'మిస్టర్ ఎక్స్' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!

తమిళంలో రూపొందిన ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ 'మిస్టర్ ఎక్స్'. ఆర్య కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో శరత్ కుమార్ .. గౌతమ్ కార్తీక్ .. మంజూ వారియర్ .. అనఘ ప్రధానమైన పాత్రలను పోషించారు. ఏప్రిల్ 17వ తేదీన విడుదలైన ఈ సినిమా, నెల రోజులు తిరక్కముందే ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాకి, మను ఆనంద్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

చైనా రహస్యంగా అణుశక్తికి సంబంధించిన కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటుంది.ఈ విషయంలో అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తుంది. చైనా అణు సంబంధమైన కదలికలను తెలుసుకోవడానికంటూ, భారత్ సాయంతో హిమాలయాలలోని 'నందాదేవి' పర్వతంపై ఒక డివైజ్ ను ఏర్పాటు చేస్తారు. 7 న్యూక్లియర్ క్యాప్సుల్స్ తో కూడిన డివైజ్ అది. దానిని డిజాస్టర్ గా కూడా వాడొచ్చనే విషయాన్ని భారత్ కి చెప్పకుండగా అమెరికా దాస్తుంది. 

అయితే 'నందాదేవి' అనే పర్వతంపై ఆ డివైజ్ ను సెట్ చేయడానికి వెళ్లిన వాళ్లంతా ప్రాణాలు కోల్పోతారు. 1965 నుంచి కూడా ఆ డివైజ్ కోసం గాలింపు జరుగుతూనే ఉంటుంది. అయితే అది రష్యాలోని మిలిటెన్ గ్రూప్ చేతికి చిక్కుతుంది. దాని విషయంలో వాళ్లు తీసుకున్న నిర్ణయం మరింత ప్రమాదకరమైనది కావడంతో, 'మిస్టర్ ఎక్స్' అడ్డుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే చివరి నిమిషంలో వాళ్లకి పట్టుబడిపోయిన మిస్టర్ ఎక్స్, వాళ్ల స్థావరంలో బందీగా ఉండిపోతాడు. 

మిస్టర్ ఎక్స్ అసలు పేరు పరమేశ్వర సూర్యప్రతాప్ (శరత్ కుమార్). అతను 'రా'లో సీనియర్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. మాస్కోలోని షిప్ యార్డులో ఉన్న న్యూక్లియర్ డివైజ్ ను .. మిస్టర్ ఎక్స్ ను తీసుకురావలసిన బాధ్యతను 'రా' ఏజెంట్ గౌతమ్ (ఆర్య)కి అప్పగించబడుతుంది. అతను తన టీమ్ తో అక్కడికి బయల్దేరతాడు. అతని కదలికలపై కన్నేసిన అమరన్ చక్రవర్తి (గౌతమ్ కార్తీక్), ఆ డివైజ్ ను చేజిక్కించుకోవడానికి ప్లాన్ చేస్తాడు. 

గౌతమ్ నేపథ్యం ఏమిటి? అతని జీవితంలో 'కీర్తన' ( అనఘ)కి గల స్థానం ఎలాంటిది?  పరమేశ్వర సూర్యప్రతాప్ తో గౌతమ్ కి గల సంబంధం ఏమిటి? అడుగడుగునా గౌతమ్ కి అమరన్ చక్రవర్తి అడ్డుపడటానికి గల కారణం ఏమిటి? అణు సంబంధమైన ఒక పెద్ద ప్రమాదం నుంచి ఈ దేశాన్ని కాపాడటం కోసం గౌతమ్ చేసే ప్రయత్నాలలో ఆయనకి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది మిగతా కథ.

దేశ రక్షణకి సంబంధించిన ఒక ఆపరేషన్ చుట్టూ తిరిగే కథ ఇది. లవ్ .. ఎమోషన్ .. యాక్షన్ అనే మూడు ప్రధానమైన అంశాలను కలుపుకుంటూ దర్శకుడు ఈ కథను తయారు చేసుకున్నాడు. ఢిల్లీలోని 'రా' ప్రధాన కార్యాలయం .. చెన్నై .. రష్యా నేపథ్యంలో ఈ కథ పరిగెడుతుంది. హీరో .. విలన్ .. 'రా' టీమ్ ఈ కథలోని ప్రధానమైన పాత్రలుగా కనిపిస్తాయి. ప్రతి పాత్రను రిజిస్టర్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. 

హీరో చెల్లెలి సెంటిమెంట్ కి కట్టుబడి ఉంటాడు. అలాగే తన తండ్రిని విపరీతంగా ద్వేషిస్తూ ఉంటాడు. అందుకు సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ను వెంటనే చెప్పకుండా ఆడియన్స్ లో ఆసక్తిని రేకెత్తించాడు. ఇక ఒక సాధారణ కుటుంబానికి చెందిన కుర్రాడు, విలన్ గా మారడానికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ కూడా కాస్త బలంగానే కనిపిస్తుంది. ఆ వైపు నుంచి కూడా ప్రేక్షకులు సంతృప్తి చెందుతారు. 

ఏ తండ్రినైతే హీరో ద్వేషిస్తూ వచ్చాడో .. అదే తండ్రి కోరికను నెరవేర్చడం కోసం తన ప్రాణాలను పణంగా పెట్టడమే ఈ కథలో మరింత బలమైన అంశంగా అనిపిస్తుంది. ఇక ఏ కథనైనా నెక్స్ట్ లెవెల్ కి చేర్చేవి ట్విస్టులే. అలాంటి ట్విస్టులు ఈ కథలోను అక్కడక్కడా కనిపిస్తాయి. కాకపోతే అవి ఆడియన్స్ కి అంత షాకింగ్ గా ఏమీ అనిపించవు. కాస్త సినిమా నాలెడ్జ్ ఉన్నవాళ్లు ఈజీగా గెస్ చేయవచ్చు కూడా. 

స్పై యాక్షన్ సినిమాలలో ప్రధానమైనవిగా కనిపించేవి యాక్షన్ ఎపిసోడ్స్. కాల్పులు .. ఛేజింగులు .. ఫైటింగులు ఒక రేంజ్ లో ఉండాలి. అప్పుడే జోనర్ కి తగిన అవుట్ పుట్ వచ్చిందని ఆడియన్స్ భావిస్తారు. అలా చూసుకుంటే ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు గట్టిగానే డిజైన్ చేశారు. అందుకు సంబంధించిన ఎపిసోడ్స్ పెర్ఫెక్ట్ గానే వచ్చాయని చెప్పాలి. కాకపోతే లవ్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. 

స్పై యాక్షన్ సినిమాలు అనగానే, కథ అనేక దేశాలను చుట్టి రావలసి ఉంటుంది. అందుకు అయ్యే బడ్జెట్ కూడా భారీగానే ఉంటుంది. ఆ విధమైన భారీతనం ఈ సినిమాలో మనకి కనిపిస్తుంది. క్వాలిటీ విషయంలో రాజీ పడలేదనే చెప్పాలి. ఆర్టిస్టులంతా చాలా నేచురల్ గా చేశారు. అరుళ్ విన్సెంట్ కెమెరా పనితనం బాగుంది. దిబూ నినన్ థామస్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. ప్రసన్న ఎడిటింగ్ ఓకే. 

నిర్మాణ విలువ పరంగా ఈ సినిమాకి వంక బెట్టవలసిన పనిలేదు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం ఈ కంటెంట్ కి గట్టిగా సపోర్టు చేయడానికి తమవంతు ప్రయత్నం చేశాయి. సన్నివేశాల చిత్రీకరణ కూడా పేలవంగా ఏమీ అనిపించదు. కాకపోతే కథాకథనాలు రొటీన్ గా అనిపించడమే ప్రధానమైన లోపం. గతంలో వచ్చిన ఈ తరహా సినిమాలలో ఇది కూడా ఒకటిగా అనిపిస్తుంది అంతే. ఇక విలన్ పాత్రకి గౌతమ్ కార్తీక్ వయసు సరిపోలేదేమో అనే ఒక సందేహం కూడా ఏదో ఓ మూల కలగకుండా ఉండదు.

Movie Details

Movie Name: Mr.X

Release Date:

Cast: Arya, Gautham Ram Karthik,Sarathkumar ,Manju Warrier,Athulya Ravi,Anagha

Director: Manu Anand

Producer: Lakshman Kumar - Vineet Jain

Music: Dhibu Ninan Thomas

Banner: Prince Pictures

Mr.X Rating: 2.00 out of 5

Trailer

More Movie Reviews