తమిళంలో ఒక రొమాంటిక్ ఫాంటసీ కామెడీ సినిమా రూపొందింది .. ఆ సినిమా పేరే 'డబుల్ ఆక్యుపెన్సీ'. సంతోష్ - రేష్మ వెంకటేశ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, జూన్ 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. అశ్విన్ కందస్వామి దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 10వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగు.. మలయాళ .. కన్నడ భాషల్లోను అందుబాటులో ఉంది.
'వల్లీ' (వినోదినీ వైద్యనాథన్) దంపతులకు ఒక బాబు జన్మిస్తాడు. ఆ తరువాత కొంతసేపటికి ఆ శిశువు పాపగా మారిపోవడం చూసి షాక్ అవుతారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పాపగా ఉండటం .. సాయంత్రం 6 గంటల నుంచి మళ్లీ మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ బాబుగా మారిపోవడాన్ని వాళ్లు గమనిస్తారు. అదే ఊళ్లో ఉంటే నలుగురూ నానా రకాలుగా చెప్పుకుంటారని భావించి, అక్కడి నుంచి 'కొడైకెనాల్'కి మారిపోతారు.
ఆ దంపతులు ఆ బిడ్డకు 'రజినీ' అని నామకరణం చేస్తారు. ఆ బిడ్డ యవ్వనంలోకి అడుగుపెట్టిన తరువాత వల్లీ దంపతులు ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోతారు. అప్పటి నుంచి రజనీ ఒంటరి అవుతాడు. తన పరిస్థితి బయట ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. అమ్మాయిగా ఒక ఆఫీసులో .. అబ్బాయిగా ఒక 'పబ్' లో పనిచేస్తూ ఉంటాడు. అమ్మాయిగా ఉన్న రజినీని కార్తీక్ (వినోద్ కిషన్) లవ్ చేస్తూ ఉంటాడు. అలాగే అబ్బాయిగా ఉన్న రజినీని 'ప్రియ' (సంయుక్త విశ్వనాథన్) ప్రేమిస్తూ ఉంటుంది.
ఉదయానికీ .. అస్తమయానికి మధ్య రజినీ పడుతున్న టెన్షన్ ను గమనించిన కార్తీక్ - ప్రియ ఇద్దరికీ కూడా అనుమానం కలుగుతుంది. దాంతో వాళ్లద్దరికీ అసలు విషయం చెప్పాలనే రజినీ నిర్ణయించుకుంటుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు చేసుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అమ్మాయిగా రజినీ పనిచేస్తున్న ఆఫీసుకు సంబంధించిన మేనేజర్ రామలింగం (విచు విశ్వనాథ్)కి ఆమె ప్రవర్తనపై సందేహం కలుగుతుంది. దాంతో ఆమెను రహస్యంగా ఫాలో అవుతూ జరుగుతున్నదేమిటనేది కనుక్కుంటాడు.
రామలింగం విదేశాలలో ఉన్న 'రాజీవ్' (భగవతి పెరుమాళ్)కి కాల్ చేస్తాడు. తాను చూసిన సంఘటనను గురించి వివరంగా చెబుతాడు. దాంతో రాజీవ్ ఉన్నపళంగా బయల్దేరి అక్కడికి చేరుకుంటాడు. రాజీవ్ ఎవరు? రజినీ విషయం పట్ల అతని ఆసక్తికి గల కారణం ఏమిటి? అతనికీ .. రజినీకి గల సంబంధం ఏమిటి? రజినీ వెనకున్న రహస్యాన్ని గురించి కార్తీక్ - ప్రియలకి తెలుస్తుందా? ఈ సమస్య నుంచి రజినీ బయటపడుతుందా? అనేది మిగతా కథ.
ఒక అబ్బాయి .. అమ్మాయిగా మారిపోవడానికి దారితీసిన పరిస్థితులు, అమ్మాయిగా లోకాన్ని నమ్మించడానికి పడిన పాట్లతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. ఈ తరహా కంటెంట్ ప్రధానమైన ఉద్దేశం ఆడియన్స్ ను నవ్వించడం. అయితే అందుకు భిన్నంగా దర్శకుడు ఈ కథను తయారు చేసుకున్నాడు. కామెడీ పాళ్లు ఎక్కువగా ఉన్న ఈ కథకు, ఫాంటసీ టచ్ ఇచ్చాడు. అక్కడే ఈ కథకు కొత్తదనాన్ని తీసుకొచ్చాడు.
ఒక సమయం కాగానే అమ్మాయి, అబ్బాయిగా మారిపోవడం .. అబ్బాయి కాస్తా అమ్మాయిగా మారిపోవడమే ఈ కథలోని ప్రధానమైన అంశం. అయితే తమ ప్రమేయం లేకుండా జరుగుతున్న ఈ మార్పు కారణంగా వాళ్లు ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేయవలసి వచ్చింది? అనేదే ఆసక్తిని రేకెత్తించే అంశం. ఈ మార్పు జరిగిన తరువాత, అబ్బాయి వ్యవహారాలు అమ్మాయికీ .. ఆమె వ్యాపకాలు అబ్బాయికి ఎంత మాత్రం గుర్తుండకపోవడం మరో ఇంట్రెస్టింగ్ విషయంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ ఇద్దరి ప్రేమకథల వైపు నుంచి వినోదాన్ని వడ్డించిన తీరు మరో ఎత్తు.
అశ్విన్ కందస్వామి తయారు చేసుకున్న కథ కొత్తగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే వేసిన తీరు కథను బోర్ కొట్టనీయకుండా నడిపిస్తుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా చాలా సహజంగా నటించారు. శాంతకుమార్ ఫొటోగ్రఫీ .. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం బాగున్నాయి. ప్రవీణ్ ఆంటోని ఎడిటింగ్ పనితీరు కూడా నీట్ గా అనిపిస్తుంది.
వాస్తవ జీవితంలో అసాధ్యమైనవి .. ఫాంటసీ ప్రపంచంలో జరుగుతాయి .. ఆ ఊహను అందరూ ఎంజాయ్ చేస్తారు కూడా. సమయాన్ని బట్టి ఒకరు ఉదయం వేళలో అమ్మాయిగా మారడం .. సాయంత్రం వేళలో అబ్బాయిగా మారడం ఊహించుకోవడానికి చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. అదే జరిగితే ఎలా ఉంటుంది? అనే ఒక ఆలోచనకు దృశ్య రూపంగా ఈ సినిమా తెరకెక్కింది. బోర్ అనిపించకుండా సరదాగా సాగే ఈ సినిమాను ఒకసారి ట్రై చెయ్యొచ్చు.
'డబుల్ ఆక్యుపెన్సీ' ( అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Movie Details
Movie Name: Double Occupancy
Release Date: 2026-07-10
Cast: Santhosh, Reshma Venkatesh,Samyuktha Viswanathan, Vinoth Kishan,VTV Ganesh
Director: Aswin Kandasamy
Music: Sam C S
Banner: Avni Movies
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer