అఖిల్ హీరోగా చేసిన సినిమానే 'లెనిన్'. సితార నాగవంశీ - నాగార్జున సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. మురళీ కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి, తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. భారీ విజయానికి చేరువకోవడానికి ప్రయత్నిస్తున్న అఖిల్ ను, 'ఏజెంట్' సినిమా కాస్త గట్టిగానే ఇబ్బంది  పెట్టింది. దాంతో కాస్త గ్యాప్ తీసుకుని, కథపై ఎక్కువగానే కసరత్తులు చేస్తూ అఖిల్ లైన్లో పెట్టిన సినిమా ఇది. అలాంటి ఈ సినిమా ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. 

శ్రీ రామాపురంలో 'భారతం మిట్ట' అనే ప్రదేశం ఉంటుంది. మహాభారత కాలంతో ముడిపడిన ఆ ప్రదేశంలో 'ద్రౌపది దేవి' పూజలందుకుంటూ ఉంటుంది. ప్రతి ఏటా ద్రౌపదీదేవికి అక్కడ జాతర నిర్వహిస్తూ ఉంటారు. భర్తను కోల్పోయినప్పటికీ ఆ ఊరిపై జయంతి (ఈశ్వరీరావు) పెత్తనం చేస్తుంటుంది. అనాథగా ఆ ఊళ్లో అడుగుపెట్టిన 'లెనిన్' (అఖిల్)ను ఆమెనే చేరదీస్తుంది. తన కొడుకు వసంత్ (ప్రమోద్)తో పాటు పెంచుతుంది. డాక్టర్ గా పై చదువులు కోసం వసంత్ మద్రాస్ వెళ్లిపోగా, జయంతికి సంబంధించిన పనులను చూసుకుంటూ లెనిన్ అక్కడే  ఉండిపోతాడు.

ఆ ఊరిపెద్ద మనుషులలో ఒకరుగా నీలకంఠం (రాంకీ) చెలామణి అవుతుంటాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు ఒకరు 'వైదేహి' అయితే .. మరొకరు 'భారతి' ( భాగ్యశ్రీ బోర్సే). పట్నంలో బంధువుల దగ్గరే ఉంటూ చదువుకున్న భారతీ, తన సొంత ఊరుకు చేరుకుంటుంది. ఆమెను చూడగానే లెనిన్ మనసు పారేసుకుంటాడు. ఇక డాక్టర్ చదువును పూర్తి చేసుకుని ఆ ఊరికి తిరిగొచ్చిన 'వసంత్'ను వైదేహి ప్రేమిస్తుంటుంది. దాంతో వాళ్లిద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించుకుంటారు.

ఆ గ్రామంపై పట్టు కోసం ఎమ్మెల్యే రాఘవరెడ్డి ప్రయత్నిస్తుంటాడు. తనని ఎంతమాత్రం లెక్కచేయని లెనిన్ - వసంత్ ల సంగతి చూడాలనే కోపంతో ఆయన ఉంటాడు. ఇక 'భారతం మిట్ట'పై పెత్తనం కోసం 'యతిరాజు' (శివాజీ) ఎదురుచూస్తుంటాడు. ఈ విషయంలో తనకి అడ్డుపడుతున్న జయంతిపై ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంటాడు. ఇక లెనిన్ పై మనసు పడిన భారతిని వశపరచుకోవాలనే ఉద్దేశంతో 'తులసి' (శత్రు) ఉంటాడు. 

ఈ నేపథ్యంలోనే వసంత్ ను పెళ్లి చేసుకోవలసిన వైదేహి కనిపించకుండా పోతుంది. దాంతో అదే ముహూర్తానికి తన చిన్న కూతురైన భారతిని వసంత్ కి ఇచ్చి పెళ్లి చేయాలని నీలకంఠం నిర్ణయించుకుంటాడు. అప్పుడు భారతి ఏం చేస్తుంది? లెనిన్ తో ఆమె వివాహం జరుగుతుందా? ఆమె అక్కయ్య వైదేహి ఏమైపోతుంది? రాఘవరెడ్డి .. యతిరాజు .. తులసితో పాటు లెనిన్ ఎదుర్కోవలసిన మెయిన్ విలన్ ఎవరు? అనేది మిగతా కథ.

శ్రీ రామాపురం అనే ఊరు 'లెనిన్' అనే యువకుడిని పెంచి పెద్ద చేస్తుంది. అందువలన తనను చేరదీసి కుటుంబానికి .. తనకి నీడనిచ్చిన ఊరుకి అతను ఎంతో నమ్మకంగా ఉంటూ ఉంటాడు. అలాంటి అతను భారతి ప్రేమలో పడతాడు. అయితే ఆ ప్రేమను పెళ్లి పీటలవరకూ తీసుకుని వెళ్లడానికి అతను కొంతమంది శత్రువులను ఎదుర్కోవలసి వస్తుంది. వాళ్లు ఎవరూ? వాళ్లతో అతనికి గల శత్రుత్వం ఏమిటి? అనేది ప్రధానమైన కథ.

1970 - 2000  కి మధ్య జరిగే ఈ కథలో అనేక కోణాలు కనిపిస్తాయి. ఆహ్లాదకరమైన గ్రామంలో అందమైన ప్రేమజంట. ఆ గ్రామంఫై పట్టు కోసం ఎదురుచూసే ఒక రాజకీయనాయకుడు, అక్కడ జాతర తన చేతుల మీదుగా జరగాలనే అధికార దాహంతో ఒకరు .. ఆ ప్రేమజంటను విడదీయాలనే ఆలోచనలో మరొకరు. నమ్మిస్తూ నమ్మక ద్రోహానికి సిద్ధమవుతున్నదొకరు. ఇలా వివిధ కోణాల నుంచి అల్లుకున్న ఈ కథను ఆసక్తికరంగా ఆవిష్కరించడానికి దర్శకుడు తనవంతు ప్రయత్నం చేశాడు.  

ఇక దర్శకుడు 'ద్రౌపది' జాతరను ప్రధానంగా చేసుకుని, మహాభారతంలోని పాత్రలతో ముడిపెడుతూ ఈ కథను నడిపించాడు. ఫస్టు పార్టులో ఫస్టు ట్విస్ట్ ను ఇంటర్వెల్ కి ముందు పేల్చిన దర్శకుడు, అక్కడి నుంచి కథను మరింత వేడెక్కిస్తాడు. ఇక సెకండాఫ్ కూడా మరో ఒకటి రెండు ట్విస్టులతో వేగాన్ని పుంజుకుంటుంది. ద్వేషం .. ప్రతీకారం .. నమ్మకద్రోహంతో కూడిన సన్నివేశాలతో నడుస్తుంది.

ఈ కథను మొత్తంగా పరిశీలన చేస్తే, అధికారం .. పెత్తనం .. కామం.. వ్యామోహం అనే బలహీనతలతో తనపై విరుచుకుపడుతున్న అరాచక శక్తులను కథానాయకుడు ఎలా ఎదుర్కున్నాడు? అనేదే ప్రధానమైన ఇతివృత్తంగా కనిపిస్తుంది. ఫస్టాఫ్ చాలా వరకూ హీరో - హీరోయిన్స్ మధ్య లవ్ - రొమాన్స్ .. అందుకు సంబంధించిన పాటలతో రక్తి కడుతుంది. 

ఇక సెకండాఫ్ లో ఆయా పాత్రల నిజస్వరూపాలను ఆవిష్కరించడం కనిపిస్తుంది. వారి అసలు రంగును తెలుసుకుంటూ హీరో ప్రీ క్లైమాక్స్ వైపు దిశగా కదులుతాడు. ఇక అప్పటి వరకూ సాగిన రక్తపాతం ఒక ఎత్తయితే, క్లైమాక్స్ లో చెలరేగే హింస మరో ఎత్తు. ఎంతో కొత్తగా ప్లాన్ చేశామని అనుకున్నప్పటికీ, క్లైమాక్స్  అనేది అన్ని వర్గాల ప్రేక్షకులకు సంతృప్తిని కలిగిస్తుందని చెప్పలేము. 

అఖిల్ నటన .. యాక్షన్ ..డాన్సులు బాగానే ఉన్నాయి. భాగ్యశ్రీ పాత్ర అంతగా బలమైనదేం కాదు గానీ, అందంగా.. ఆకర్షణీయంగా కనిపిస్తూ మార్కులు కొట్టేస్తుంది. పెళ్లి కూతురి గెటప్ లోను .. కొన్ని పాటల్లోను ఆమె గ్లామర్ కుర్రాళ్లను కట్టిపడేస్తుందనే చెప్పాలి. ఇక నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో ప్రమోద్ బాగా చేశాడు. కొన్ని చోట్ల నానీలా అనిపిస్తాడు. ఈశ్వరీరావు .. శివాజీ నటన కూడా ఆకట్టుకుంటుంది. 

లియోన్ బ్రిట్టో ఫొటోగ్రఫీ బాగుంది. ఫస్టు పార్టులో వచ్చే రెండు డ్యూయెట్స్ లోని లొకేషన్స్ ను కవర్ చేసిన విధానం గొప్పగా అనిపిస్తాయి. తమన్ బాణీలు .. నేపథ్య సంగీతం మెప్పిస్తాయి. నవీన్ నూలి ఎడిటింగ్ కూడా మెప్పిస్తుంది. 

భారతం .. కురుక్షేత్రంతో పోలికపెడుతూ ఈ కథకు మరింత బలాన్ని చేకూర్చడానికి చేసిన ప్రయత్నం బాగుంది. కానీ  విలన్స్ ఎక్కువమంది కావడం .. ఆ పాత్రలకు అవసరమైన పవర్ లోపించడం .. క్లైమాక్స్ ను డిజైన్ చేసే విషయంలో తీసుకున్న నిర్ణయం అసంతృప్తిని కలిగిస్తాయి. ఒక ఆసక్తికరమైన ఆరంభాన్ని నిదానంగా ట్రాక్ తప్పించారేమో అనే భావన కలుగుతుంది.  కథాకథనాలు పాత పద్ధతిలోనే సాగినా, అఖిల్ యాక్షన్ కోసం .. భాగ్యశ్రీ గ్లామర్ కోసం .. ఇద్దరూ కలిసి వర్కౌట్ చేసిన కెమిస్ట్రీ కోసం ఈ సినిమాను చూడొచ్చునేమో.