కశ్మీర్ పై పట్టు సాధించడానికి పాకిస్థాన్ చేసే ప్రయత్నాలు .. వాళ్ల వ్యూహాలను తెలుసుకుని వాటిని అడ్డుకోవడానికి ఇండియా నుంచి 'రా'కి సంబంధించిన స్పై ఏజెంట్లు అక్కడికి వెళ్లడం .. ప్రాణాలకు తెగించి వెళ్లిన పనిని పూర్తి చేయడం వంటి కథలతో ఇంతవరకూ చాలా సిరీస్ లు .. సినిమాలు వచ్చాయి. అలాంటి ఒక నేపథ్యంలో గతంలో సిరీస్ గా వచ్చినదే
'ముఖ్బీర్ : ది స్టోరీ ఆఫ్ ఎ స్పై'. 2022లో రూపొందిన ఈ సిరీస్ ను ఇప్పుడు సినిమాగా 'జీ 5' ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి తీసుకుని వచ్చారు. ఈ నెల 10వ తేదీ నుంచి తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
అది 1965 ప్రాంతం .. ఇండియా - పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉంటాయి. కశ్మీర్ లోని ప్రతి ఇంటిపై పాకిస్థాన్ జెండా ఎగరాలనే పట్టుదలతో పాక్ ఉంటుంది. అందుకోసం వాళ్లు చేసే కుట్రలను పసిగట్టి, అక్కడే వాటిని సమాధి చేయవలసిన అవసరాన్ని 'రా' గుర్తిస్తుంది. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండాలంటే, 'రా'కి సంబంధం లేని వ్యక్తిని పాక్ కి పంపించడమే సరైనదని 'రా' అధికారి మూర్తి (ప్రకాశ్ రాజ్) భావిస్తాడు. అందుకోసం అతను 'కమ్రాన్' ను ఎంపిక చేస్తాడు.
'కమ్రాన్' (జైన్ ఖాన్ దురాని) చాలా తెలివైనవాడు . ఎదుటివ్యక్తిని చాలా ఈజీగా బురిడీ కొట్టించడంలో అతను నేర్పరి. తనకి అవసరమైన రహస్య సమాచారాన్ని అందించడం కోసం మూర్తి అతణ్ణి నియమించుకుంటాడు. అందుకు తగిన పారితోషికం ఇస్తుంటాడు. ఇప్పుడు 'రా'కి సంబంధించిన పనిపై అతణ్ణి పాకిస్థాన్ కి పంపించడానికి సిద్ధమవుతాడు. గతంలో ఒక రెస్టారెంట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ఒక ఫ్యామిలీ చనిపోతుంది. ఆ ఫ్యామిలీకి సంబంధించిన 'అర్ఫాన్' బాడీ మాత్రం దొరకదు.
అర్ఫాన్ పెదనాన్న 'షమీమ్' పాకిస్థాన్ లో ఉంటూ ఉంటాడు. అందువలన కమ్రాన్ ను ఆర్ఫాన్ పేరుతో షమీమ్ దగ్గరికి పంపించడానికి మూర్తి ప్లాన్ చేస్తాడు. ఆ ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలను వివరించి అక్కడికి పంపిస్తాడు. ప్రమాదకరమైన అధికారులు కీలకమైన పదవులను నిర్వహిస్తూ ఉండగా, ఆ గడ్డపైకి కమ్రాన్ అడుగుపెడతాడు. అక్కడ అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? వాటిని అతను ఎలా అధిగమిస్తాడు? అనేదే కథ.
కశ్మీర్ పై పట్టు సాధించడానికి పాకిస్థాన్ పన్నాగాలు పన్నుతూ ఉంటుంది. ఆ కుట్రలను కూల్చేయడానికిగాను, డిపార్టుమెంటుకు సంబంధం లేని వ్యక్తిని పంపించడమే మంచిదని 'రా' భావిస్తుంది.'కమ్రాన్' అనే ఆ యువకుడు మారు పేరుతో పాకిస్థాన్ నేలపై అడుగుపెడతాడు. అక్కడ అతను ఎదుర్కునే పరిణామాలు ఎలాంటివి? అనే ఆసక్తికరమైన అంశం చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. అటు పాకిస్థాన్ అధికారుల పన్నాగాలు, ఇటు 'రా' అధికారుల వ్యూహాలు .. ఈ మధ్యలో హీరో సాగించే అన్వేషణను కలుపుకుంటూ ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లారు.
హీరో ఢిల్లీ నుంచి బయల్దేరి పాకిస్థాన్ కి చేరుకోవడం దగ్గర నుంచి అసలు కథ మొదలైనట్టుగా ప్రేక్షకులు భావిస్తారు. ఇక ఇక్కడి నుంచి కథ ఒక రేంజ్ లో స్పీడ్ అందుకుంటుందని అనుకుంటారు. కానీ అంత తొందరేం ఉంది అన్నట్టుగా కథ నిదానంగానే నడుస్తూ ఉంటుంది. ఇక్కడి అధికారులు .. అక్కడి అధికారులు ఎవరికీ వారు చాలా కూల్ గా మంతనాలు చేస్తుంటారు. స్పై గా వెళ్లిన హీరో కూడా అంతే కూల్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంటాడు. ఇక్కడ ఎవరికి ఎలాంటి కంగారు లేదన్నమాట.
పాకిస్థాన్ .. రక్షణ వ్యవస్థకి సంబంధించిన కీలకమైన అధికారులు .. అలాంటి వాళ్లను కూడా హీరో చాలా తేలికగా కలుసుకుంటాడు. వాళ్లు కూడా తాము అనుకున్న పనిని ఇతను మాత్రమే చేయగలడని నమ్ముతారు. పోనీ అంత చురుకైనవాడిగా హీరోగారు అప్పటివరకూ ఏమైనా ఘన కార్యాలు చేశాడా అంటే అదీ లేదు. ఒకానొక సందర్భంలో అతను ఘొల్లుమని ఏడుస్తాడు. అతనిపై ఏదో ఒక మూలన కాస్త నమ్మకం పెట్టుకున్న అభిమానులకు, ఆ క్షణం నుంచి అది కూడా లేకుండా పోతుంది.
ఈ తరహా కథలలో దేశభక్తితో పాటుగా లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ .. యాక్షన్ సీన్లు .. ఛేజింగులను ఒక రేంజ్ లో ప్రేక్షకులు ఊహించుకుంటారు. ఒళ్లు గగుర్పొడిచే ట్విస్టులను ఆశిస్తారు. ఇది కదా మనం కోరుకునేది అనేంతగా ఉద్వేగానికి లోనయ్యే దృశ్యాల కోసం వెయిట్ చేస్తారు. అయితే అలాంటి అంశాలకు చాలా దూరంగానే ఈ కథను నడిపించారు అది కూడా చాలా నిదానంగా .. నింపాదిగా.
నిర్మాణ విలువలు .. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తుంది. హీరో పాత్రతో పాటు ప్రకాశ్ రాజ్ .. ఇతర సీనియర్ నటుల పాత్రలను కూడా సమర్థవంతంగా మలచలేకపోయారని అనిపిస్తుంది. వెబ్ సిరీస్ ను సినిమాగా ఆవిష్కరించేటప్పుడు కంటెంట్ ను మరింత టైట్ చేసుకుని రావలసి ఉంటుంది. అలాంటి జాగ్రత్తలు తీసుకుని ఉంటే కాస్త బెటర్ గా ఉండేదేమో. లొకేషన్స్ కీ .. 1965 కాలం నాటి వాతావరణాన్ని క్రియేట్ చేయడంలోని కృషికి ఎక్కువ మార్కులు పడతాయని చెప్పచ్చు.
'ముఖ్బీర్ : ది స్టోరీ ఆఫ్ ఎ స్పై' (జీ 5) మూవీ రివ్యూ!
Mukhbir - The Story of a Spy Review
Movie Details
Movie Name: Mukhbir - The Story of a Spy
Release Date: 2026-07-10
Cast: zain khan, Zoya Afroz, Barkha Bisht, Praksh Raj,Dileep Shankar, Harsh Chhaya, Adil Hussain
Director: Shivam Nair - Jayprad Desai
Music: Abhishek Nailwal
Banner: Victor Tango Entertainment
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer