'మిస్ యూ' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

సిద్ధార్థ్ హీరోగా తెలుగు .. తమిళ భాషల్లో నిర్మితమైన సినిమానే 'మిస్ యూ'. రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, క్రితం ఏడాది డిసెంబర్ 13వ తేదీన థియేటర్లకు వచ్చింది. రొమాంటిక్ కామెడీ జోనర్లో రూపొందిన ఈ సినిమా,  ఈ నెల 10వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఒకసారి చూద్దాం.   

కథ: ఈ కథ చెన్నైలో మొదలవుతుంది. వాసు (సిద్ధార్థ్) తన ఫ్యామిలీతో కలిసి చెన్నైలో నివసిస్తూ ఉంటాడు. సినిమా డైరెక్టర్ కావాలనేది అతని కోరిక. అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటాడు. వాసూకి నిజాయితీ .. ఆవేశం రెండూ ఎక్కువే. అందువల్లనే మురళి అనే కుర్రాడి హత్యకేసుకి సంబంధించి, మంత్రి చిరాయుడు (శరత్ లోహితస్య) కొడుకుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాడు. దాంతో ఆ మంత్రి తన అనుచరులతో వాసూకి యాక్సిడెంట్ చేయిస్తాడు. 


ప్రమాదానికి గురైన వాసూ గత రెండేళ్లుగా తన జీవితంలో జరిగిన అన్ని సంఘటనలు మరిచిపోతాడు. అతనికి గతం గుర్తులేదు గనుక చినరాయుడు అంతటితో వదిలేస్తాడు. ప్రమాదం నుంచి కోలుకున్న వాసూకి బాబీ (కరుణాకరన్)తో పరిచయం ఏర్పడుతుంది. అతనితో కలిసి వాసూ బెంగుళూర్ వెళతాడు. బాబీకి అక్కడ ఒక పెద్ద కాఫీ షాప్ ఉంటుంది. అందులో వాసు సరదాగా పనిచేయడం మొదలుపెడతాడు. అక్కడే అతనికి సుబ్బులక్ష్మి ( ఆషిక రంగనాథ్) తారసపడుతుంది. 

సుబ్బులక్ష్మిని చూడగానే వాసు మనసు పారేసుకుంటాడు. ఆమె పట్ల తనకి గల ప్రేమను వ్యక్తం చేస్తాడు. అందుకు ఆమె కొంత కటువుగానే 'నో' చెబుతుంది. తన పేరెంట్స్ ద్వారా సుబ్బులక్ష్మిని ఒప్పించాలనే ఉద్దేశంతో చెన్నైకి వెళతాడు. సుబ్బులక్ష్మి ఫొటో చూపించి, తన మనసులోని మాట చెబుతాడు. దాంతో అతని పేరెంట్స్ తో పాటు అక్కడి ఫ్రెండ్స్ కూడా ఉలిక్కి పడతారు. ఎలాంటి పరిస్థితుల్లోను ఆ పెళ్లి జరగదని చెబుతారు. అందుకు కారణం ఏమిటి? సుబ్బులక్ష్మి ఎవరు? అంతకుముందు ఏం జరిగింది? అనేది కథ.     

విశ్లేషణ: దర్శకుడు రాజశేఖర్ లవ్ .. ఎమోషన్ .. కామెడీని కలుపుకుంటూ ఈ కథను తయారు చేసుకున్నాడు. లవ్ ట్రాక్ కి కామెడీని జోడించిన ఆయన, ఫ్యామిలీ ఎమోషన్స్ కు పెద్దపీట వేశాడనే చెప్పాలి. హీరోకి ఒక నిజం తెలియడానికి ముందు కథగా ఫస్టాఫ్ .. ఆ నిజం తెలిసిన తరువాత జరిగే కథగా సెకండాఫ్ తెరపైకి వస్తాయి. ఆడియన్స్ గెస్ కి అందని విధంగా కథను అల్లుకున్న తీరు బాగుంది. 

హీరో - హీరోయిన్ కాంబినేషన్లోని ఒక మూడు నాలుగు సన్నివేశాలు ఈ కథలో చాలా కీలకమైనవిగా కనిపిస్తాయి. ఆ సన్నివేశాలు ప్రేక్షకులకు వెంటనే కనెక్ట్ అవుతాయి. విలన్ పవర్ఫుల్ .. అయినా ఎప్పుడు పడితే అప్పుడు ఎంట్రీ ఇవ్వడు. అవసరమైనప్పుడే ఆ పాత్రను తెరపైకి తీసుకుని రావడం కూడా బాగుంది. హీరోయిన్ కీ .. ఆమె తండ్రికి మధ్య గల ఎమోషన్స్ ను దర్శకుడు వర్కౌట్ చేసిన తీరు మెప్పిస్తుంది. 

ఈ కథ చాలా నిదానంగా మొదలైనప్పటికీ .. ఆ తరువాత పాకం కుదురుతూ వెళుతుంది. ఒక్కో సన్నివేశాన్ని రివీల్ చేస్తూ వెళ్లే స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ప్రధానమైన బలంగా అనిపిస్తుంది. నిజానికి ఈ కథలో కొత్తదనం ఉంది .. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే కంటెంట్ ఉంది. మరి ఈ సినిమాను థియేటర్స్ లో ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించుకుంటే, టైటిల్ మైనస్ అయిందేమోనని అనిపిస్తుంది.

పనితీరు: రాజశేఖర్ దర్శక ప్రతిభ .. శామ్యూల్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సిద్ధార్థ్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. గతానికి సంబంధించిన అయోమయం .. వర్తమానంలోని గందరగోళం మధ్య నలిగిపోయే పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఇక ఆషిక రంగనాథ్ చాలా గ్లామరస్ గా కనిపించింది. ఆమె ఎక్స్ ప్రెషన్స్ ఆడియన్స్ మనసులను పట్టుకుంటాయి.

వెంకటేశ్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. ఆయా సన్నివేశాలను ఆయన తనదైన స్టైల్లో తెరపైకి తీసుకొచ్చిన విధానం మెప్పిస్తుంది. పాటలను కూడా చాలా అందంగా ఆవిష్కరించాడు. ముఖ్యంగా ఆషిక రంగనాథ్ ను చీరకట్టులో గొప్పగా చూపించాడు. గిబ్రాన్ బాణీలు ఓ మాదిరిగా అనిపిస్తాయిగానీ, నేపథ్య సంగీతం మాత్రం ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. దినేశ్ ఎడిటింగ్ కూడా నీట్ గా అనిపిస్తుంది.

ముగింపు: 'మిస్ యూ' అనే టైటిల్ కథకి తగినదే అయినా, అది ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదేమో అనిపిస్తుంది. ఒక డబ్బింగ్ సినిమా టైటిల్ మాదిరిగా వాళ్లకి అనిపించి లైట్ తీసుకుని ఉండొచ్చు. కానీ మంచి ఫీల్ తో కూడిన కంటెంట్ అయితే ఉంది. ఈ కథ నిదానంగా సాగుతున్నట్టుగా అనిపించినప్పటికీ, ఫీల్ తో కూడిన మంచి డ్రామాను నడిపించడానికి దర్శకుడు తీసుకున్న సమయంగా భావించవచ్చు. ఎలాంటి అభ్యంతరకరమైన దృశ్యాలకు .. సంభాషణలకు చోటులేని ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు.

Movie Details

Movie Name: Miss You

Release Date:

Cast: Siddharth, Ashika Ranganath, karunakaran, Jaya Prakash, Ponvannan

Director: Rajasekhar

Producer: Samuel Mathew

Music: Ghibran

Banner: 7 Miles Per Second

Miss You Rating: 2.75 out of 5

Trailer

More Movie Reviews