క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఒక తెలుగు సినిమా నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి వచ్చింది. ఆ సినిమా పేరే ' థాంక్యూ సుబ్బారావు'. చంద్రహాస్ కోట్ల - లావణ్య సాహుకార జంటగా నటించిన ఈ సినిమాకి చెందు ముద్దు దర్శకత్వం వహించాడు.'ఓ పిట్టకథ' సినిమాతో దర్శకుడిగా తన మార్క్ చూపించిన సంగతి తెలిసిందే. దినేశ్ కుర్ర నిర్మించిన ఈ సినిమా, ఈ రోజు (జూన్ 18వ తేదీ) నుంచి 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

సుబ్బారావు (చంద్రహాస్) తన తండ్రి చేసిన అప్పులు తీర్చడం కోసం, ఏదైనా పని వెతుక్కోవాలని అనుకుంటాడు. కేరళలో ఉన్న స్నేహితుడు 'పండు' రమ్మనడంతో అక్కడికి వెళతాడు. స్నేహితుడితో కలిసి 'బోట్ హౌస్'లో ఉంటూ, టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. అదే సమయంలో ఒక బిజినెస్ డీల్ పై అమెరికా నుంచి 'వైష్ణవి' (లావణ్య) వస్తుంది. నెల రోజుల పాటు తిరగడం కోసం ఆమె సుబ్బారావు టాక్సీని మాట్లాడుకుంటుంది. వైష్ణవితో కలిసి తిరుగుతూ ఉండటంతో సుబ్బారావుకి రోజులు చాలా అందంగా గడిచిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఆమె ఎంతో కలుపుగోలుగా మాట్లాడుతూ ఉండటంతో, తనని ఆమె లవ్ చేస్తుందేమోనని సుబ్బారావు భావిస్తాడు. తానే ప్రపోజ్ చేయడం మంచిదని భావిస్తాడు.

అయితే అదే సమయంలో అమెరికా నుంచి 'రోహిత్' దిగిపోతాడు. అతను .. వైష్ణవి పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం తెలిసి, సుబ్బారావు దిగాలుపడిపోతాడు.ఒక రోజున ట్రైన్ రన్నింగ్ లో ఉండగా, ఓ నలుగురు కుర్రాళ్లు ఒక అమ్మాయిని అందులో నుంచి తోసేయడానికి ప్రయత్నించే దృశ్యం వైష్ణవి సెల్ ఫోన్ కి చిక్కుతుంది. దాంతో ఆమె ఆ అమ్మాయి ఎవరు? ఆ కుర్రాళ్లు ఎవరు? ఆ అమ్మాయిని వాళ్లు ఏం చేసి ఉంటారు? అనేది తెలుసుకోవాలని వైష్ణవి నిర్ణయించుకుంటుంది. అందుకోసం ఆమె ఏం చేస్తుంది? పర్యవసానంగా ఎలాంటి పరిణామాలను ఎందుర్కుంటుంది? అనేది మిగతా కథ. 

అమెరికా నుంచి బిజినెస్ పనిపై వచ్చిన వైష్ణవి, రన్నింగ్ ట్రైన్ లో నలుగురు దుర్మార్గుల కారణంగా ఒక యువతి ప్రమాదంలో ఉండటం గమనిస్తుంది. ఆ యువతి ఆచూకీ తెలుసుకుని ఆమెకి న్యాయం జరిగేలా చేయాలనుకుంటుంది. అందుకోసం తన బిజినెస్ పనులను సైతం పక్కన పెడుతుంది. ఈ విషయంలో ఆమెకి ఒక టాక్సీ డ్రైవర్ ఎలా సహాయం చేస్తాడు? ఆమె ప్రయత్నం ఫలిస్తుందా లేదా? అనేదే ఈ కథలోని ప్రధానమైన అంశం. 

ఈ కథ 'కేరళ'లో జరుగుతుంటుంది. ఎంగేజ్ మెంట్ జరుపుకున్న వైష్ణవి - రోహిత్, కేరళలో హోటల్ బిజినస్ చేయడానికి తగిన అనుమతుల కోసం ట్రై చేస్తుండటం .. వాళ్లకి టాక్సీ డ్రైవర్ గా కుదిరిన సుబ్బారావు, వైష్ణవిని ఆరాధిస్తూ ఉండటం .. ప్రమాదంలో పడిన ఒక యువతిని రక్షించడం రంగంలోకి దిగిన వైష్ణవి, రోహిత్ ను - సుబ్బారావును సాయం కోరడం అనే ఈ మూడు కోణాలలో ఈ కథ ముందుకు వెళుతుంటుంది. సుబ్బారావు కేరళ చేరుకోవడం .. అమెరికా నుంచి వైష్ణవి రావడం .. ఇద్దరి మధ్య పరిచయం  తాలూకు సన్నివేశాలతో ఈ కథ అలరిస్తూ వెళుతుంది. 

ఎప్పుడైతే వైష్ణవికి కాబోయే భర్తగా రోహిత్ ఎంట్రీ ఇచ్చాడో అప్పటి నుంచి కథ మరింత ఊపందుకుంటుంది.  వైష్ణవి ముందు సుబ్బారావును అవమానించడానికి రోహిత్ ట్రై చేయడం, అతణ్ణి ఉడికించడానికి సుబ్బారావు ప్రయత్నించడం వంటి సన్నివేశాలతో లవ్ కి కాస్త కామెడీ కనెక్ట్ అవుతుంది. ఇక ఎప్పుడైతే ట్రైన్ లో ఒక ఆడపిల్లను వేధిస్తున్న రౌడీ గ్యాంగ్ ను వైష్ణవి చూసిందో .. ఆ విషయాన్ని గురించి ఆరాతీయడానికి రంగంలోకి దిగుతుందో అప్పటి నుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. ట్రైన్ లో వేధింపులకు గురైన ఆ యువతి ఎవరు? ఆమెను వేధించిన పోకిరీలు ఎవరు? అనే కోణంలో చకచకా సన్నివేశాలను మార్చుకుంటూ ఈ కథ పరుగులు తీస్తుంది.

 లవ్ .. కామెడీ .. క్రైమ్ ను టచ్ చేస్తూ సాగే ఈ కంటెంట్ ఫరవాలేదనిపిస్తుంది.మూడు ప్రధానమైన పాత్రల చుట్టూ దర్శకుడు ఈ కథను నడిపించాడు. కథలో పెద్దగా కొత్తదనం లేకపోయినా, ట్రీట్మెంట్ బాగుంటుంది. అయితే లవ్ ట్రాక్ విషయంలో ఆడియన్స్ గెస్ చేసినట్టుగానే కథ వెళ్లడమే ప్రధానమైన లోపంగా అనిపిస్తుంది. కేరళలోని సన్నివేశాలు ఈ కథకు అదనపు ఆకర్షణగా నిలిస్తే, క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఈ కథకి మరింత బలాన్ని చేకూర్చుతుంది. 

ప్రధానమైన పాత్రలను పోషించిన ముగ్గురు ఆర్టిస్టులు తమ పాత్రలకి న్యాయం చేశారు. హీరో చంద్రహాస్ ను చూస్తుంటే, చాలావరకూ 'RX 100' హీరో కార్తికేయ పోలికలు కనిపిస్తాయి. బాడీ లాంగ్వేజ్ కూడా దాదాపుగా అలాగే అనిపిస్తుంది. పంకజ్ తొత్తాడ ఫొటోగ్రఫీ .. ప్రిన్స్ హేన్రి సంగీతం .. వెంకట్ ప్రభు ఎడిటింగ్ ఫరవాలేదు. చిన్న సినిమానే అయినా, ఒక పెర్ఫెక్ట్ అవుట్ పుట్ తో వచ్చిన కంటెంట్ గా చెప్పుకోవచ్చు.