'తలైవన్ తలైవి' (సార్ .. మేడమ్) అమెజాన్ ప్రైమ్ మూవీ రివ్యూ!

  • తమిళంలో రూపొందిన  'తలైవన్ తలైవి' 
  • తెలుగు ప్రేక్షకులకు ముందుకు 'సార్ .. మేడమ్'
  • ఈ నెల 22 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ 
  • ఆకట్టుకునే కథాకథనాలు 
  • విజయ్ సేతుపతి - నిత్యా మేనన్ నటన హైలైట్
            

తమిళంలో విజయ్ సేతుపతి - నిత్యామీనన్ జంటగా 'తలైవన్ తలైవి' సినిమా రూపొందింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జులై 25వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఆగస్టు 1వ తేదీన 'సార్ మేడమ్' టైటిల్ తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 30 కోట్లకి పైగా బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 80 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. రొమాంటిక్ యాక్షన్ కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 22వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ: 'మదురై'కి సమీపంలో .. పక్కపక్కనే ఉన్న రెండు గ్రామాలు అవి. ఒక ఒక గ్రామంలో ఆకాశ్ వీరయ్య (విజయ్ సేతుపతి) హోటల్ నడుపుతూ ఉంటాడు. తండ్రి సుబ్బయ్య .. తల్లి పార్వతి .. ఓ తమ్ముడు .. ఓ చెల్లి .. ఇదే అతని కుటుంబం. అందరూ కూడా హోటల్ పనిలో ఆకాశయ్యకు సాయపడుతూ ఉంటారు. 'పరోటాలు' చేయడంలో అతని తరువాతనే ఎవరైనా అనే ఒక పేరు ఆ ఏరియాలో ఉంటుంది. ఆ పక్కనే గల విలేజ్ లోనే, రాణి (నిత్య మేనన్) తన ఫ్యామిలీతో కలిసి నివసిస్తూ ఉంటుంది.

ఆకాశయ్యకి .. రాణికి పెళ్లిచూపులు జరుగుతాయి. ఒకరిని ఒకరు ఇష్టపడతారు. ఆకాశయ్య పెద్దగా చదువుకోలేదని తెలిసి కూడా రాణి ఆ పెళ్లికి ఒప్పుకుంటుంది. అయితే ఈ సంబంధం రాణి అన్నయ్య 'బాలరాజు'కు ఎంతమాత్రం ఇష్టం ఉండదు. సంబంధం కుదుర్చుకున్న తరువాత, ఆకాశయ్య .. ఆయన తండ్రి .. తమ్ముడు పెద్ద రౌడీలనే విషయం రాణి ఫ్యామిలీకి తెలుస్తుంది. పెళ్లి సంబంధాల సమయంలో వాళ్లు చెప్పిన విషయాలన్నీ అబద్ధాలని అర్థమవుతుంది.   
       
ఇలాంటి పరిస్థితుల్లోనే రాణి కోడలిగా రావడం ఆ ఇంటికి ఎంతమాత్రం మంచిది కాదని ఆకాశయ్య తల్లికి ఒక జ్యోతిష్కుడు చెబుతాడు. ఆకాశయ్య ను వివాహం చేసుకుంటే ఆమె జీవితం ఆగమైపోతుందని రాణి పేరెంట్స్ ఆమెను వారించడం మొదలుపెడతారు. కానీ అప్పటికే వాళ్ల మధ్య ఒక ఎమోషన్ బలపడుతుంది. అందువలన పెద్దవాళ్ల మాటలను పట్టించుకోకుండా ఆ ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. అక్కడి నుంచి వాళ్ల జీవితం ఎలా సాగుతుంది? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది? అనేది కథ. 

విశ్లేషణ
: దర్శకుడు పాండిరాజ్ ఈ కథను తయారు చేసుకున్న తీరు .. కథనాన్ని నడిపించిన విధానం ప్రేక్షకులను అలా కూర్చోబెడుతుంది. ఆయా పాత్రలను తీర్చిదిద్దిన పద్ధతి .. ఆ పాత్రల స్వరూప స్వభావాలను సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించడంలో తనదైన మార్క్ మనలను మెప్పిస్తుంది. ఈ కథను మనం టీవీ ముందు కాకుండా, ఆ విలేజ్ లోని అరుగుపై కూర్చుని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. 

ఒకరిపట్ల ఒకరికి విపరీతమైన ప్రేమ కలిగిన భార్యాభర్తలు. తమ ఇగోలు .. పట్టుదలలు .. పౌరుషలతో వాళ్లు విడిపోవడానికి కారణమయ్యే పెద్దవాళ్లు. ఈ రెండు వర్గాల చుట్టూ తిరిగే ఈ కథ ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది జీవితాలలో చాలా సాధారణంగా కనిపించే సన్నివేశాలు ఈ సినిమాలో మనకి అంతే సహజంగా కనిపిస్తాయి. కథ ఫ్లాష్ బ్యాక్ కీ .. ప్రస్తుతానికి మధ్య అటూ ఇటు తిరుగుతూ ఉంటుంది. అయినా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. 

దర్శకుడు ఒక చిన్న గొడవతోనే ఈ కథను మొదలుపెడతాడు. కథలో చాలా శాతం గొడవలే ఉంటాయి. ఆ గొడవలకి లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్స్ .. కామెడీ కనెక్ట్ అయ్యుంటాయి. అందువలన ఎక్కడా బోర్ అనిపించకుండా ఈ కథ సరదాగా అలా సాగిపోతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలో ఎవరూ తలదూర్చకూడు. ఎందుకంటే వాళ్ల మధ్య బాండింగ్ బయటివారికి అర్థం కాదు. వాళ్లు ఎన్ని గొడవలు పడినా ఆ గొడవలో ప్రేమ ఇమిడిపోయే ఉంటుంది గానీ .. ఇంకిపోదు అనే సందేశం ఇచ్చిన కథ ఇది. 

పనితీరు: కథాకథనాల వైపు నుంచి దర్శకుడికి మంచి మార్కులు పడతాయి. సన్నివేశాలను డిజైన్ చేసిన తీరు, ఆడియన్స్ ను కూడా లొకేషన్స్ కి తీసుకుని వెళ్లి నిలబెడతాయి. సుకుమార్ ఫొటోగ్రఫీ .. సంతోష్ నారాయణ్ నేపథ్య సంగీతం .. ప్రదీప్ రాఘవ్ ఎడిటింగ్ ఈ కథకు మరింత సపోర్ట్ చేశాయి. అందరూ కలిసి పెర్ఫెక్ట్ కంటెంట్ ను అందించారనే చెప్పాలి.

మొరటుతనం .. మొండితనం రెండూ ఉన్నప్పటికీ, భార్యపట్ల విపరీతమైన ప్రేమ కలిగిన భర్త పాత్రలో విజయ్ సేతుపతి నటన ఆకట్టుకుంటుంది. ఇటు అత్త .. ఆడపడుచు, అటు తల్లి మాటల  ప్రభావం ఉన్నప్పటికీ, తనపై భర్తకి గల ప్రేమను కొట్టిపారేయలేని భార్య పాత్రలో నిత్య మేనన్ నటన కూడా ఆకట్టుకుంటుంది. ఇక నిత్యామీనన్ అత్త పాత్రలో దీపా శంకర్ నటన కూడా నవ్విస్తుంది. 

ముగింపు
: ఆసక్తికరమైన కథాకథనాలు .. పాత్రలను డిజైన్ చేసిన తీరు, లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్ .. కామెడీని కలిపి అందించిన విధానం ప్రేక్షకులను అలరిస్తుంది. ఫ్యామిలీతో కలిసి సరదాగా చూడదగిన సినిమా ఇది.

Movie Details

Movie Name: Thalaivan Thalaivii

Release Date: 2025-08-22

Cast: Vijay Sethupathi,Nithya Menen, Yogi Babu, Roshini Haripriyan,Deepa Shankar,Chemban Vinod Jose

Director: Pandiraj

Producer: Sendhil Thyagarajan

Music: Santhosh Narayanan

Banner: Sathya Jyothi Films

Review By: Peddinti

Thalaivan Thalaivii Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews