'అక్క' (నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

Movie Reviews
Rating: 2.25/5Crime, ThrillerSeries details ›
Advertisement

Akka Review

కీర్తి సురేశ్ ఎప్పటికప్పుడు విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది. నటన ప్రధానమైన పాత్రలను చేయడానికి ఆసక్తిని కనబరచడం ఆమె కెరియర్ తొలినాళ్ల నుంచి కనిపిస్తుంది. ఇక రాధికా ఆప్టే కూడా వైవిధ్యభరితమైన పాత్రలను చేయడానికి ఎంతమాత్రం వెనుకాడదు. అలాంటి ఈ ఇద్దరూ కలిసి నటించిన సిరీస్ గా 'అక్క' కనిపిస్తుంది. అక్టోబర్ 30వ తేదీ నుంచి 5 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోను అందుబాటులో ఉంది. 

శతాబ్దాల క్రితం 'పెర్నూర్' రాజు తన సైన్యంతో కలిసి యుద్ధానికి వెళతాడు. కానీ వాళ్లెవరూ తిరిగిరారు. దాంతో శత్రువులు ఆ రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నాలు మొదలుపెడతారు.  రాజ్య రక్షణ కోసం ఆ రాజు చెల్లెళ్లయిన ముత్తక్క .. దుగ్గమ్మ .. సుబ్బమ్మ రంగంలోకి దిగుతారు. మహిళలందరికీ యుద్ధ విద్యలతో పాటు, వ్యవసాయం .. వ్యాపారానికి సంబంధించిన మెళకువలు నేర్పిస్తారు. రాజ్యంలో మాతృస్వామ్య వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. 

 'పెర్నూరు' ప్రాంతానికి చెందిన ప్రజలంతా 'రక్తూర్తిదేవి' అమ్మవారిని కులదేవతగా కొలుస్తుంటారు.   ఈ రాజ్యంలోని నిబంధనల ప్రకారం, సింహాసనాన్ని అధిష్ఠించే అవకాశం ఉన్న స్త్రీలు వివాహం చేసుకోరు.  ఆ వంశానికి చెందిన ఆడపిల్లలకు మాత్రమే  సింహాసనం దక్కుతుంది.  వారసుల కోసమే పిల్లలను కంటారు. సింహాసనం అధిష్ఠించిన స్త్రీని అంతా 'అక్క' అని పిలుస్తారు. తన రాజ్యం కోసం .. తన ప్రజల కోసం ఆమె ఎలాంటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటుంది. 

ముత్తక్క - దుగ్గమ్మ - సుబ్బమ్మ ఈ ముగ్గురూ కూడా తమ రాజ్యాన్ని మలేమార్ .. హెర్కడా .. పెర్పలాడి అనే భాగాలుగా విభజిస్తారు. స్వాతంత్ర్యం అనంతరం ప్రభుత్వం ఈ ప్రాంతాలను విలీనం చేసుకుంటుంది. అయినా ఆ ప్రాంతంపై 'అక్క'ల ఆధిపత్యం కొనసాగుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే 'ముంబై'లో మాఫియా డాన్ గా ఉన్న శంకరన్న కన్ను పడుతుంది. గతంలో పెర్నూర్ నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి అతను. 'పెర్నూర్'లో అక్కల ఆధిపత్యానికి తాను కళ్లెం వేస్తానని చెప్పి అక్కడికి చేరుకుంటుంది 'రుద్ర'(రాధికా ఆప్టే).

రుద్ర తాను అనుకున్నది సాధించడం కోసం, 'అక్క'లకి వ్యతిరేకంగా ఉన్న వర్గాన్ని తన వైపుకు తిప్పుకోవడం మొదలుపెడుతుంది. అలాగే అక్కడి ప్రజలను ఆకర్షించడం .. అక్కల  వ్యాపారాలను దెబ్బతీయడం మొదలుపెడుతుంది.ఈ నేపథ్యంలోనే 'కావేరి' అనే పాపను వారసురాలిగా ప్రకటించిన కొన్ని రోజులకే రుద్ర హత్య చేయిస్తుంది. అలాగే ఓ పథకం ప్రకారం ముత్తక్కను చంపిస్తుంది. అప్పుడు భవాని ( కీర్తియు సురేశ్) అక్కగా సింహాసనాన్ని అధిష్ఠిస్తుంది.

అసలు 'రుద్ర' ఎవరు? ఎందుకు ఆమె అక్కల పట్ల ప్రతీకారంతో రగిలిపోతుంది? భవానిని ఎదుర్కోవడానికి ఆమె ఏం చేస్తుంది? ఆమె పన్నాగాలను తిప్పికొట్టడం కోసం భవాని ఏం చేస్తుంది? అసలు ముంబైలో ఉన్న శంకర్ భాయ్ కీ .. భవానికి ఉన్న సంబంధం ఏమిటి? తనవారిని కాపాడుకోవడం కోసం భవాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది మిగతా కథ.

1947 - 1985 మధ్య కాలంలో జరిగే కథ ఇది. 'అక్క' అంటే కేవలం ఒక వరస మాత్రమే కాదు .. తనని తాను త్యాగం చేసుకునే పెద్ద దిక్కు'. అనే ఒక డైలాగ్ ఈ సిరీస్ లో ప్రధానమైన పాత్రను పోషించిన కీర్తి సురేశ్ చెబుతుంది. అదే ఈ సిరీస్ కాన్సెప్ట్ కూడా. 'అక్క' అంటే ఒక నాయకురాలు. తనవారిని కాపాడుకునే సంరక్షకురాలు .. అదే విషయాన్ని చాటుతూ వెళ్లే కథనే ఇది. 

ఒక రాజ్యం .. అక్కడి పాలకులు .. ప్రజలు .. ఆచార సంప్రదాయాలు .. జీవన విధానం .. ఈ కథలో చోటుచేసుకుంటాయి. 'అక్క' స్థానంలో సింహాసనాన్ని అధిష్ఠించినవారికి అపజయమనేది ఉండదు. వాళ్లతో తలపడిన శత్రువులెవరూ పారిపోకుండా నిలవలేకపోయారనే అంశం చుట్టూ ఈ కథ ఆసక్తికరంగా కొనసాగుతూ ఉంటుంది. వాళ్ల మాదిరిగా ఆలోచించే స్త్రీ శత్రువుగా మారితే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ 'రుద్ర' రంగంలోకి దిగడంతో కథ పుంజుకుంటుంది. 

'అక్క'ను దెబ్బ తీయడానికి 'రుద్ర' చేసే సన్నాహాలు, ఆమెను ఎదుర్కోవడానికి 'అక్క' వేసే పథకాలు ఆడియన్స్ లో ఉత్కంఠను రేకెత్తిస్తూ వెళతాయి. గతాన్ని మనసులో పెట్టుకుని 'రుద్ర' చేసే దుర్మార్గాలు .. తన రాజ్యంలోని వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రుద్రను కట్టడి చేయడానికి 'భవాని' తీసుకునే నిర్ణయాలు ఆడియన్స్ ను అలా కూర్చోబెడతాయి. ఈ ఇద్దరి మధ్య సన్నివేశాలు ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ దిశగా పరిగెత్తిన తీరు మెప్పిస్తుంది.

కథ .. స్క్రీన్ ప్లే .. ఆయా పాత్రలకు నటీనటులను ఎంపిక చేసిన తీరు బాగుంది. ఇక 1947 .. 1985 మధ్య కాలం నాటి వాతావరణాన్ని క్రియేట్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఆ కాలం నాటి కాస్ట్యూమ్స్ విషయంలో తీసుకున్న శ్రద్ధ మంచి మార్కులు దక్కేలా చేస్తుంది. ఎమోషన్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలను డిజైన్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. అయితే సీక్వెల్ కోసం అన్నట్టుగా ఈ సీజన్ ను ముగించిన విధానం అసంతృప్తిని కలిగిస్తుంది. 

కీర్తి సురేశ్ తో పాటు మిగతా ఆర్టిస్టులంతా చాలా బాగా చేశారు. ఆ కాలం నాటి కథను .. కథగా కాకుండా నిజమేనని అనుకునేలా చాలా సహజంగా చేశారు. ప్రధానమైన పాత్రలను పోషించిన కీర్తి సురేశ్ .. రాధికా ఆప్టే నటన ఈ సిరీస్ కి హైలైట్ గా నిలుస్తుంది. ఆ కాలం నాటి లైటింగ్ ఎఫెక్ట్ తో ఫొటోగ్రఫీ మెప్పిస్తుంది. ఎడిటింగ్ తో పాటు, జాన్ స్టీవర్ట్ నేపథ్య సంగీతం అలరిస్తుంది. 

'అక్క' అంటే తనని తాను త్యాగం చేసుకునే ఒక పెద్ద దిక్కు అంటూ దర్శకుడు ఈ కథను ఎత్తుకున్న తీరు ఆకట్టుకుంటుంది. 1947- 85 మధ్య కాలంలోని కథను నడిపించే విధానం అలరిస్తుంది. కొత్త కాన్సెప్ట్ .. కొత్త కంటెంట్ కావడం వలన ప్రేక్షకులు ఏ మాత్రం బోర్ ఫీలవ్వకుండా ఫాలో అవుతారు. అక్కడక్కడా రక్తపాతంతో పాటు, అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉండటం వలన .. సరైన వాతావరణంలోనే చూడవలసిన సిరీస్ ఇది.      

        

Series Details

Series Name: Akka

Genre: Crime, Thriller

Release Date: 30 Oct 2026

Cast: Keerthi Suresh, Radhika Apte, Tanvi Azmi, Jayashree, Niveditha Bhargava, Anshuman Pushkar

Director: Dharmaraj Shetty

Music: John Stewart Eduri

Banner: YRF Entertainment

Review By: Peddinti

Akka Rating: 2.25 out of 5

Disclaimer: This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.

Trailer

Advertisement
AkkaDharmaraj ShettyAdiythya Chopra- Yogendra MogreKeerthi SureshRadhika ApteTanvi AzmiJayashreeNiveditha BhargavaAnshuman Pushkar

More Movie Reviews

'రుద్రవనం పీఎస్' (జీ 5) సిరీస్ రివ్యూ!

02 Nov, 20:15

'Adarsha Kutumbam' Movie Review

30 Oct, 17:20

'ఆదర్శ కుటుంబం' మూవీ రివ్యూ

30 Oct, 17:11

'బత్తా' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

29 Oct, 14:13

'దహాన్' (ఆహా) మూవీ రివ్యూ!

28 Oct, 15:41

'అంజాన్ సాయే' ( నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

27 Oct, 17:38

'ఖలీఫా' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

26 Oct, 18:02

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24 Oct, 17:41

'డోరతీ ' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24 Oct, 12:00
..More Movie Reviews