ప్రేమకథలను యూత్ ఎప్పుడూ ఆహ్వానిస్తూనే ఉంటుంది .. ఆదరిస్తూనే ఉంటుంది. అందువల్లనే లవ్ స్టోరీస్ ఎక్కువగా థియేటర్స్ కి వస్తుంటాయి. యూత్ ఆశించే ఫీల్ వర్కౌట్ అయితే ఆ సినిమా హిట్ దిశగా పరుగులు తీస్తుందనే నిజాన్ని గతంలో వచ్చిన సినిమాలు నిరూపించాయి. అలాంటి  ఒక లవ్ స్టోరీగా వచ్చిన సినిమానే 'కొత్త కొత్తగా'. 2022లో విడుదలైన ఈ సినిమా, జూన్ 25వ తేదీ నుంచి 'ఈటీవీ విన్' లో స్ట్రీమింగ్ అవుతోంది. అజయ్ - వీర్తి జంటగా నటించిన ఈ సినిమాకి, హనుమాన్ వాసంశెట్టి దర్శకత్వం వహించాడు.

రాజీ (వీర్తి) శ్రీమంతుల కుటుంబానికి చెందిన అమ్మాయి. తల్లి .. తండ్రి .. అన్నావదినలు .. ఇదే ఆమె కుటుంబం. అన్నయ్య 'కేశవ' జీవితంలోకి భార్యగా సత్య అడుగుపెడుతుంది.  కేశవ అంటే సత్యతో పాటు రాజీకి కూడా భయమే. రాజీ తన స్నేహితురాలు సౌమ్యతో పాటు ఇంజనీరింగ్ కాలేజ్ లో చేరుతుంది. అదే కాలేజ్ లో ఆమెకి సీనియర్ గా సిద్ధూ (అజయ్ అమన్) ఉంటాడు. అతను రాజీని చూసిన మరుక్షణమే మనసు పారేసుకుంటాడు. అయితే తన మనసులోని ప్రేమను ఆమెకి చెప్పలేకపోతుంటాడు.  

గతంలో జరిగిన ఒక సంఘటన కారణంగానే రాజీ జెంట్స్ కి దూరంగా ఉంటుందనే విషయాన్ని సిద్ధూ తెలుసుకుంటాడు. రాజీకి ఎమోషన్స్ లేవనీ .. ఆమె ఒక మరమనిషి అనీ .. ఆమెను ప్రేమించడం మానుకోమని సిద్ధూకి ఫ్రెండ్స్ చెబుతుంటారు. కానీ అతను మాత్రం తన ప్రాణాలన్నీ ఆమెపైనే పెట్టుకుంటాడు. ఈ నేపథ్యంలోనే సత్య ఇంటికి వచ్చిన ఆమె తమ్ముడు రామ్, అక్కడ రాజీని చూస్తాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. సత్య తన అత్తమామల ద్వారా రాజీని కూడా ఒప్పిస్తుంది. 

తనని రాజీ అర్థం చేసుకుంటుందని భావించిన సిద్ధూ, ఆమెకి ఎంగేజ్ మెంట్ జరిగిందని తెలుసుకుని సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతను చేసిన ఆ పని వలన అతని తండ్రి హాస్పిటల్ పాలవుతాడు. సిద్ధూ తనని ప్రేమించాడనే సంగతి ఈ సమయంలోనే రాజీకి తెలుస్తుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? రాజీ - సిద్ధూ ఒకటవుతారా లేదా? అనేది మిగతా కథ.

'ప్రేమించడమే కాదు .. ఆ ప్రేమను వ్యక్తం చేయడం ముఖ్యం. సరదాగా తిరగడమే కాదు, ఎదుటి వ్యక్తిలోని ప్రేమను అర్థం చేసుకోవడం ముఖ్యం' అనే పాయింట్ చుట్టూ తిరిగే కథ ఇది. ఇంజనీరింగ్ కాలేజ్ నేపథ్యంలో నడిచే ఈ ప్రేమకథ, ఆ తరువాత ఫ్యామిలీ ఎమోషన్స్ ను టచ్ చేస్తూ ముందుకు వెళుతుంది. అటు లవ్ .. ఇటు ఫ్యామిలీ ఎమోషన్స్ ను అన్ని వైపుల నుంచి పట్టుగా అల్లుకున్నారా అంటే, లేదనే చెప్పాలి. 

ప్రేమ అనేది మాటలతో  వ్యక్తం చేయవలసిన అవసరం లేదు. ఎదుటివ్యక్తి చూపిస్తున్న కేర్ లోనే ఆ విషయం అర్థమైపోతుంటుంది. కానీ ఈ సినిమాలో హీరో ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆమె పెద్దగా స్పందించదు. ఆ తరువాత ఒకానొక సందర్భంలో ఆమెకి ఆ సంగతి తెలుస్తుంది. అయితే అది ప్రేమ అనే విషయం తెలుసుకోలేక పోవడానికీగానీ .. ఆ తరువాత తెలుసుకోవడానికి గాని బలమైన కారణమంటూ ఏమీ కనిపించదు. 

ఇక హీరోయిన్ ప్రేమ విషయంలో  తండ్రి .. అన్నయ్య .. కాబోయే భర్త .. ఈ మూడు వైపులలో ఏ వైపు నుంచి విలన్ పుట్టుకొస్తాడోనని ఆడియన్స్ చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు. కానీ ఏ వైపు నుంచి ఎలాంటి స్పందనా ఉండదు. ముఖ్యమైన ఆ మూడు పాత్రలు అలా నిశ్శబ్దంగా ఉండిపోతాయంతే. హీరో ప్రేమను హీరోయిన్ అర్థం చేసుకోలేని సన్నివేశాలతో ఫస్టాఫ్ .. అర్థం చేసుకుని అతిగా స్పందించే సన్నివేశాలతో సెకండాఫ్ కొనసాగుతుంది.

 ఇంజనీరింగ్ కాలేజ్ వాతావరణం .. హీరో ఫ్రెండ్స్ .. ప్రేమ విషయంలో తమ ఫ్రెండ్ కి వాళ్లు ఇచ్చే సలహాలు .. సూచనలు సహజంగా నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. ఇక్కడే చాలా సినిమాలలో కామెడీని వర్కవుట్ చేస్తుంటారు. ఈ సినిమా విషయంలోను అదే చేశారు. కాకపోతే ఆ ప్రయత్నం ఫలించలేదు అంతే. ఆ ఫ్రెండ్స్ నటన కూడా చాలా కృతకంగా అనిపిస్తూ ఉంటుంది.

హీరో - హీరోయిన్ కి ఇదే మొదటి సినిమా. అందువలన ఆ కొత్తదనం తెలిసిపోతూనే ఉంటుంది.
మిగతా పాత్రలలో  కల్యాణి నటరాజన్ పాత్ర కొంతవరకూ ఫరవాలేదు. కానీ తులసి పాత్రను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారని అనిపిస్తుంది. ఇక ఆనంద్ పాత్ర పరిస్థితి మరీ దారుణం. వెంకట్ ఫోటోగ్రఫి .. సామ్ సీఎస్ సంగీతం ఫరవాలేదు. ఒకటి రెండు మెలోడీ సాంగ్స్ బాణీలు .. చిత్రీకరణ ఎక్కువ మార్కులు కొట్టేస్తాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ ఓకే.

'కొత్త కొత్తగా' కంటెంట్ లో లేనిదల్లా ఆ కొత్తదనమే. చాలా రొటీన్ కథాకథనాలతో నడుస్తూ వెళ్లిన ఈ సినిమా, ప్రేమకథలకు అవసరమైన ఫీల్ ను ఆవిష్కరించలేకపోయిందనే చెప్పాలి.