'దహాన్' (ఆహా) మూవీ రివ్యూ!

Advertisement
హారర్ థ్రిల్లర్ సినిమాలకి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ జోనర్ నుంచి వచ్చిన సినిమాలను చూడటానికి ఆడియన్స్ ఎక్కువ కుతూహలాన్ని కనబరుస్తూ ఉంటారు. అలా ఒడియాలో రూపొందిన సినిమానే 'దహాన్'. అనుపమ్ పట్నాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, 'ఆహా'లో ఈ నెల 16వ తేదీ నుంచి తెలుగు .. తమిళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

అది ఫారెస్ట్ ఏరియాకి దగ్గరగా ఉన్న పెద్ద బంగ్లా. ఆ బంగ్లా క్రిందనే కొన్ని వ్యవసాయ భూములు ముడిపడి ఉంటాయి. ఒకప్పుడు జమీందార్ కి సంబంధించిన బంగ్లా అది. ఆయన ఆ బంగళాలో ఒంటరిగా నివసించేవాడు. ఆ తరువాత ఒక రోజున ఆయన బాల్కనీలో నుంచి దూకేసి ఆత్మహత్య చేసుకుంటాడు. అందుకు కారణం ఏమిటనేది ఎవరికీ తెలియదు. ఆ బంగ్లా పాడుబడిపోతూ ఉంటుంది. ఆయన భూములను ఎవరెవరో సాగుచేసుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితులలో ఆయన వారసురాలిగా 'ఆనందిత' అక్కడికి వస్తుంది.

ఆ బంగ్లాతో పాటు మిగతా భూములను కూడా అమ్మేసుకుని పోవాలనే ఉద్దేశంతో, ఆనందిత తన తమ్ముడు 'సమర్' .. చెల్లెలు 'మనూ'తో కలిసి అక్కడికి వస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగానే ఆమె ఆ బంగ్లాను అమ్మేయాలనే ఆలోచన చేస్తుంది. అయితే ఆమె తీసుకున్న నిర్ణయం ఆ భూములను సాగుచేసుకుంటున్నవారికి ఆగ్రహాన్ని కలిగిస్తుంది. వాళ్లు ఆ బంగ్లాలో ఉండేలా 'పర్వేజ్' అన్నిరకాల ఏర్పాట్లు చేస్తాడు. ఆ ఇంటి వెనుక భాగంలో ఒక అవుట్ హౌస్ ఉంటుంది. బంగ్లాకి సంబంధించిన పాత సామాను అంతా అవుట్ హౌస్ లోనే ఉంటుంది.

భూముల అమ్మకానికి సంబంధించిన పనులపై ఆనందిత బయటికి వెళ్లినప్పుడు, మనూ అవుట్ హౌస్ తలుపులు తెరుస్తుంది. లోపల ఉన్న ఒక చెక్కపెట్టెను ఆమె ఓపెన్ చేస్తుంది. అందులో కొన్ని చిత్రమైన వస్తువులు ఉంటాయి. ఆ పెట్టెను ఓపెన్ చేసిన దగ్గర నుంచి 'మనూ' వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. రాత్రి వేళలో ఆ పెట్టెలో నుంచి వింత శబ్దాలు వస్తుంటాయి. ఆ పెట్టెపై రాసిన అక్షరాలు ఏమిటనేది ఆనందితకు అర్థం కాదు. అందువలన ఆమె ఆ లెటర్స్ ను ఫొటో తీసి తన ఫ్రెండ్ 'ఆదిత్య'కు పంపిస్తుంది. హిబ్రూ భాషలో 'దహాన్' అని రాసి ఉందని ఆదిత్య చెబుతాడు. 

ఆ పెట్టె తమ ఇంట్లోకి ఎలా వచ్చింది? ఆ పెట్టెతో తన తండ్రికి .. తాతకి ఉన్న సంబంధం ఏమిటి? అసలు ఆయన దానిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? దానిని ఓపెన్ చేసిన దగ్గర నుంచే 'మనూ'లో ఎందుకు మార్పు వచ్చింది? అనే విషయాలకు తన పెదనాన్న దగ్గర సమాధానాలు ఉండొచ్చని ఆనందిత భావిస్తుంది. ఉన్నపలంగా బయల్దేరి పెదనాన్న దగ్గరికి వెళుతుంది. అక్కడ ఏం జరుగుతుంది? ఆమెకు తెలిసే నిజాలు ఏమిటి? ప్రేతాత్మ బారి నుంచి ఆమె తన చెల్లెలిని కాపాడుకోగలుగుతుందా? అనేది కథ.

తమ పూర్వీకులకి సంబంధించిన ఆస్తులను అమ్ముకుని వెళ్లిపోవడం కోసం వాళ్ల వారసులు సొంత ఇంటికి వస్తారు. అడవికి సమీపంలోని ఒక పాడుబడిన బంగళా అది. వారిలో ఒకరు అక్కడి అవుట్ హౌస్ లో దాచిన ఒక చెక్కపెట్టెను ఓపెన్ చేస్తారు. అప్పటి నుంచి వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అందుకు గల కారణాలు ఏమిటి?  తమ పూర్వీకులకు .. ఆ చెక్కపెట్టెకు ఉన్న సంబంధం ఏమిటి? అనేదే ఈ కథలోని ప్రధానమైన అంశం. 

సాధారణంగా ప్రేతాత్మలకు సంబంధించిన కథలన్నీ పాడుబడిన బంగ్లా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ప్రేతాత్మలను ఒక సీసాలోనో .. పెట్టెలోనో బంధించడం, తెలియక వాటికి విముక్తి కల్పించడం .. దాంతో అవి విజృంభించడం చాలా కథలలో చూస్తూనే వచ్చాము. విడుదలైన ప్రేతాత్మలు పీడించడం .. ఆ ప్రేతాత్మల బారి నుంచి తప్పించుకోవడానికి బాధితులు ప్రయత్నించడం ఈ తరహా కథలలో ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. అదే పద్ధతిలో ఈ కథ కూడా నడుస్తుంది. 

ఈ కథ మొదలుపెట్టిన అరగంట వరకూ చాలా నిదానంగా సాగుతుంది. ఆ తరువాతనే పుంజుకోవడం మొదలవుతుంది. అసలు ఆ పెట్టెలో ఏవుంది? అందులో ఉన్న వస్తువులు ఎవరివి? ప్రేతాత్మగా మారింది ఎవరు? దానితో ఆనందిత తాతయ్యకి ఉన్న సంబంధం ఏమిటి? అనే సందేహాలు ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తిస్తూ వెళతాయి. ఇంటర్వెల్ నుంచి ఈ కథ మరింత వేగాన్ని అందుకుంటుంది. 

ప్రేతాత్మకు సంబంధించిన పెట్టెను వదిలించుకోవడానికి ఆనందిత ప్రయత్నించడం .. ఆ పెట్టెను ఎప్పటికప్పుడు మనూ కాపాడుకుంటూ ఉండటం కథను మరింత ఉత్కంఠభరితంగా మార్చుతూ వెళుతుంటుంది. ఇక ఇదే సమయంలో ఆనందిత వైపు నుంచి చర్చి ఫాదర్ ఎంట్రీ ఇవ్వడంతో కథ పతాకస్థాయి దిశగా పరుగులు పెడుతుంది. ప్రీ క్లైమాక్స్ ..  క్లైమాక్స్ కి సంబంధించిన దృశ్యాలు కాస్త గట్టిగానే భయపెడతాయి. 

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కాస్త కొత్తగా అనిపిస్తుంది. అయితే ప్రేతాత్మలకు సంబంధించిన చాలా రొటీన్ సన్నివేశాలనే ఇందులోను చూస్తాము. ప్రేతాత్మ ఆవహించినప్పుడు వాళ్లు ప్రవర్తించే తీరును,  అలాగే ఆడియన్స్ ను భయపెట్టడానికి అనుసరించే మార్గాలను చాలా సినిమాలలో చూపించారు. అవే సన్నివేశాలను మరోమారు చూస్తున్నట్టుగా ఉంటుంది. కొత్తగా డిజైన్ చేయకపోవడమే లోపంగా అనిపిస్తుంది. కెమెరా పనితనం .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు.

హారర్ థ్రిల్లర్ జోనర్ కి తగినట్టుగా ఈ కథ అక్కడక్కడా భయపడుతుంది. ప్రేతాత్మ ఆవహించడం .. వదిలించే ప్రక్రియ .. ఈ మధ్యలో జరిగే తతంగం కాస్త అలజడి సృష్టిస్తాయి. అయితే గతంలో కొన్ని హారర్ సినిమాలలో చూసిన సన్నివేశాలనే మళ్లీ చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందువలన ఆడియన్స్ పూర్తిస్థాయి థ్రిల్ ను పొందలేరేమోనని అనిపిస్తుంది. 


Movie Name: Dahaan

Genre: Horror, Thriller

Release Date: 2026-10-16

Cast: Barsha Nayak, Aurosikha Mishra, Samrat Mahapatra, Pranab Prasanna Rath, Nishant Majithia

Director: Anupam Patnaik

Music: -

Banner: Amiya Patnaik Production

Review By: Peddinti

Dahaan Rating: 2.00 out of 5

Advertisement
DahaanAnupam PatnaikAmiya PatnaikBarsha NayakAurosikha MishraSamrat MahapatraPranab Prasanna RathNishant Majithia

More Movie Reviews

'అంజాన్ సాయే' ( నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

27 Oct, 17:38

'ఖలీఫా' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

26 Oct, 18:02

'ధూమకేతు' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24 Oct, 17:41

'డోరతీ ' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

24 Oct, 12:00

'418' - మూవీ రివ్యూ!

23 Oct, 15:13

'నా వైఫ్ మిస్సింగ్' (ఆహా) మూవీ రివ్యూ!

22 Oct, 22:15

'రిపోర్టింగ్ లైవ్' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!

22 Oct, 11:37

'లెనిన్ పాండియన్' ( అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

21 Oct, 15:16

'ఆశ' (జీ 5) మూవీ రివ్యూ!

19 Oct, 17:14
..More Movie Reviews