'హార్ట్ బీట్' (హాట్ స్టార్) వెబ్ సిరీస్ రివ్యూ!

  • మెడికల్ డ్రామాగా సాగే 'హార్ట్ బీట్'
  • 100 ఎపిసోడ్స్ తో నడిచే సిరీస్ 
  • బలమైన కథ 
  • ఆసక్తికరమైన కథనం
  • అనూహ్యమైన మలుపులతో సాగే కంటెంట్  

ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై థ్రిల్లర్ సిరీస్ లు .. క్రైమ్ సిరీస్ లు తమ జోరును కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తమిళం నుంచి ఒక మెడికల్ డ్రామా సిరీస్ వచ్చింది. ఇది 100 ఎపిసోడ్స్ ను కలిగిన సిరీస్. ఒక్కో ఎపిసోడ్ నిడివి 25 నిమిషాల వరకూ ఉంటుంది. 2023 మార్చి 8 నుంచి మొదలైన ఈ సిరీస్, విడతల వారీగా ఈ ఏడాది ఆగస్టు వరకూ 'హాట్ స్టార్' లో స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ అవుతూ వచ్చింది. అక్టోబర్ 30 నుంచి ఇతర భాషా ప్రేక్షకులను పలకరిస్తోంది.   

కథ: అది 'ఆర్కే' హాస్పిటల్ .. సిటీలోని పెద్ద హాస్పిటల్స్ లో ఒకటి. హాస్పిటల్ కి 'ఆర్కే' (జయరావు) చైర్మన్ గా ఉంటాడు. ఆయన ఒక్కగానొక్క కొడుకు అర్జున్ ( చారుకేశ్). తల్లిలేని అతనికి ఎలాంటి లోటు లేకుండా ఆయన పెంచి పెద్ద చేస్తాడు. అతను మద్యానికి బానిసై, బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటాడు. మంచి అమ్మాయి కోడలుగా వచ్చి, అతని జీవితాన్ని సరిదిద్దాలనేది ఆయన కోరిక.

'ఆర్కే' హాస్పిటల్లోనే సీనియర్ డాక్టర్ గా రతి ( అనుమోల్) పనిచేస్తూ ఉంటుంది. రతికి ఇద్దరు పిల్లలు .. భర్త దేవ్ సహకారం వలన ఆమె తన పనిని సిన్సియర్ గా చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. రతి పట్ల గల విశ్వాసంతో హాస్పిటల్ బాధ్యతను ఆర్కే ఆమెపైనే వదిలేస్తాడు. హాస్పిటల్ లో ట్రైనింగ్ డాక్టర్స్ గా రీనా (దీప) తేజు (యోగలక్ష్మి) మదన్ (అమిత్ భార్గవ్) నవీన్ (రామ్) రాకీ (శబరీశ్) చేరతారు. రతి మేడం చాలా స్ట్రిక్ట్ అనే విషయం వాళ్లకి మొదటిరోజునే అర్థమైపోతుంది. 

రీనా ఓ అనాథ. ఓ శరణాలయంలో ఉంటూ చదువుకుని డాక్టర్ అవుతుంది. లేడీస్ హాస్టల్ లో ఉంటూ జాబ్ వెతుక్కుంటుంది. ఆమె చేరిన ఫస్టు హాస్పిటల్ 'ఆర్కే'. దురదృష్టం కొద్దీ మొదటి రోజునే రతి మేడమ్ తో చీవాట్లు తింటుంది. అయితే అందుకు 'ఆర్కే' తనయుడు అర్జున్ చేసిన పని కారణమవుతుంది. తాను  జాబ్ చేస్తున్న హాస్పిటల్ కి అర్జున్ వారసుడు అనే విషయం తెలియకుండానే, అతనితో ఆమె పరిచయం జరిగిపోతుంది. అయితే అర్జున్ ఎవరనేది ముందుగానే పసిగట్టిన తేజూ అతణ్ణి ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. 

 అదే హాస్పిటల్లో రవి (లక్ష్మణ్) అనిత (పదినే కుమార్) సీనియర్ డాక్టర్స్ గా ఉంటారు. వాళ్లిద్దరూ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ .. ప్రస్తుతం లవర్స్. ఇద్దరూ కలిసి జూనియర్ డాక్టర్స్ ను సరదాగా ఆటపట్టిస్తూ ఉంటారు. వారికి అర్జున్ ఎవరనేది తెలుసు. అయితే అతను తానెవరనేది రీనాతో చెప్పకుండా ఆమెను ఆరాధిస్తున్నాడని వారికి తెలియదు. ఈ నేపథ్యంలోనే అనారోగ్యంతో 'ఆర్కే' తన హాస్పిటల్లో చేరతాడు. 

'ఆర్కే' విషయంలో రతితో రీనాకి గొడవ జరుగుతుంది. ఆ సమయంలోనే ఆమెకి రీనా ఒక నిజం చెబుతుంది. అదేమిటి? ఆ నిజం తెలుసుకున్న రతి ఏం చేస్తుంది? 'ఆర్కే' అనారోగ్యానికి కారణం ఏమిటి? అర్జున్ - రీనా ప్రేమ వ్యవహారం ఎంతవరకూ వెళుతుంది? అర్జున్ ను పొందడం కోసం తేజూ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయా? అనేది కథ.

విశ్లేషణ: దీపక్ సుందరరాజన్ తయారు చేసుకున్న కథ ఇది. మెడికల్ డ్రామా జోనర్లో ఈ కథ నడుస్తుంది. హాస్పిటల్ నేపథ్యంలో ఎక్కువగా నడిచే డ్రామా ఇది. ఒక వైపున హాస్పిటల్ .. పేషంట్స్ .. అత్యవసర సమయాల్లో డాక్టర్స్ ఫేస్ చేసే ఇబ్బందులు .. వారి వ్యక్తిగత జీవితాలు .. వాటితో కూడిన ఎమోషన్స్ ను టచ్ చేస్తూ అల్లుకున్న ఈ కథ ఆకట్టుకుంటుంది. పాత్రలకి తగిన నటీనటులను ఎంచుకున్న తీరు బాగుంది.

దర్శకుడు ఈ సిరీస్ కి సంబంధించిన ప్రధానమైన పాత్రలను చాలా సహజంగా ఫస్టు ఎపిసోడ్ లోనే పరిచయం చేసిన తీరును మెచ్చుకోవలసిందే. ఆ పాత్రల స్వరూప స్వభావాలు ఆడియన్స్ కి వెంటనే అర్థమయ్యేలా చేస్తూ, వాటిని రిజిస్టర్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. మొదటి 10 ఎపిసోడ్స్ లోనే ఆయన లవ్ .. కామెడీ .. ఎమోషన్స్ కి బలమైన ట్రాక్ సెట్ చేసిన తీరు ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది.      

మొదటి 10 ఎపిసోడ్స్ చూడగానే, మిగతా 90 ఎపిసోడ్స్ ను ఫాలో కావొచ్చునని అనిపిస్తుంది. మెడికల్ డ్రామా కనుక, అప్పుడప్పుడు కొన్ని కేసులు కంగారు పెట్టినప్పటికీ, వాటి వెనుక దాగిన ఎమోషన్స్ అటు వైపు లాగుతూ ఉంటాయి. రతి .. రీనా .. అర్జున్ .. తేజూ పాత్రల మధ్య జరిగే సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తిస్తాయి. డాక్టర్స్ కి సంబంధించిన సిరీస్ గనుక, సీరియస్ గా అనిపించకుండా కామెడీని టచ్ చేసిన విధానం కూడా మెప్పిస్తుంది.       
         
నిజానికి హాస్పిటల్ నేపథ్యంలోని సీరియల్స్ .. సిరీస్ లు అంతగా వర్కౌట్ కావు. అందుకు కారణం అంబులెన్స్ ల సైరన్లు .. స్ట్రెచర్లు .. యాక్సిడెంట్ కేసులు .. రక్తపాతం ..  ఇలాంటి సన్నివేశాలను  చూడటానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఈ సిరీస్ లో అలాంటి సీన్స్ తో పాటు, లవ్ .. ఎమోషన్స్ .. కామెడీని మిక్స్ చేసి అందించడం వలన, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా పెద్దగా టెన్షన్ తీసుకోకుండా చూసేలా ఈ సిరీస్ ఉంటుంది. 

పనితీరు: నటీనటుల నటన ఈ సిరీస్ కి ప్రధానమైన ఆకర్షణ అని చెప్పాలి. ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా రతి .. రీనా .. రవి .. అర్జున్ .. తేజూ పాత్రలను పోషించిన ఆర్టిస్టులు తమ పాత్రలలో జీవించారు. అందువలన మనం ఈ సిరీస్ కి వెంటనే కనెక్ట్ అయిపోతాము. 

స్క్రీన్ ప్లే ఈ సిరీస్ కి ప్రాణమని చెప్పాలి. దర్శకుడు ఫస్టు ఎపిసోడ్ లోనే ప్రధానమైన పాత్రలను పరిచయం చేయడం .. 100 ఎపిసోడ్స్ కి అవసరమైన ఒక ఎమోషనల్ ట్రాక్ వేయడం అందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. ఆ ట్రాక్ కి సపోర్టుగా లవ్ .. కామెడీ .. విలనిజం సెట్ చేసిన తీరు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.  ప్రతి పాత్ర పట్ల పూర్తి అవగాహనంతో ఆయన డిజైన్ చేసిన విధానం, ఆ పాత్రలు ప్రవర్తించే తీరును బట్టి అర్థమైపోతుంది.       

రెజిమెల్ సూర్య థామస్ - సంతోష్ పాండి కెమెరా పనితనం బాగుంది. శరణ్ రాఘవన్ నేపథ్య సంగీతం ఈ సిరీస్ కి అదనపు బలాన్ని చేకూర్చిందని చెప్పచ్చు. విఘ్నేశ్ అర్జున్ - శ్రీధర్ ఎడిటింగ్ వర్క్ నీట్ గా అనిపిస్తుంది. ఎపిసోడ్స్ సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, ఒక్కో ఎపిసోడ్ నిడివి తక్కువగానే ఉంటుంది. ప్రతిసారి ఇంట్రస్టింగ్ బ్యాంగ్ తోనే నెక్స్ట్ ఎపిసోడ్ లోకి తీసుకుని వెళుతుంది గనుక, ఈ సిరీస్ ను ఫాలో కావొచ్చు. 

Movie Details

Movie Name: Heart Beat

Release Date: 2024-10-30

Cast: Deepa Balu, Anumol, Charukesh, Amit Bhargav, Yogalakshmi

Director: Deepak Sundarrajan - Adbul Kabeez

Producer: Padmini Velu - Rajavelu

Music: Saran Raghavan

Banner: Tele Factory Productions

Review By: Peddinti

Heart Beat Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews