Kapadia - Nithya Mehra

Producer: Ashi Dua Sara - Karan Kapadia

Music: Rahul Pais

Banner: A Mangata Film Production

Big Girls Dont Cry Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews