'ఓం' - మూవీ రివ్యూ!

Movie Reviews
Rating: 2.25/5Action, ThrillerMovie details ›
Advertisement

O.M Review

ధనుష్ .. శ్రీలీల .. మమ్ముట్టి .. సాయిపల్లవి .. నసీరుద్దీన్ షా .. ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్. అలాంటి ఈ కాంబినేషన్లో రూపొందిన సినిమానే O.M (ఆపరేషన్ మోల్). పోస్టర్స్ .. ట్రైలర్ చూసినవాళ్లందరికీ కథ కాస్త అర్థమైనప్పటికీ కాంబినేషన్ కొత్తగా అనిపించింది. ఒక సోల్జర్ నేపథ్యంలో 'అమరన్' ను తెరకెక్కించి మంచి మార్కులు కొట్టేసిన రాజ్ కుమార్ పెరియస్వామి, ఈ సారి అందుకు పూర్తి భిన్నమైన కథను ఎంచుకున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఆయన రూపొందించిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది.

చిత్తూరు జిల్లా నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్ జోరుగా కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి దుబాయ్ కీ .. అక్కడి నుంచి జపాన్ .. హాంకాంగ్ కు ఎర్రచందనం తరలించబడుతూ ఉంటుంది. చెన్నైకి చెందిన కార్తికేయన్ (మమ్ముట్టి) ఈ మొత్తం వ్యవహారంలో చక్రం తిప్పుతుంటాడు. దుబాయ్ లో ఉంటూ ఈ మాఫియా మొత్తానికి నాయకుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు అబ్దుల్ హమీద్ (నసీరుద్దీన్ షా). ఎర్రచందనం చెట్లు నరికే కూలీలుగా తమిళనాడులోని 'జవ్వాది మలై'కి చెందిన గూడెం ప్రజలు పనిచేస్తుంటారు. 

స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారిణిగా నిత్యారెడ్డి (సాయి పల్లవి) ఉంటుంది. ఫారెస్ట్ ఆఫీసర్ గా ఉన్న ఆమె తండ్రి .. పోలీస్ ఆఫీసర్ గా ఉన్న ఆమె భర్త కూడా ఎర్రచందనం మాఫియాకి బలైపోతారు. అందువలన ఆమె ఈ మాఫియా వెనుక ఎవరు ఉన్నది తెలుసుకుని వాళ్లకి శిక్ష పడేలా చేయాలనుకుంటుంది. అలా ఆమె ఆదేశం మేరకు అండర్ కవర్ ఆఫీసర్ గా చెన్నై కి వెళ్లిన 'పళని' (ధనుష్) తన పేరును 'తిరు'గా మార్చుకుని, కార్తికేయన్ క్యాంప్ లో అడుగుపెడతాడు. చాలా తక్కువ సమయంలోనే ఆయన నమ్మకాన్ని సంపాదిస్తాడు. 

'పళని' భార్య 'రోజా'( శ్రీలీల). ఈ ఇద్దరికీ ఒక కొడుకు ఉంటాడు. 'పళని' తండ్రి షణ్ముగం (ఇంద్రన్స్) కూడా వాళ్లతోనే కలిసుంటాడు. అయితే వీళ్లెవరికీ పళని ఏం చేస్తున్నది తెలియదు. కార్తికేయన్ స్థావరాలు .. ఎర్రచందనం దాచిన ప్రదేశాలను గురించి 'తిరు' తెలుసుకుంటాడు. ఆ ఎర్రచందనం బయటికి వచ్చేలా చేస్తేనే, మాఫియా నాయకుల కదలికలు తెలుస్తాయని నిత్యారెడ్డి భావిస్తుంది. అలా ఆమె 'తిరు' ద్వారా 700 టన్నుల లోడ్ ను రోడ్డెక్కించగలుగుతుంది. ఆమె వ్యూహం ఫలిస్తుందా? ఎర్రచందనం మాఫియాను అడ్డుకోగలుగుతుందా? ఈ మొత్తం ఆపరేషన్ లో 'తిరు'కి ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి? అనేదే మిగతా కథ.


తన తండ్రినీ .. భర్తను పొట్టనబెట్టుకున్న ఎర్రచందనం మాఫియాను కట్టడి చేయాలని టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ నిత్యారెడ్డి రంగంలోకి దిగుతుంది. ఆమె ఆదేశాలను ఆచరణలో పెట్టడం కోసం అండర్ కవర్ ఆఫీసర్ గా 'తిరు' బరిలోకి దిగుతాడు. ఈ ఇద్దరూ కలిసి ఈ మాఫియా నాయకులను ఎలా ఎదిరించారు? అందుకోసం ఎలాంటి సాహసాలు చేశారు? ఎటువంటి త్యాగాలు చేశారు? అనేదే ఈ కథలోని ప్రధానమైన అంశం.


ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో గతంలో చాలానే కథలు తెరపైకి వచ్చాయి. ఇటు సిన్సియర్ పోలీస్ అధికారులు .. అటు మాఫియా ముఠా నాయకుల మధ్యనే ఈ తరహా కథలు నడిచేవి. అయితే ఈ మధ్యలో నలిగిపోయే కూలీలు .. చితికిపోయే వారి కుటుంబాలను టచ్ చేయడం, ఈ కథలోని కొత్త అంశంగా అనిపిస్తుంది. మాఫియాకి సంబంధించిన లోకల్ లీడర్లను పట్టుకోవడానికే పరిమితం కాకూడదు. అలాగే కూలీల కుటుంబాలకు వేరే ఉపాధి మార్గాలు చూపించాలనే ఒక కొత్త పాయింట్ దిశగా దర్శకుడు ఈ కథను తీసుకెళ్లాడు.

కార్తికేయన్ కి అనుమానం రాకుండా 'తిరు' తన ప్లాన్ ను ఎగ్జిక్యూట్ చేసే సన్నివేశాలు .. కార్తికేయన్ ముఠాను పోలీస్ ఫోర్స్ చుట్టముట్టడం .. కూలీలను ఎన్ కౌంటర్ చేయకుండా 'తిరు' అడ్డుకోవడం .. ప్రీ క్లైమాక్స్ లో కోర్టు సీన్ .. ఇంటర్వెల్ కి ముందొచ్చే ఇంద్రన్స్ సీన్ ఈ సినిమా హైలైట్స్ లో చోటు సంపాదించుకుంటాయి. ఇక ఇటు తిరుపతి నేపథ్యం .. అటు అరుణాచలం నేపథ్యం తీసుకోవడం మరో ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకోవాలి. 

దర్శకుడు కథను కదిలించిన తరువాత ఎక్కువ సమయం తీసుకోకుండానే ముందుగా సాయిపల్లవి పాత్రను .. ఆ తరువాత ధనుష్ పాత్రలను పరిచయం చేశాడు. ఆరంభం సన్నివేశాలు మాత్రం ఒక 15 నిమిషాలు పాటు గోలగోలగా సాగుతూ గుండె దడ తెప్పిస్తాయి. ఆ తరువాత కాస్త సాదాసీదాగా అనిపించే సన్నివేశాలతోనే కథ నడక సాగుతూ ఉన్నప్పటికీ, ఇంటర్వెల్ కి ముందు 'తిరు' తండ్రి కాల్ చేసిన దగ్గర నుంచే కథ పుంజుకుంటుంది.

ధనుష్ పాత్రను .. సాయిపల్లవి పాత్రను డిజైన్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. తెరపై ఈ రెండు పాత్రలు చాలా బలంగా కనిపిస్తాయి. ఆ పాత్రలలో ఇద్దరూ ఒదిగిపోయారు. ఇక తాను చేసేది స్మగ్లింగ్ అయినప్పటికీ మానవత్వం .. నిజాయితీ ఉన్న వ్యక్తిగా మమ్ముట్టి నటన కూడా ఆకట్టుకుంటుంది. న్యాయం చేయకపోయినా ఫరవాలేదు .. ద్రోహం చేయకూడదు అనే ఆయన కాన్సెప్ట్ కదిలించివేస్తుంది. ఇక ధనుష్ భార్యగా శ్రీలీల లుక్ కొత్తగా అనిపిస్తుంది. నసీరుద్దీన్ షా పాత్ర నామ మాత్రం అన్నట్టుగా చూపించారు.   

అరసు ఫొటోగ్రఫీ బాగుంది. అడవి నేపథ్యంలో సన్నివేశాలను .. తిరుమల .. అరుణాచలం కొండలను కవర్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. సాయి అభయంకర్ నేపథ్య సంగీతం, అక్కడక్కడా సన్నివేశాలను నిలబెట్టేసింది. మరికొన్ని చోట్ల మాత్రం హోరెత్తించింది. ధనుష్ గ్రూప్ సాంగ్ సాహిత్యం మనకు వినిపించదు. కలైవానన్ ఎడిటింగ్ విషయానికి వస్తే, ఆరంభ సన్నివేశాలను .. క్లైమాక్స్ లో జైలులో ఫైట్ సీన్స్ ను ట్రిమ్ చేయవచ్చు. ఇక అక్కడక్కడ కూడా కత్తెరకు గట్టిగానే పని పడుతుంది.

 యాక్షన్ .. ఎమోషన్స్ తో కూడిన కథ ఇది. కథలో కొత్త పాయింట్ కూడా ఉంది. కాకపోతే అసలు కథలోకి వెళ్లడానికి తీసుకున్న సమయం ఎక్కువగా ఉండటం, డీటేల్డ్ గా చెప్పాలనే ఉద్దేశంతో సాగదీయడం ప్రధానమైన లోపంగా కనిపిస్తుంది. స్క్రీన్ ప్లే పై ఇంకాస్త కసరత్తు చేసుంటే, మరింత బెటర్ అవుట్ పుట్ వచ్చేదేమో అనిపిస్తుంది.    

Movie Details

Movie Name: O.M

Genre: Action, Thriller

Release Date: 20 Nov 2026

Cast: Dhanush, Mammootty, Sai Pallavi, Sreeleela, Naseeruddin Shah, Indrans

Director: Rajkumar Periasamy

Music: Sai Abhyankar

Banner: Wunderbar Films

Review By: Peddinti

O.M Rating: 2.25 out of 5

Disclaimer: This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.

Trailer

Advertisement
O.MRajkumar PeriasamyDhanush - Shraddha AgrawalDhanushMammoottySai PallaviSreeleelaNaseeruddin ShahIndrans

More Movie Reviews

ENE Repeat Movie Review

19 Nov, 16:47

'ఈఎన్‌ఈ రిపీట్‌' మూవీ రివ్యూ

19 Nov, 16:38

'కికు చిరంజీవి' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!

18 Nov, 14:41

'ప్రేమద ఊరలి' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

17 Nov, 15:26

'వరం' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

16 Nov, 15:36

'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్: ఆఫ్టర్ డార్క్' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!

14 Nov, 17:57

DNK Movie Review

13 Nov, 21:07

'ఐయామ్ గేమ్' (మూవీ రివ్యూ)

13 Nov, 21:02

మౌళి 'డీఎన్‌కే' మూవీ రివ్యూ

13 Nov, 20:59
..More Movie Reviews