ఓటీటీలలో హారర్ థ్రిల్లర్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. అందువలన హారర్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలను ఫ్లాట్ ఫామ్ పై దింపడానికి ఓటీటీలు పోటీపడుతూ ఉంటాయి. అలా రీసెంటుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమానే 'సాతాన్: ది డార్క్'. తమిళంలో రూపొందిన ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్, మార్చి 27వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 8వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్'లో .. ఈ నెల 20వ తేదీ నుంచి 'ఆహా తమిళ్' లో స్ట్రీమింగ్ అవుతోంది.
అది ఒక కొండ ప్రాంతం. ఆ కొండ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ప్రదేశంలో కొన్ని గ్రామాలవారు నివసిస్తూ ఉంటారు. అలీషా (ఐరా) తన తల్లి మెర్సిలిన్ (మోనా బెద్రే) చెల్లెలితో కలిసి నివసిస్తూ ఉంటుంది. అలీషా చిన్నతనంలో తమ ఇంటి చీకటి గదిలో నుంచి అరుపులు .. కేకలు రావడాన్ని వింటూ ఉండేది. లోపల ఉన్నది 'విక్టోరియా' అనే విషయం ఆమెకి గుర్తుంటుంది. వాళ్లు నివసించే ఇంటికి కాస్త దూరంలో 'సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్' ఉంటుంది. ఆ స్కూల్లో అలీషా 12th క్లాస్ చదువుతూ ఉంటుంది. అదే క్లాస్ కు చెందిన సాగర్ (ఫెడ్రిక్ జాన్) అలీషాను ప్రేమిస్తూ ఉంటాడు.
కొంతకాలంగా మెర్సిలిన్ చిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఏదో క్షుద్రశక్తి తనని ఆవహించినట్టుగా, తానేం చేస్తున్నది తెలియని స్థితికి వెళ్లిపోతూ ఉంటుంది. ఆమె విపరీత ధోరణి ఇద్దరు కూతుళ్లను భయభ్రాంతులకు గురిచేస్తూ ఉంటుంది. తనని తాను గాయపరచుకోకుండా ఆమెను కాపాడుకోవడానికి అలీషా నానా తంటాలు పడుతూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో తల్లి కారణంగా అలీషా గాయపడుతూ ఉంటుంది. మెర్సిలిన్ ను స్కూల్ కి రానీయవద్దని అలీషాకి సిబ్బంది చెబుతుంది.
అలీషా ఏదో కోల్పోయినట్టుగా ఉండటం .. హాస్పిటల్ పాలవుతూ ఉండటం ఆమె లవర్ సాగర్ ను ఆలోచనలో పడేస్తుంది. ఏదో క్షుద్రశక్తి అలీషా కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుందనే విషయాన్ని అతను గ్రహిస్తాడు. ఆ శక్తి ఆమె ఇంట్లోనే ఉందనీ, అదేమిటో తెలుసుకోవాలని భావిస్తాడు. అలీషా హాస్పిటల్లో ఉండగా, తన స్నేహితుడైన మురళిని వెంటబెట్టుకుని ఆమె ఇంటికి వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? సాతాన్ బారి నుంచి అతను అలీషాను కాపాడుకోగలుగుతాడా? అనేది మిగతా కథ.
'సాతాన్' అంటే 'సైతాన్' అని అర్థం. సైతాన్ అంటే ఒక దుష్టశక్తి. క్షుద్రశక్తులను వశపరచుకున్నవారు మాత్రమే వాటిని ఆదేశించగలరు .. నియంత్రించగలరు. ఎదుటివారిపై విజయం సాధించడం కోసం .. స్వార్థపూరితమైన తమ కోరికలను నెరవేర్చుకోవడం కోసం క్షుద్రశక్తులను ఆశ్రయించేవారు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. అలా ఒక క్షుద్రశక్తిని ఆరాధించేవారి చుట్టూ, వారి బాధితుల చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
సాధారణంగా దుష్టశక్తి ఆవహించిన కూతురును కాపాడుకోవడం కోసం ఒక తల్లి ఆరాటపడే సినిమాలు, గతంలో ఈ జోనర్ నుంచి చాలానే వచ్చాయి. అయితే అందుకు భిన్నంగా దుష్టశక్తి నుంచి తన తల్లిని రక్షించుకోవడం కోసం కూతురు తపించిపోవడం కొత్తగా అనిపిస్తుంది. తల్లీకూతుళ్ల మధ్య డిజైన్ చేసిన సన్నివేశాలు అక్కడక్కడా భయపెడతాయి.
తాంత్రిక పూజలు .. దుష్టశక్తి .. తల్లీకూతుళ్ల కాంబినేషన్ లోని సన్నివేశాలు చాలా కాలంగా చూస్తూ వచ్చినవే. అయితే దర్శకుడు అలా ఈ కంటెంట్ రొటీన్ అనిపించకుండా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నాలు చేశాడు. ఆ విషయం మనకి ఈ కథ ఆరంభంలోనే అర్థమైపోతుంది. 16వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీవారి కాలంలో ఈ కథ మొదలవుతుంది. అక్కడి నుంచి ఈ కథ తాంత్రిక పూజల వైపు ఎలా వెళ్లింది? అప్పట్లో జరిగిన క్షుద్రపూజలకు .. ఇప్పుడు జరుగుతున్న విపరీతలకు సంబంధం ఏమిటి? అనే దిశగా ఈ కథను నడిపించారు.
ఈ కథలో 'విక్టోరియా' అనే పాత్రనే చాలా కీలకమైనదిగా మొదటి నుంచి మనకి అర్థమైపోతూ ఉంటుంది. దాదాపు ప్రీ క్లైమాక్స్ లోనే ఆమె పాత్ర తెరపైకి వస్తుంది. ఆమె పాత్రకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఆడియన్స్ ను వెంటాడే సందేహాలకు ఈ ఫ్లాష్ బ్యాక్ లోనే సమాధానాలు దొరుకుతాయి.
ఈ సినిమాలో చాలానే పాత్రలు కనిపిస్తాయి. అయితే ప్రధానమైన పాత్రలలో కనిపించే మోనా బెద్రే .. ఐరా .. చాందినీ తమిళరసన్ నటన హైలైట్ గా నిలుస్తుంది. మిగతా పాత్రలకు అంతగా ప్రాధాన్యత కనిపించదు. బాలాజీ రామస్వామి ఫొటోగ్రఫీ బాగుంది. లొకేషన్స్ ను కవర్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. అశ్విన్ కృష్ణ నేపథ్య సంగీతం కూడా ఈ కంటెంట్ కి హెల్ప్ అయింది. రాజ్ కుమార్ ఎడిటింగ్ ఫరవాలేదు.
ఈ కథను 16వ శతాబ్దంలో నుంచి మొదలు పెట్టిన తీరు ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆ తరువాత ఒక వైపున కాలేజ్ .. మరో వైపున చర్చ్ .. ఇంకో వైపున కాకుల దాడి .. ఇలా కొన్ని వైపుల నుంచి ప్రేక్షకులను భయపెట్టడానికి దర్శకుడు ప్రయత్నించాడు. అయితే ఆడియన్స్ దుష్ట శక్తుల కంటే కూడా రక్తపాతానికి ఎక్కువగా భయపడతారేమో అనిపిస్తుంది.
16వ శతాబ్దంతో కథను ఎత్తుకోవడం ఉత్కంఠను పెంచినప్పటికీ, ఈ మాత్రం దానికి అక్కడి నుంచి కథను ఎత్తుకోవడం అవసరమా? అని ఆ తరువాత అనిపిస్తుంది. విక్టోరియా ఫ్లాష్ బ్యాక్ మినహా, మరే విషయమూ అంతగా ప్రభావితం చేయలేకపోతుంది. ఈ రెండు అంశాలను పక్కన పెడితే, మిగతా కథ అంతా చాలా రొటీన్ గా అనిపిస్తుంది. నాలుక కోసేయడం .. కళ్లు పీకేయడం .. చిన్నపిల్లలను 'బలి' ఇవ్వడం వంటి సన్నివేశాలు చాలా దారుణంగా అనిపిస్తాయి. హింసను తప్ప, భయపెట్టడానికి ఇతర కోణాలను .. మార్గాలను అన్వేషించలేకపోయిన కంటెంట్ ఇది.
'సాతాన్: ది డార్క్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!
Satan Review
Movie Details
Movie Name: Satan
Release Date: 2026-05-08
Cast: Fredrick John,Ayraa,Chandini Tamilarasan,Sreeja Ravi,Mona Bedre,Edward
Director: Manikandan Ramalingam
Music: Aswin Krishna
Banner: EPS Pictures
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer