కోలీవుడ్ లో యోగిబాబు ఎంత బిజీ స్టార్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఒక వైపున హాస్యభరితమైన కీలకమైన పాత్రలను చేస్తూనే, మరో వైపున కథానాయకుడిగా ఆయన తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను పోషిస్తూ వెళుతున్నాడు. అలా ఆయన ఇటీవల కాలంలో చేసిన సినిమానే 'కెనతా కానోమ్'. సురేశ్ సంగయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా, మార్చి 13వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ రోజు (జూన్ 16)వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్ లో, తమిళంతో పాటు ఇతర భాషల్లోను స్ట్రీమింగ్ అవుతోంది.
తమిళనాడులోని 'రామనాథపురం' జిల్లా పరిధిలోని ఒక మారుమూల గ్రామం అది. అక్కడ తన తాతయ్య 'త్యాగి'తో కలిసి మణివసాగర్ (యోగిబాబు) నివసిస్తూ ఉంటాడు. ఒక వైపున గుడిలో పూజారిగా చేస్తూనే, ఆ తరువాత సమయంలో విగ్రహాలను మలిచే శిల్పిగాను పనిచేస్తుంటాడు. ఆ పక్కనే గల ఊళ్లో అతని అక్కాబావలు ఉంటారు. మణి ఉంటున్న పల్లెలో వర్షాలు లేని కారణంగా నీటి సమస్య తీవ్రంగా ఉంటుంది. ఆడవాళ్లు చాలా దూరంనుంచి 'తాగునీరు' తీసుకురావడానికి అవస్థలు పడుతుంటారు.
మణికి వివాహం అనేది పెద్ద సమస్యగా మారుతుంది. 'లక్ష్మీ' అనే ఒక యువతి అతనిని ఇష్టపడుతుంది గానీ, ఆ విలేజ్ నీటి ఎద్దడి కారణంగా పిల్లను ఇవ్వడానికి ఆమె తండ్రి ఒప్పుకోడు.
తమ ఊళ్లో నీటి జాడలు ఎక్కడ ఉన్నాయనేది ఆ గ్రామస్తులు ఒక వ్యక్తికి చూపిస్తారు. మణి ఇంటిముందు నీళ్లు పడతాయని ఆ వ్యక్తి చెబుతాడు. దాంతో మణికి లక్ష్మినిచ్చి పెళ్లి చేయడానికి ఆమె తండ్రి ఒప్పుకుంటాడు. అలాగే మణి అక్కయ్యకి ఆ విలేజ్ లో మరోచోట స్థలాన్ని కేటాయించడానికి అంగీకరిస్తారు.
అందరూ కలిసి మణి వాకిట్లో బావి తవ్వడం మొదలుపెడతారు. అలా కొంతలోతు తవ్విన తరువాత డైనోసార్ అస్థిపంజరం బయటపడుతుంది. నీళ్లు పడకుండా డైనోసార్ అస్థిపంజరం బయటపడటం వాళ్లకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మీడియాలో ఈ విషయం వైరల్ అవుతుంది. దాంతో ప్రభుత్వ అధికారులు రంగప్రవేశం చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? వేలయేళ్ల క్రితం నాటి 'డైనోసార్' అవశేషాలు వెలుగు చూడటం వలన, ఆ విలేజ్ కి మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అనేది కథ.
కరువు కారణంగా .. నీటి ఎద్దడి కారణంగా ఇబ్బందులు పడుతున్న ఒక విలేజ్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. తమ సమస్యను పట్టించుకోమని ఆ గ్రామస్తులు కలెక్టర్ ను కలిసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది. ప్రభుత్వ అధికారులెవరూ అసలు సమస్య ఏమిటనేది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. అలాంటి పరిస్థితులలో డైనోసార్ అస్థిపంజరం బయటపడటంతో కథ మలుపు తిరుగుతుంది.
కలెక్టర్ తో పాటు వివిధ విభాగాలకు సంబంధించిన ప్రభుత్వ అధికారులంతా ఆ విలేజ్ కి క్యూ కడతారు. పోలీసులు ఆ ప్రదేశానికి రక్షణగా కాపలా కాస్తుంటారు. పురావస్తు శాఖవారు తాత్కాలికంగా గుడారాలు కూడా వేసేస్తారు. ప్రస్తుతం అక్కడున్న ప్రజలు గొంతెండి చచ్చిపోతున్నా పట్టించుకోని అధికారులు, వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన డైనోసర్ అస్థిపంజరానికి ప్రాధాన్యతను ఇవ్వడం చుట్టూ దర్శకుడు ఈ కథను నడిపించిన విధానం ఆలోచింపజేస్తుంది.
ఇక గ్రామాలలో ఉండే కొంతమంది సర్పంచులు, ఊరు ..ప్రజలు ఏమైపోయినా ఫరవాలేదనుకుంటారు. ఏం జరిగినా అందువలన తమకి వచ్చే లాభం ఏమిటనే ఆశతోనే .. ఆలోచనతోనే ఉంటారు. అలాంటి ఒక పాత్ర మనకి ఈ కథలో తగులుతుంది. కొన్ని పల్లెల్లో జరుగుతున్న వాస్తవాలకు దగ్గరగా అనిపిస్తుంది.
తరతరాల పాటు పల్లెలు అభివృద్ధికి దూరంగా ఉండిపోతూ వచ్చాయి. అయితే తమ విలేజ్ డెవలప్ అవుతుందని ఆనందించే అవకాశం వాళ్లకి చాలా తక్కువ. ఎందుకంటే అభివృద్ధి పేరుతో పల్లెలను ఖాళీ చేయిస్తూ ఉండటమే అందుకు కారణం. అలాంటి పరిస్థితులలో తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండాలనే ఒక సందేశం మనకి ఈ కథలో కనిపిస్తుంది.
చాలా పల్లెలు ఫేస్ చేసే ఒక సమస్యను దర్శకుడు ఈ సినిమాలో చర్చించాడు. పల్లె వాసులను తరిమేయకుండా అభివృద్ధి ఎలా చేయవచ్చనే ఒక పరిష్కారాన్ని చూపించిన విధానం సరైనదిగా అనిపిస్తుంది. నటీనటులంతా తమ పాత్రలలో మెప్పించారు. మనకి ఒక సినిమా చూస్తున్నట్టుగా అనిపించదు. సైకిల్ పై తిరుగుతూ అక్కడ జరుగుతున్న సంఘటనలను ప్రత్యక్షంగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది.
త్యాగరాజన్ ఫొటోగ్రఫీ .. నివాస్ కె ప్రసన్న సంగీతం .. రామర్ ఎడిటింగ్ ఫరవాలేదు. దర్శకుడు సురేశ్ సంగయ్య ఈ సినిమా రిలీజ్ ను చూడకుండానే చనిపోయాడు. నిజంగా ఇది బాధను కలిగించే విషయమే. వినోదం పాళ్లు కాస్త తగ్గినా, సహజత్వానికి ఆయన పెద్దపీట వేసిన తీరు, సందేశాన్ని ఇచ్చిన విధానం ఎక్కువ మార్కులు తెచ్చిపెడుతుందని చెప్పాలి.
'కెనతా కానోమ్' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!
Kenatha Kanom Review
Movie Details
Movie Name: Kenatha Kanom
Release Date: 2026-06-16
Cast: Yogi Babu,Lovelyn,Raichal Rabecca,Ramakrishnan,George Maryan
Director: Suresh Sangaiah
Music: Nivas K Prasanna
Banner: RB Talkies Box Office Studio
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer